Begin typing your search above and press return to search.

డేటా సెంటర్లతో విశాఖ ఎలా మారనుంది? నగరం రూపురేఖలపై సరికొత్త చర్చ

డేటా సెంటర్లే కాకుండా విశాఖ నగరం టెక్నాలజీ రంగంలో దూసుకుపోతోంది. వచ్చే నెలలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం కాబోతోంది.

By:  Tupaki Political Desk   |   11 Oct 2025 3:00 PM IST
డేటా సెంటర్లతో విశాఖ ఎలా మారనుంది? నగరం రూపురేఖలపై సరికొత్త చర్చ
X

"సిటీ ఆఫ్ డెస్టినీ" విశాఖపట్నం భవిష్యత్తు మరింత ఆశాజనకంగా కనిపిస్తోంది. భారతదేశ భవిష్యత్తు నగరాలలో ఒకటిగా ఎదిగే క్రమంలో విశాఖపట్నం ఇప్పుడు ఏపీ ఐటీ రాజధానిగా మారుతోంది. సహజ అందాలు, పారిశ్రామిక ప్రాధాన్యం ఉన్న విశాఖ నగరానికి కూటమి పాలనలో అత్యధిక ప్రోత్సాహం లభిస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద డేటాసెంటర్ హబ్ గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం భావించడంతో ఇప్పుడు విశాఖ ఏఐ సిటీగా మారుతోంది.

విశాఖలో పెద్ద ఎత్తున డేటా సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దిగ్గజ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ నెల 12న సిఫీ టెక్నాలజీ సంస్థకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేయనుండగా, 14న ఢిల్లీలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫో రూ.87,520 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు ప్రకటన చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ ప్రకటన చేయొచ్చని అంటున్నారు. అదేవిధంగా టీసీఎస్ కూడా లక్ష కోట్లతో 1000 మెగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకువచ్చింది. వచ్చేనెలలో టీసీఎస్ డేటా సెంటరుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.

డేటా సెంటర్లే కాకుండా విశాఖ నగరం టెక్నాలజీ రంగంలో దూసుకుపోతోంది. వచ్చే నెలలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం కాబోతోంది. రూ.1400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న టీసీఎస్ సర్వీస్ సెంటర్ 12,000 కొత్త ఉద్యోగాలు తీసువస్తోంది. దీంతోపాటు కాగ్నిజెంట్, యాక్సెంచర్, సత్వా, ఏఎంఎన్ఎస్ ద్వారా మరో 40వేల ఉద్యోగాలు విశాఖకు రానున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు ఐటీ మరోవైపు డేటా సెంటర్ల ద్వారా ఏపీ ఐటీ రాజధానిగా ఆవిర్భవిస్తున్న విశాఖ కేంద్రంగా మరికొన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 15 నెలల్లో విశాఖ చుట్టుపక్కల వివిధ పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు కుదిరాయి. ఇలా విశాఖ రీజియన్ లో కొత్త పెట్టుబడులు కింద మొత్తం రూ.6 లక్షల కోట్లతో పరిశ్రమలు ప్రారంభం కాబోతున్నాయి. ఎన్టీపీసీ రూ.2 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ అభివృద్ధి చేస్తోంది. ఆర్సెలర మిట్టల్ రూ.130 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్, క్యాపటివ్ పోర్టు నిర్మించనుంది. వీటి ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. మరోవైపు డేటా సెంటర్లకు అనుబంధంగా ఆర్ఠిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఏఐ స్టార్టప్స్, ఏఐ ఆధారిత ఇతర కంపెనీలు విశాఖకు రానున్నాయని విశ్లేషిస్తున్నారు.

డేటా సెంటర్ల వల్ల హైస్పీడ్ కంప్యూటింగ్, యానిమేషన్, గేమింగ్, వీహెచ్ఎఫ్ఎక్స్, ఏఐ క్లౌడ్ రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా ఉపాధి పొందే వారి కంటే అంతకు పదిరెట్లకు పైగా పరోక్ష ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం జరిగిన ఒప్పందాలు, చర్చల దశలో ఉన్న ఇతర పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే విశాఖ నగరం వచ్చే రెండు మూడేళ్లలోనే సరికొత్త రూపు సంతరంచుకోవడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే పర్యాటకంగా పారిశ్రామికంగా దూసుకుపోతున్న విశాఖ ఏఐ, డేటా రంగాలతో స్మార్ట్ సిటీగా కూడా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా కొత్తగా వచ్చే ఐటీ ఉద్యోగులు వారికి అనుబంధంగా మరిన్ని రంగాలు విస్తరణకు నోచుకునే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు. దీనివల్ల నగర జనాభా కూడా ఒకేసారి పెరిగొచ్చు అని అంచనా వేస్తున్నారు. దీనివల్ల రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు కూడా విస్తరిస్తాయని భావిస్తున్నారు.