Begin typing your search above and press return to search.

విశాఖలో భారీ ఈవెంట్ కి కూటమి రెడీ !

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ మీద ప్రత్యేక ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే.

By:  Satya P   |   29 Jun 2026 11:20 PM IST
విశాఖలో భారీ ఈవెంట్ కి కూటమి రెడీ !
X

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ మీద ప్రత్యేక ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. విశాఖతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధి కోసం పరిశ్రమలను తీసుకుని రావడం అలాగే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, శ్రీకాకుళం మూలపేటలో పోర్టు నిర్మాణం అదే జిల్లాలో కార్గో ఎయిర్ పోర్టు ఇలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, ఇతర పరిశ్రమలు కూడా వస్తున్నాయి. ఐటీ కంపెనీలకు విశాఖ కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్ కూడా విశాఖ జిల్లాలో ఏర్పాటు అవుతోంది. ఈ క్రమంలో విశాఖలో మరో భారీ ఈవెంట్ కి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

నవంబర్ లో సీఐఐ సదస్సు :

ఇదిలా ఉంటే నవంబర్ నెలలో విశాఖ వేదికగా భారీ ఎత్తున 31వ సీఐఐ సదస్సుని నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 12, 13 తేదీలలో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పెట్టుబడులను జాతీయంగా అంతర్జాతీయంగా కూడా ఆకట్టుకునేందుకు యాక్షన్ ప్లాన్ ని ప్రభుత్వం రూపొందిస్తోంది. గతంలో నిర్వహించిన సీఐఐ సదస్సు వల్ల పెట్టుబడులు అధికంగా ఏపీకి రావడం జరిగింది. అందులో చాలా వరకూ గ్రౌండింగ్ అయ్యాయి అని అధికారులు చెబుతున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న కొత్త విధానంతో వచ్చిన పెట్టుబడులు సకాలంలో సాకారం అయ్యేలా వాటి శంకుస్థాపనలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇపుడు మరోసారి సీఐఐ సదస్సు నిర్వహణ ద్వారా మరిన్ని పెట్టుబడులను ఏపీకి తీసుకుని రావాలని చూస్తోంది.

సన్నాహక సదస్సులతో :

ఇక విశాఖ వేదికగా నవంబర్ 12, 13 తేదీలలో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు విశాఖలో జరిపే భాగస్వామ్య సదస్సు కంటే ముందుగా విశాఖ, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతిలో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించాలని కూడా సూత్రప్రాయంగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

జూలై నుంచే రెడీ :

ఇక విశాఖలో నిర్వహించే భాగస్వామ్య సదస్సులో ఎంఓయూలు మినిస్టీరియల్ సెషన్స్ ప్లీనరీ కంట్రీ సెషన్స్ బీ2బీ బీ2జీ వంటి వాటి మీద వాటి ద్వారా పెట్టుబడులు లభించేందుకు ఒక కసరత్తు జరుగుతోంది. ఇలా రెండు రోజుల భాగస్వామ్య సదస్సు నిర్వహణకు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు జాతీయ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు కేంద్ర మంత్రులు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశవిదేశాలలో రోడ్ షోలు చేపట్టి విశఖ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ప్రచారం కల్పించాలని కూడా కూటమి ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయం బత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాద్‌లో ఈ రోడ్ షోలు నిర్వహించునున్నారు. వ్యాపారాలు, పెట్టుబడులు వంటి అంశాల మీదే కాకుండా వినూత్న ఆలోచనలను పంచుకునేలా విశాఖలో సదస్సు నిర్వహించాలని చంద్రబాబు పెర్కొంటున్నారు. అలాగే ప్రాంతీయ సదస్సులలో కూడా ఎంఓయూలు కుదుర్చుకునేలా చూడాలని మంత్రులను అధికార వర్గాలను ఆయన కోరారు.