కార్పోరేటర్ గా పోటీ...వామ్మో ఎంత ఖర్చో తెలుసా ?
స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. రెండు నెలలలో ఎన్నికలు ఉన్నాయి.
By: Satya P | 25 Aug 2026 9:33 AM ISTస్థానిక ఎన్నికల నగారా మోగనుంది. రెండు నెలలలో ఎన్నికలు ఉన్నాయి. పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్లు జెడ్పీ చైర్మన్లు మేయర్ ఎన్నికలు వరసగా జరగనున్నాయి. దాంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయం వేడెక్కిపోతోంది. ఇక విశాఖ వంటి చోట్ల మేయర్ పదవితో పాటు ప్రస్తుతం ఉన్న 98 డివిజన్లకు అదనంగా మరో 22 దాకా పెరుగుతాయని అంచనా ఉంది. దాంతో 120 దాకా డివిజన్లతో మహా విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. విశాఖ నగర పరిధితో పాటు అనకాపల్లి, భీమునిపట్నం గాజువాక పెందుర్తి అంతా కూడా జీవీఎంసీ పరిధిలోకి వస్తుంది.
మంత్రి పదవి సాటి :
జీవీఎంసీ అంటే ఏపీలోనే అతి పెద్ద కార్పోరేషన్ కావడంతో పాటు ఏడాదికి అయిదు వేల కోట్ల బడ్జెట్ తో నడుస్తుంది. దాంతో మేయర్ పీఠం చాలా ప్రతిష్ట తో కూడుకున్నది. దీని మీద కూటమి పార్టీలతో పాటు వైసీపీ కూడా ఫోకస్ పెట్టింది. తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద అవిశ్వాసం పెట్టి చివరి ఏడాది మాత్రమే మేయర్ పదవిని దక్కించుకుంది. దాంతో ఈసారి అయిదేళ్ళ పాటు తమకే ఈ పదవి అట్టిపెట్టుకునే వీలుంది. ఎందుకంటే ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మేయర్ పదవి కోసం మిత్ర పక్షాలలో జనసేన కూడా ఆశిస్తోంది అని అంటున్నారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం బీజేపీ ఆశలు పెట్టుకుంది.
బలమైన స్థానాలలో :
ఇదిలా ఉంటే జనసేన అయితే జీవీఎంసీ ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది. ఈసారి ఎక్కువ డివిజన్లు గెలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. తాజాగా జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఇదే విషయాన్ని నాయకులు స్పష్టం చేశారు. జనసేన ఈ ఎన్నికల ద్వారా బలపడాలని కోరుకుంటున్నారు. వార్డుల సంఖ్య 120 దాకా పెరుగుతాయి కాబట్టి జనసేనకు ఎక్కువ సీట్లు వస్తాయని ఆశిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న వివిధ నియోజకవర్గాల్లో కూడా తమ బలాన్ని బట్టి సీట్లను పొత్తులో భాగంగా జనసేన కోరుకుంటోంది. అలాగే బీజేపీ కూడా విశాఖలో తమకు పట్టు ఉందని గుర్తు చేస్తోంది. దాంతో విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో మిత్ర పార్టీలకు సీట్లు కేటాయించడం టీడీపీకి ఒక విధంగా సవాల్ గా మారుతోంది అని అంటున్నారు.
భారీగానే ఖర్చు :
జీవీఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ గా పోటీకి పలువురు ఔత్సాహికులు ఎదురు చూస్తున్నారు. అయితే పోటీ చేస్తామన్న ప్రతీ వారికీ సీటు ఇచ్చేందుకు ప్రధాన పార్టీలు సుముఖంగా లేవని అంటున్నారు. అర్ధ బలం అంగబలం గట్టిగా ఉన్న వారికే సీట్లు అని కూడా చెబుతున్నారు. ఈసారి హోరా హోరీ పోరు సాగనుంది అని తెలుస్తోంది. వైసీపీ కూడా మొత్తం 120 డివిజన్లకు సొంతంగా పోటీకి తయారు అవుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ 59 సీట్లు గెలుచుకుంది.అందులో సగానికి సగం మంది కూటమి పార్టీలలో చేరిపోయారు.మిగిలిన వారికి తప్పకుండా టికెట్లు ఇస్తామని అప్పట్లోనే వైసీపీ పెద్దలు హామీ ఇచ్చారు. దాని ప్రకారం ముప్పయి మంది దాకా సిట్టింగ్ కార్పొరేటర్లకు ముందే సీట్లు రిజర్వ్ అయిపోయాయని అంటున్నారు. ఇక మిగిలిన చోట్ల గట్టి అభ్యర్థులను నిలబెట్టాల్సి ఉంది. అయితే వైసీపీ కూడా భారీగా ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్న వారికే ఎంపిక చేయాలని చూస్తోంది.
బాబోయ్ అంటున్నారు :
ప్రతీ వార్డులో నిలబడే ప్రధాన పార్టీల కార్పోరేటర్ అభ్యర్ధులు ఈ ఎన్నికల్లో ఖర్చు చేయాల్సింది చూస్తే మతి పోతోంది. ప్రచారంలో ఉన్న దాని ప్రకారం చూస్తే ఒక్కో అభ్యర్ధి రెండు కోట్ల దాకా తీసి ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. ఒక వార్డులో నిలబడే కార్పోరేటర్ అభ్యర్ధి రెండు కోట్లు అంటే మాటలు కాదు, మొత్తం 120 వార్డులు ఉండబోయే జీవీఎంసీలో ఈ మొత్తం ఎన్నికల ఖర్చు రెండు పార్టీల నుంచి చూస్తే అచ్చంగా 500 వందల కోట్ల దాకా అవుతుంది. దీనిని మేయర్ అభ్యర్ధుల ఖర్చు అదనం అంటున్నారు. కూటమి వైసీపీ నుంచి చెరో పాతిక కోట్లతో అభ్యర్ధులు రెడీ అవాల్సిందే అని అంటున్నారు. మొత్తానికి ఒక్క కార్పోరేషన్ కే వందల కోట్లు ఖర్చు అంటే మొత్తం లోకల్ బాడీ ఎన్నికలకు ఎంత ఖర్చు అన్నది చూస్తే బుర్ర తిరిగిపోయేలా ఉంది అని అంటున్నారు.
