Begin typing your search above and press return to search.

విశాఖలో మెగా ఉత్సవ్ కి కౌంట్ డౌన్

ఈసారి ఉత్సవాల విశిష్టత ఏమిటి అంటే కేవలం విశాఖలోనే కాకుండా అనకాపల్లి, అరకు ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పలు ఈవెంట్స్ ని నిర్వహిస్తున్నారు ఇక విశాఖ ఉత్సవాల నిర్వహణకు సుమారు రూ.8 కోట్ల బడ్జెట్ కేటాయించారు.

By:  Satya P   |   24 Jan 2026 9:24 AM IST
విశాఖలో మెగా ఉత్సవ్ కి కౌంట్ డౌన్
X

విశాఖ అంటేనే సిటీ ఆఫ్ డెస్టినీ. టూరిజానికి కీలక కేంద్రం. విశాఖకి అను నిత్యం ఎంతో మంది వస్తూంటారు. ప్రకృతి సోయగాలను సాగర తీరానికి సంబంధించిన ముచ్చట్లను స్వయంగా చూసి ఆనందిస్తూంటారు. అటువంటి వారి కోసం మరింతగా జోష్ ఇచ్చేలా విశాఖ ఉత్సవ్-2026 ను సిద్ధం చేశారు. ఈ నెల 24 నుంచి 31 వరకూ విశాఖ సాగర తీరంలో ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

సందడే సందడిగా :

విశాఖ ఆర్‌కే బీచ్‌లో ప్రధాన వేదికగా అనేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, వినోద కార్యక్రమాల సమ్మేళంగా ఈసారి విశాఖ ఉత్సవ్ ని డిజైన్ చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఫుడ్ స్టాల్స్, సాహస క్రీడలు, హెలికాప్టర్ రైడ్, పారా మోటరింగ్ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే రుషికొండ బీచ్‌లో ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. భీమిలి బీచ్‌లో బోట్ రేసింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సాగర తీరం వేదికగా కోస్టల్ ఫుట్‌బాల్ లీగ్, కోస్టల్ వాలీబాల్ లీగ్, కోస్టల్ కబడ్డీ లీగ్ పోటీలు నిర్వహించనున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా :

ఈసారి ఉత్సవాల విశిష్టత ఏమిటి అంటే కేవలం విశాఖలోనే కాకుండా అనకాపల్లి, అరకు ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పలు ఈవెంట్స్ ని నిర్వహిస్తున్నారు ఇక విశాఖ ఉత్సవాల నిర్వహణకు సుమారు రూ.8 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ నేపధ్యంలో విశాఖ ఉత్సవాల ద్వారా లక్షలాది మంది సందర్శకులు నగరానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే పర్యాటకం, హోటల్ రంగం, రవాణా, వ్యాపార రంగాల్లో భారీ ఆర్థిక చలనం ఏర్పడి వేలాది ఉపాధి అవకాశాలు కలుగుతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

టీడీపీ హయాంలోనే :

తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్నప్పటి నుంచి విశాఖ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అది ఒక సంప్రదాయంగా మారింది ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించినా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో టీడీపీ ప్రభుత్వం ముందుదని చెప్పాల్సి ఉంది. విశాఖను రానున్న కాలంలో టూరిజం స్పాట్ గా దేశంలోనే కీలక స్థానంలో నిలబెట్టాలని భావిస్తున్న కూటమి ప్రభుత్వం విశాఖ ఉత్సవాలను వేదికగా మార్చుకుంటోంది. దాంతో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎనిమిది రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. అదే విధంగా పెద్ద ఎత్తున నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో ఉత్సవాలకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.