విశాఖ హర్రర్.. యూట్యూబ్ వీడియోలు చూసి అత్తను చంపిన కోడలు
టీవీ వైర్లు తగిలి మంటలు అంటుకున్నట్లుగా పిల్లలకు చెప్పి నమ్మించిన లలిత.. వియ్యపురాలి కేకలతో హటాత్తుగా బయటకు వచ్చిన లలిత తల్లి వచ్చేసరికి ఆమె చనిపోయింది.
By: Garuda Media | 9 Nov 2025 11:13 AM ISTరోజులు గడుస్తున్న కొద్దీ.. అనుబంధాలపై అనుమానం కలిగేలా.. కొత్త సందేహాలకు తావిచ్చేలా.. భయానికి గురి చేసేలా ఉంటున్న కొన్ని ఉదంతాలు ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు చెప్పేది కూడా ఆ కోవకు చెందిన దారుణమే. విశాఖకు చెందిన కోడలు 66 ఏళ్ల వయసున్న తన అత్తను యూట్యూబ్ వీడియోలు చూసి చంపేసిన వైనం కలకలాన్ని రేపుతోంది. షాకింగ్ కు గురి చేసిన ఈ ఉదంతం గురించి పోలీసులు వివరాలు వెల్లడించారు.
భర్తకు తన గురించి అత్త కనకమహాలక్ష్మి చాడీలు చెబుతుందని కక్ష పెంచుకుంది విశాఖకు చెందిన కోడలు లలిత. ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం యూట్యూబ్ లో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియోలను పలుమార్లు చూసింది. పక్కాగా ప్లాన్ వేసుకుంది. ఈ నెల ఆరున పెట్రోల్ కొని తెచ్చి ఇంట్లో దాచుకున్న లలిత.. ఏడో తేదీ ఉదయం వేళలో భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో కొడుకు.. కుమార్తె, లలిత తల్లి కూడా ఇంట్లోనే ఉన్నారు.
తన తల్లి స్నానానికి వెళ్లిన సమయంలో ఆమె బయటకు వచ్చే వేళకు అత్తను చంపేయాలని నిర్ణయించుకున్న లలిత.. ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లూ.. చేతలు కుర్చీకి కట్టేసింది క ళ్లకు.. నోటికి గంతలు కట్టేసి మీరు దాక్కోండి అంటూ ఆట ఆడినట్లుగా పిల్లల్ని వారి గదుల్లోకి పంపి.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. అత్త అరుపులు పక్క వారికి వినిపించకుండా ఉండేందుకు టీవీ సౌండ్ భారీగా పెంచేసింది. మంటకు కనకమహాలక్ష్మి కాళ్లు.. చేతులకు కట్టిన కట్లు కాలిపోయి విడిపోయాయి. ఆమె పెద్దగా కేకలు వేసుకుంటూ దేవుడి గది వైపుపరుగులు తీసింది. అక్కడే ఉన్న మనమరాలికి కూడా మంటలు అంటుకొని కాళ్లు.. చేతులు కాలాయి.
టీవీ వైర్లు తగిలి మంటలు అంటుకున్నట్లుగా పిల్లలకు చెప్పి నమ్మించిన లలిత.. వియ్యపురాలి కేకలతో హటాత్తుగా బయటకు వచ్చిన లలిత తల్లి వచ్చేసరికి ఆమె చనిపోయింది. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ తో అత్త చనిపోయినట్లుగా స్థానికులకు.. దేవుడి గదిలో దీపం ఒత్తి అంటుకొని కాలిపోయినట్లుగా పోలీసులకు చెప్పటంతో అనుమానం వచ్చింది. మంటలు అర్పేందుకు ఎదుటి ఇంట్లో ఏసీ బిగిస్తున్న వ్యక్తి వచ్చే ప్రయత్నం చేస్తే.. అతడ్ని అడ్డుకుంది. దీంతో పోలీసులకు మరింత అనుమానం పెరిగింది.
విచారణలో భాగంగా ఆమె ఫోన్ ను చెక్ చేయగా.. యూట్యూబ్ లో హౌ టు విల్ ఓల్డ్ లేడీ అంటూ వెతికిన వీడియోల జాబితా రావటంతో.. తమదైన శైలిలో పోలీసులు విచారించగా.. తాను చేసిన నేరాన్ని ఒప్పుకొని తనను క్షమించాలని ప్రాధేయపడింది. సూటిపోటిమాటలతో వేధించటం.. భర్తకు చాడీలు చెప్పటంతోనే తాను అలా చేసినట్లుగా పేర్కొంది. ఆమెపై హత్యానేరాన్ని నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. అత్త సూటిపోటి మాటలు అంటే.. భర్తకు అర్థమయ్యేలా చెప్పి..తన సమస్యకు పరిష్కారం వెతకాలే తప్పించి.. ఇలా చంపేసే ప్లాన్ వేయటం.. దాని కోసం యూట్యూబ్ లను చూడటం షాకింగ్ గా మారింది.
