విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కేంద్రం క్లారిటీ ఇచ్చేసిందా ?
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందా అంటే దీనికి ఎవరూ స్పష్టమైన జవాబు చెప్పడం లేదు.
By: Satya P | 2 Aug 2025 3:00 PM ISTవిశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందా అంటే దీనికి ఎవరూ స్పష్టమైన జవాబు చెప్పడం లేదు. ఎందువల్ల అంటే రాజకీయ కారణాల వల్లనే. కూటమి పెద్దలు అయితే తమ క్రెడిట్ ఖాతాలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని వేసుకుంటారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపగలిగామని చెబుతారు. అయితే స్టీల్ ప్లాంట్ లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అంటే నెమ్మదిగా తన పని తాను చేసుకునేలా మాత్రమే అని అంటున్నారు. అంటే కోర్టు పరిభాషలో చెప్పాలీ అంటే యధా తధ పరిస్థితి అన్న మాట.
ఏమైనా జరగవచ్చు :
విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. బ్రహ్మాండమైన ప్లాంట్ ఇది పైగా సీ షోర్ వద్ద ఉన్న ఏకైక ప్లాంట్. దీని వల్ల జల రవాణతో కారు చౌకగా ఉత్పత్తులను ఎగుమతులు చేసే సదుపాయం ఉంది. అయితే ఈ పక్కనే మిట్టల్ ప్లాంట్ ని తెస్తున్నారు. అంటే పక్కలో బల్లెం అన్న మాట. మిట్టల్ ప్లాంట్ కి సొంత గనులను కూడా కేటాయించబోతున్నారు. అన్ని రకాలైన వనరులు సమకూర్చబోతున్నారు. అలాగే రాయితీలు ఇస్తున్నారు. మరి మిట్టల్ ప్లాంట్ అభివృద్ధి చెందితే దెబ్బ దేని మీద అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మీదనే అని అంటున్నారు.
ఫుల్ క్లారిటీ వచ్చేసిందా :
కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటిదాకా స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ మీద ప్రకటన వెనక్కి తీసుకోలేదని స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు గుర్తు చేస్తున్నారు. దానికి సరైన ఉదాహరణగా కేంద్రం కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసినట్లుగానే ఉంది మరి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేంద్రం ప్రకటించింది. వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి గొల్ల బాబూరావు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ ఈ మేరకు లిఖిత పూర్వకమైన జవాబు ఇచ్చారు.
అది కేబినెట్ నిర్ణయం
ఇప్పటికి అయిదేళ్ళ క్రితం కేంద్ర కేబినెట్ విశాఖ ఉక్కులో పెట్టుబడులను వంద శాతం ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఆ నిర్ణయంలో ఈ రోజుకీ ఎక్కడా రాజీ లేదనే కేంద్ర పెద్దలు చెబుతున్నారు. అసలు ఆ ప్రకటనను రద్దు చేసుకున్నామని కూడా ఎక్కడా ఇంతవరకూ చెప్పలేదు. అదే విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి కూడా చెప్పారు అని అంటున్నారు. అంటే మెడ మీద కత్తి అలాగే వేలాడుతోంది అన్న మాట. ప్రైవేటీకరణ తప్పదని చెబుతున్నారన్న మాట.
సొంత గనులూ లేక :
విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించాలన్న ఒకే ఒక్క నిర్ణయం మీదనే కేంద్రం ముందుకు పోతోందా అంటే అవును అనే అంటున్నారు. నష్టాలలో ఉంటే కనుక సెయిల్ లో విలీనం చేయండి అని కార్మిక లోకం కోరుతోంది. అయినా సరే దాని మీద కూడా నో చెబుతున్నారు. అంటే ప్రైవేట్ పరమే చేస్తారు అన్న మాట. నిర్ణయం అయితే అలాగే ఉంది. అది ఎపుడు అమలు అంటే కాస్తా అటు ఇటూగా ఆలస్యం అయితే కావచ్చు తప్పదనే అంటున్నారు. ఏది ఏమైనా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న మాటలు సాగర తరంగాలలో కలిసిపోతున్న నేపథ్యం ఉంది. మిట్టల్ ప్లాంట్ కి శ్రీకారం చుట్టినపుడే విశాఖ స్టీల్ ప్లాంట్ కి మూడిందని మేధావులు అంటున్నారు. రానున్న రోజులలో ఏమైనా జరగవచ్చు అన్నదే అందరి మాటగా ఉంది.
