వైజాగ్ ఆదాయం చూస్తే షాక్ అవ్వాల్సిందే! ఏపీ జీఎస్డీపీ వృద్ధిలో సరికొత్త రికార్డులు..
రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రూ. 1,61,009 కోట్ల జీడీపీతో విశాఖ సత్తా చాటింది.
By: Tupaki Political Desk | 8 May 2026 11:11 AM ISTరాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రూ. 1,61,009 కోట్ల జీడీపీతో విశాఖ సత్తా చాటింది. గురువారం నుంచి జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, జిల్లా స్థాయి పురోగతి, డేటా ఆధారిత పరిపాలన, స్వర్ణ ఆంధ్ర - 2047 దార్శనికత అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం వెల్లడించారు.
స్వర్ణ ఆంధ్ర - 2047 విజన్ కింద రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించింది. 2047 నాటికి రాష్ట్ర జీఎస్డీపీని రూ. 308 లక్షల కోట్లకు, తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ లక్ష్యాల సాధనకు మార్గదర్శకంగా “పది సూత్రాలు” మిషన్ ఫ్రేమ్‌వర్కును అమలులోకి తీసుకువచ్చారు. అభివృద్ధి పురోగతిని నిరంతరం కొలిచేందుకు 651 కీలక పనితీరు సూచికలతో కూడిన సమగ్ర డ్యాష్‌బోర్డును రూపొందించారు. ఇందులో 232 ఆర్థిక సూచికలు, 304 పాలన సూచికలు, 115 సామాజిక–సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు (SDGs) సంబంధించిన సూచికలు ఉన్నాయి. జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిల వరకు నెలవారీ పనితీరు నివేదికలను ప్రవేశపెట్టి, అభివృద్ధి ఫలితాలను క్రమబద్ధంగా పర్యవేక్షించే వ్యవస్థను ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఇక సదస్సులో 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం రూ.17.62 లక్షల కోట్ల జీఎస్డీపీతో 10.75% వృద్ధిని నమోదు చేసిందని వెల్లడించారు. దేశ సగటుతో పోలిస్తే ఇది గణనీయమైన పురోగతిగా పేర్కొన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగం 7.83% వృద్ధిని నమోదు చేయగా, చేపల పెంపకం రంగం 19.07% వృద్ధితో అత్యుత్తమ పనితీరు కనబరిచింది. నిర్మాణ రంగం 13.05%, కమ్యూనికేషన్స్ రంగం 17.05%, బ్యాంకింగ్ & భీమా రంగం 15.45% వృద్ధిని సాధించాయి. పరిశ్రమల రంగం మొత్తం మీద 9.53%, సేవల రంగం 12.94% వృద్ధిని నమోదు చేశాయి. ఈ పురోగతి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని సూచిస్తున్నదని అధికారులు వివరించారు.
మరోవైపు జిల్లాల వారీగా పరిశీలిస్తే, బాపట్ల జిల్లా 19.19% వృద్ధితో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. విశాఖపట్నం జిల్లా రూ.1,61,009 కోట్ల జీడీపీతో రాష్ట్ర ఆర్థిక కేంద్రంగా నిలిచింది. తలసరి ఆదాయంలో కూడా రూ.6.58 లక్షలతో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఎన్టీఆర్, కృష్ణా, తిరుపతి, ఏలూరు జిల్లాలు కూడా మంచి ఆర్థిక పురోగతిని నమోదు చేశాయి. మరోవైపు, అన్నమయ్య జిల్లా మైనస్ 1.35% ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. దీంతో ఆ జిల్లాపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం నమోదవడం ప్రాంతీయ అసమానతలను సూచిస్తున్నదని అభిప్రాయం వ్యక్తమైంది.
ఇదే సమయంలో 2026–27 సంవత్సరానికి మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించారు. జీఎస్డీపీని రూ.20.36 లక్షల కోట్లకు పెంచి 15.53% వృద్ధి సాధించాలన్నది ప్రధాన లక్ష్యం. వ్యవసాయ, అనుబంధ రంగం 14.04%, పరిశ్రమల రంగం 17.47%, సేవల రంగం 15.80% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉపరంగాల వారీగా చూస్తే, చేపల పెంపకం రంగానికి 20.66%, నిర్మాణ రంగానికి 20.5%, మైనింగ్‌కు 18%, తయారీ రంగానికి 15.5%, వాణిజ్యం–హోటళ్లు–రెస్టారెంట్లకు 16.5%, బ్యాంకింగ్, బీమా రంగాలకు16% వృద్ధి లక్ష్యాలను నిర్ణయించారు. తలసరి ఆదాయాన్ని రూ.2,94,507 నుంచి రూ. 3,39,404కు పెంచి 15.24% వృద్ధిని సాధించాలన్నది మరో కీలక లక్ష్యంగా పేర్కొన్నారు.
2025–26లో నమోదైన 10.75% జీఎస్డీపీ వృద్ధి రాష్ట్రానికి బలమైన ఆర్థిక పునాదిని అందించగా, 2026–27లో 15.53% వృద్ధి లక్ష్యం సాధించదగినదిగా సదస్సు విశ్వాసం వ్యక్తం చేసింది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నెలవారీ పనితీరు ట్రాకింగ్, విలువ జోడింపు, AI ఆధారిత పరిపాలన, కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలు, డేటా ఆధారిత నిర్ణయ వ్యవస్థలు కలిసి స్వర్ణ ఆంధ్ర - 2047 దిశగా రాష్ట్రాన్ని స్థిరమైన, సమగ్ర, వేగవంతమైన అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపిస్తున్నాయని సదస్సు స్పష్టం చేసింది.
