Begin typing your search above and press return to search.

మరో దావోస్ గా...బాబు ప్లాన్ అదుర్స్

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాన్స్ ఎపుడూ అదుర్స్ అన్నట్లుగానే ఉంటాయి. ఆయన ఏమి చేసినా అందులో ఎంతో దూర దృష్టి ఉంటుంది.

By:  Satya P   |   20 Oct 2025 9:10 AM IST
మరో దావోస్ గా...బాబు ప్లాన్ అదుర్స్
X

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాన్స్ ఎపుడూ అదుర్స్ అన్నట్లుగానే ఉంటాయి. ఆయన ఏమి చేసినా అందులో ఎంతో దూర దృష్టి ఉంటుంది. అలాగే ఆయన దార్శనికత కూడా కనిపిస్తుంది మరో పాతిక రోజులలో విశాఖలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. ఆయన విశాఖలో భారీ పెట్టుబడుల సదస్సుని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14, 15 తేదీలలో విశాఖ వేదికగా జరిగే ఈ సదస్సుని ఆయన ఆషామాషీగా నిర్వహించాలని అసలు అనుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే గడచిన మూడు నెలలుగా బాబు విశాఖ సదస్సు మీదనే రాత్రీ పగలు పనిచేస్తున్నారు అని చెప్పాల్సి ఉంటుంది.

గడచిన అనుభవాలు :

విభజన ఏపీకి తొలిసారి సీఎం అయిన చంద్రబాబు అప్పట్లో మూడు సార్లు విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆనాటి పరిస్థితులకు తగిన విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులను సాధించారు. అందులో చాలా వరకు గ్రౌండింగ్ అయ్యాయి. ఇంకా పెండింగులో కొన్ని ఉన్నాయి. ఈలోగా ప్రభుత్వం మారింది. ఇపుడు బాబు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ధీటుగా మరో పెట్టుబడి సదస్సుని విశాఖలో నిర్వహిస్తున్నారు.

దావోస్ మాదిరిగా :

ప్రతీ ఏటా ప్రపంచం మొత్తం దావోస్ వెళ్తుంది. అక్కడ పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు అనేకే దేశాల ముఖ్యమంత్రులు కీలక నేతలు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు. అలాంటి వేడుకనే విశాఖలో కూడా చేపట్టాలని బాబు చూస్తున్నారు. విశాఖను కూడా దావోస్ కి సరిసాటిగా మార్చాలని చూస్తున్నారు. ఈ సదస్సు అంటే కేవలం పెట్టుబడులను ఆకర్షించడం ఒప్పందాలు వంటివి మాత్రమే కాకుండా ఏపీ భవిష్యత్తు దశ దిశా మార్చే విధంగా చేయాలని చూస్తున్నారు.

మేధ మధనం తో :

ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు హాజరవుతున్నారు అంతే కాకుండా భారీ పారిశ్రామికవేత్తలు కూడా పాలు పంచుకుంటున్నారు. వారిని అందరినీ ఒక చోట చేర్చి విశాఖ సహా ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి, భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఒక మేధ మధనాన్ని నిర్వహించాలని అనుకుంటున్నారు. దాని ద్వారా ఏపీ రానున్న సంవత్సరాలలో పారిశ్రామికంగా ఏ విధంగా పరుగులు తీయాలి అన్నది కూడా ఒక బ్లూ ప్రింట్ గా ఈ సదస్సు ఇస్తుందని ఆయన భావిస్తున్నారు.

పాలసీ మేకర్స్ తో :

సాధారణంగా పాలసీ మేకర్స్ గా అధికారులు ప్రభుత్వ పెద్దలు ఉంటారు. అదే సమయంలో పెట్టుబడిదారుల ఆనాక్షలు వేరే విధంగా ఉంటాయి. వారితో కలసి మేధ మధనం జరిపినట్లు అయితే పెట్టుబడులకు అనుకూలంగా పలసీలు తయారు చేయవచ్చు అన్నది బాబు ఆలోచన. అందుకే వారిని వీరినీ ఒక చోటకు చేర్చి అర్ధవంతమైన చర్చలు జరిగేలా రెండు రోజుల విశాఖ సదస్సుని ఆయన రూపొందిస్తున్నారు. మొత్తం మీద చూస్తే కనుక విశాఖను మరో దావోస్ గా మార్చేందుకు బాబు చేస్తున్న ఈ కసరత్తు నవంబర్ నెలలో ఏపీ రూపు రేఖలను సమూలంగా మారుస్తుందని అంతా ఆశిస్తున్నారు.