విశాఖలో ఏఐ వర్శిటీ- ఐటీ కేపిటల్ గా !
ఐటీ హబ్ గా ఉన్న విశాఖలో కృత్రిమ మేధ ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
By: Satya P | 2 Feb 2026 8:30 AM ISTఐటీ హబ్ గా ఉన్న విశాఖలో కృత్రిమ మేధ ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్ లో ఈ అంశాన్ని చేరించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ని ప్రవేశపెడుతూ ఈ విషయం మీద కీలక ప్రకటన చేశారు. దాంతో విశాఖ దశ తిరుగుతుందని అంతా భావిస్తున్నారు.
కొత్త మైనింగ్ మినరల్స్ కోసం :
కేంద్ర బడ్జెట్ లో మరో కీలకమైన అంశం ఏంటి ఏంటే కొత్త మైనింగ్ మినరల్స్ లో ఆంధ్రప్రదేశ్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వడంగా చెబుతున్నారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజక వర్గంలో బంగారు నిల్వలు ఉన్నట్లు కేంద్ర బృందం ఇటీవల నిర్వహించిన పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయి. దాంతో కేంద్రం తాజా నిర్ణయంతో రాయలసీమలో మేలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు.
బడ్జెట్ విశేషాలు ఇవే :
ఈసారి కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయానికి నిధులు పెంచడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. అదే విధంగా పంట ఉత్పత్తి, మార్కెటింగ్, ప్రాసెసింగ్, ఎగుమతులు ఇలా ఏ రంగానికి ఆ రంగానికి నిధుల పెంపుదలతో అన్నింటినీ కలిపే సమగ్ర దృక్పథంతో ఈ బడ్జెట్ ని రూపకల్పన చేశారు అని అంటున్నారు. అలాగే మౌలిక రంగానికి పెద్ద పీట వేయడం జరిగింది. దీని వల్ల దేశంలోని అనేక రాష్ట్రాలకు దీర్ఘకాలంలో మేలు జరుగుతుందని అంటున్నారు. జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలుగా ఉన్న రోడ్లు, రైల్వేలు, పోర్టులు, ఇండస్ట్రీల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ లాంటి కొత్త రాష్ట్రానికి మేలు జరుగుతుందని అంటున్నారు.
డిజిటల్ ఎకానమీ కోసం :
దేశంలో ఏఐ వర్శిటీల స్థాపన. విదేశీ కంపెనీలు దేశంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసుకుంటే పన్ను రాయితీలు వంటి వాటి ద్వారా డిజిటల్ రంగం అభివృద్ధి చెందేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీని వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధిఅవకాశాలకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు. అలాగే నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి వాటిని ప్రోత్సహించడం ద్వారా డిజిటల్ ఎకానమీకి ఈసారి బడ్జెట్ లో పెద్ద పీట వేసినట్లుగా కనిపిస్తోంది.
మధ్యతరగతికి ఊరట :
ఈసారి బడ్జెట్ లో మధ్యతరగతి వర్గాల విషయం చూసుకుంటే పన్నుల సరళీకరణ చేయడం జరిగింది. అలాగే మౌలిక వసతులపై భారీ పెట్టుబడులు పెట్టడం కీలక అంశంగా ఉంది. ఇక ఆరోగ్యం–విద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మధ్యతరగతి కుటుంబాలపై భారం తగ్గించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది అన్నడి బడ్జెట్ ని విశ్లేషించిన వారు చెబుతున్న మాట.
