Begin typing your search above and press return to search.

విశాఖ రాజకీయం...వారికి బంపర్ ఆఫర్

సిటీ ఆఫ్ డెస్టినీగా చెప్పుకునే విశాఖలో రాజకీయం కూడా బాగానే రాణిస్తుంది. ఎందరో విశాఖలో సెటిల్ అయి ఉన్నత పదవులు అందుకున్నారు.

By:  Satya P   |   28 March 2026 5:00 AM IST
విశాఖ రాజకీయం...వారికి బంపర్ ఆఫర్
X

సిటీ ఆఫ్ డెస్టినీగా చెప్పుకునే విశాఖలో రాజకీయం కూడా బాగానే రాణిస్తుంది. ఎందరో విశాఖలో సెటిల్ అయి ఉన్నత పదవులు అందుకున్నారు. ఎంపీ ఎమ్మెల్యే మంత్రి ఇలా కీలక స్థానాలకు చేరుకున్నారు. విశాఖ ఎవరిని కాదనకుండా ఆదరించింది. కాస్మోపాలిటన్ సిటీ కల్చర్ విశాఖలో ఉండడంతో ఉద్యోగ వ్యాపార అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన వారు ప్రజా ప్రతినిధులుగా జనం చేత జేజేలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు ఎంపీ సీట్లు 15 దాకా అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇపుడు కొత్తగా చేపట్టబోయే డీ లిమిటేషన్ తరువాత ఏకంగా 23 దాకా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని అంటున్నారు.

మరో ఎంపీ సీటు :

ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ, అనకాపల్లి, అరకు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. అయితే ఇపుడు అదనంగా మరో ఎంపీ సీటు ఏర్పడవచ్చు అని చర్చ సాగుతోంది. దాంతో ఆశావహులలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అంతే కాదు ఎనిమిది దాకా అసెంబ్లీ సీట్లు రానున్నాయి. అవి ఎక్కడెక్కడ అన్నది కూడా హాట్ డిస్కషన్ గా ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పెద్ద అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే మూడు లక్షలకు పైగా ఉన్నవి చూస్తే భీమిలీ, పెందుర్తి, గాజువాకా ఉన్నాయి. ఇవి కచ్చితంగా రెండు అవడం ఖాయమని అంటున్నారు. ఇవన్నీ 2011 నాటి జనాభా లెక్కలు. ఇపుడు చూస్తే మరో రెండు పెద్ద నియోజకవర్గాలు ఉన్నాయని అంటున్నారు. అవి చూస్తే కనుక పాయకరావుపేట కూడా విభజించబడి రెండుగా మారుతుంది అని అంటున్నారు. అలాగే విశాఖ తూర్పు అసెంబ్లీ కూడా రెండు సీట్లుగా ఏర్పడనుంది అని అంటున్నారు.

పాత సీట్లు పునరుద్ధరణ :

ఇక 2009 వరకూ ఉన్న పాత సీట్లు పునరుద్ధరించబడతాయని అంటున్నారు. అలా చూస్తే కనుక పెందుర్తి నుంచి విడిపోయి మరో సీటుగా పరవాడ ఏర్పడనుంది అని చెబుతున్నారు. అలాగే నర్శీపట్నం అసెంబ్లీ నుంచి విడిపోయి సమీపంలో ఉన్న కొంత భాగం కలుపుకుని చింతపల్లి అసెంబ్లీ ఎస్టీ సీటు ఏర్పడుతుంది అని అంటున్నారు. ఇక అనకాపల్లి రూరల్ అని మరో సీటు రాబోతోంది అని అంటున్నారు. పాయకరావు పేట రెండుగా మారితే ఇంకో ఎస్సీ సీటు వస్తుందని లెక్క వేస్తున్నారు. భీమిలీ రెండు అయితే కొత్తగా మధురవాడ అసెంబ్లీ సీటు ఏర్పడుతుందని అంటున్నారు.

రంగంలోకి వారసురాళ్ళు :

ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడవ వంతు సీట్లు మహిళలకు కేటాయిస్తారు. దాంతో కనీసంగా ఏడు నుంచి ఎనిమిది దాకా సీట్లు వారికి దక్కుతాయని చెబుతున్నారు. దాంతో వివిధ పార్టీలలో ఉన్న మహిళా నేతలకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు దక్కనున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా పార్టీలలో చురుకుగా పనిచేస్తున్న మహిళా నేతలతో పాటు వారసురాళ్ళు కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఈ పరిణామాలు అన్నీ కూడా మహిళా నేతలకు పండుగని తెస్తున్నాయని అంటున్నారు. ఇంతకాలం రాజకీయంగా ఇబ్బందులు పడిన వారు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా రానున్న రోజులలో లక్కీ చాన్స్ కొట్టేస్తారు అని అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉమ్మడి విశాఖలోనే భారీగా సీట్ల పెరుగుదల ఉండడంతో అంతా ఆసక్తిగా పరిణామాలను గమనిస్తున్నారు.