సమ్మిట్ కి కౌంట్ డౌన్.... అతిరధులు అతిధులు
ఇక రెండవ రోజు అయిన శనివారం నాటి కార్యక్రమంలో భాగంగా 15వతేది ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి సాయంత్రం వరకూ వివిధ ప్లీనరీ హాల్లో పలు ప్లీనరీ సెషన్లు పెద్ద ఎత్తున జరగనున్నాయి.
By: Satya P | 14 Nov 2025 3:00 AM ISTవిశాఖ వేదికగా ఈ నెల 14,15 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు-2025కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరి కొద్ది గంటనల్లో సాగర తీరంలో ఈ సదస్సు మొదలవుతోంది. దానికి సంబంధించిన చేసిన విస్తృత ఏర్పాట్లతో విశాఖ సర్వాంగ సుందరంగా తయారు అయింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, సిఐఐ భాగస్వామ్యంతో విశాఖపట్నం ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సిఐఐ సమ్మిట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈసదస్సుకు ఆంధ్రప్రదేశ్ పెవీలియన్ ప్లీనరీ హాల్ ప్రధాన వేదికగా ఉండగా దానికి అనుబంధంగా వివిధ హాళ్ళను ఏర్పాటు చేశారు. ఇక అక్కడ వివిధ ప్లినరీ సెషన్లు జరగనున్నాయి.
ఉప రాష్ట్రపతితో :
దేశానికి నూతనంగా ఉప రాష్ట్రపతిగా ఎన్నిక అయిన సీపీ రాధాక్రిష్ణన్ తొలిసారిగా ఏపీకి వస్తున్నారు. ఆయన ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. విశాఖకు ఉప రాష్ట్రపతితో పాటుగా గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గౌరవ అతిథిగా హాజరవుతున్నారు. అదే విధంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్,టిజి భరత్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జి, పలువురు పరిశ్రమల ప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు తదితరులు హాజరవుతారు.
ఏకబిగిన సదస్సులు :
ఇదిలా ఉంటే ఉదయం పదిన్నర గంటలకు మొదలయ్యే సదస్సులు రాత్రి ఎనిమిది గంటల దాకా ఏకబిగిన సాగనున్నాయి. వివిధ సెషన్లలో పలువురు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటారు. అదే సమయంలో వివిధ కాన్పరెన్స్ హాల్లో వివిధ ప్లీనరీ సెషన్లు జరగనున్నాయి. రెండు రోజుల పాటు వివిధ వేదికలు ఫుల్ బిజీగా ఒప్పందాలతో నిండిపోనున్నాయి.
కీలక సెషన్లు అన్నీ :
ఇక రెండవ రోజు అయిన శనివారం నాటి కార్యక్రమంలో భాగంగా 15వతేది ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి సాయంత్రం వరకూ వివిధ ప్లీనరీ హాల్లో పలు ప్లీనరీ సెషన్లు పెద్ద ఎత్తున జరగనున్నాయి. ఇక అదే రోజు సాయంత్రం అయిదు గంటల నంచి ఒక గంట పాటు సిఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు వేడుక నిర్వహిస్తారు ఈ ముగింపు కార్యక్రమం ప్రధాన వేదికైన ఆంధ్రప్రదేశ్ పెవీలియన్ ప్లీనరీ హాల్ లో జరగనుంది.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవ అతిథులుగా పాలొంటారు. అదే విధంగా సిఐఐ ఉపాధ్యక్షులు సుచిత్రా కె.యల్ల, సిఐఐ ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్మన్ ఆర్.దినేష్ తదితరులు పొల్గోనున్నారు. దాంతో రెండు రోజుల సదస్సు ముగియనుంది.
అదిరిపోయే ఏర్పాట్లు :
ఇదిలా ఉంటే ఈ రెండు రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధాన వేదికైన ఆంధ్రప్రదేశ్ పెవీలియన్ లో సభావేదికతో పాటు ముఖ్య అతిథులు,ఇతర అతిథులు,మీడియా తదితరులు కుదుర్చుకునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశారు.అలాగే మిగతా ప్లినరీ హాల్స్ వద్ద కూడా తగిన ఏర్పాట్లు చేశారు.అదే విధంగా సభావేదికకు వెలుపల ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో వివిధ వాహనాల పార్కింగ్ కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
ఏపీ బ్రాండ్ ఇమేజ్ :
ఈ సమ్మిట్ ఏపీ ఇమేజ్ ని ఏకంగా ప్రపంచానికి తెలియచేయనుంది. ఎందుకంటే దిగ్గజ పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుంచి హాజరవుతున్నారు. మరో వైపు చూస్తే దేశ రాజధాని ఢిల్లీ తో పాటు ముంబై హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, విశాఖపట్నం,విజయవాడ నగరాల్లోని ప్రధాన కూడళ్లు, విమానాశ్రయాల్లో పలు హోర్డింగులని సైతం ఈ సదస్సు కోసం డిజిటల్ గా ప్రదర్శిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని ఇతర ముఖ్య నగరాలు,పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేయడం జరిగింది.
