వైసీపీ ఇప్పుడైనా తగ్గాల్సిందే.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఎంట్రీతో కన్ఫూజన్ క్లియర్!
విశాఖ గూగుల్ హబ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ లాజిక్ లేవనెత్తినా, ప్రజల్లో మాత్రం సానుకూల చర్చే ఎక్కువగా జరుగుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు
By: Tupaki Political Desk | 18 Oct 2025 12:17 PM ISTవిశాఖ ‘గూగుల్ హబ్’పై వైసీపీ చేస్తున్న ప్రచారానికి ఇకనైనా పుల్ స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా వెలుపల తొలిసారిగా భారీగా ఏపీలోనే పెట్టుబడులు పెడుతున్నట్లు గూగుల్ ప్రకటించిన వెంటనే వైజాగ్ పై జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతోంది. రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.80 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఒప్పందంతో కూటమి ప్రభుత్వం మైలేజ్ పెరిగిందనే విశ్లేషణలు వినిపించాయి. అయితే ప్రభుత్వ ప్రచారంతో విభేదిస్తున్న వైసీపీ.. వైజాగ్ కు గూగుల్ రావడాన్ని బహిరంగంగా వ్యతిరేకించలేక, 1.80 లక్షలు ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెప్పడాన్ని తిరస్కరిస్తోంది. గూగుల్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 1.80 లక్షల ఉద్యోగాలు లేవని, విశాఖలో ఆ స్థాయి ఉద్యోగాలు ఎలా వస్తాయని వైసీపీ ప్రశ్నిస్తోంది.
విశాఖ గూగుల్ హబ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ లాజిక్ లేవనెత్తినా, ప్రజల్లో మాత్రం సానుకూల చర్చే ఎక్కువగా జరుగుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గూగుల్ హబ్ పై జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో ప్రత్యేక కథనాలు రావడంతోపాటు సోషల్ మీడియాలో ఐటీ అనువజ్ఞులు చేస్తున్న విశ్లేషణలకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని అంటున్నారు. దీంతో గూగుల్ ఉద్యోగాలపై వైసీపీ లేవనెత్తిన ప్రశ్నలకు విలువ లేకుండా పోతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో గూగుల్ సీఈవో వైజాగ్ లో తమ ఏఐ హబ్ ఏర్పాటుపై మరోమారు స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వైజాగ్ ను అందమైన నగరంగా అభివర్ణించిన గూగుల్ సీఈవో తమ పెట్టుబడులకు దక్షిణభారత్ లో విశాఖను ఎంచుకోవడంపై ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేకాకుండా ఈ విషయంపై ప్రధానితోనూ చర్చించినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. దీంతో వైసీపీ వాదన మరింత బలహీనమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గూగుల్ రాకతో విశాఖకు మరిన్ని ఏఐ అనుబంధ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం చెప్పినట్లు 1.80 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అంతా ఏకీభవిస్తున్నారు. వైసీపీ వాదనను ప్రజలు నమ్మితే.. గూగుల్ కు వ్యతిరేకంగా చర్చ ఇప్పటికే మొదలయ్యేదని, కానీ పరిస్థితుల్లో ఎక్కడా ఆ అవకాశం కనిపించడం లేదని అంటున్నారు.
వైజాగ్ గూగుల్ హబ్ వల్ల భవిష్యత్తులో ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోనున్నాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. అంటే ప్రభుత్వం చెప్పినట్లు 1.80 ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన పరోక్షంగా తెలియజేసినట్లే అంటున్నారు. ఆ స్థాయిలో గూగుల్ ఉద్యోగాలు ఇవ్వకపోయినా అనుబంధ రంగాలు, పరోక్ష ఉపాధితో విశాఖ రూపురేఖలు మారిపోయే అవకాశాలు ఉన్నాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అభిప్రాయంగా భావించాలని అంటున్నారు. సుందర్ పిచాయ్ మాటలు కూటమి పార్టీలకు మరింత శక్తినివ్వగా, వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటికైనా గూగుల్ పై వైసీపీ చేస్తున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
