విశాఖ ఉక్కు.. మరింత చిక్కు.. తాజా డెసిషన్ ..!
తాజాగా విశాఖ స్టీల్ ప్లాంటుకు సంబంధించి ఏకంగా 34 విభాగాలను ప్రైవేటీకరించేందుకు.. కేంద్ర ఉక్కు మంత్రి త్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి.
By: Garuda Media | 18 Aug 2025 5:59 PM ISTవిశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో మరో పెద్ద చిక్కు తెరమీదికి వచ్చింది. ఈ ప్లాంటును ప్రైవేటీకరించ వద్దని.. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు మూడేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నాయి. అయితే.. వీరు ఆశిస్తున్నట్టుగా క్షేత్రస్థాయిలో ఏమీ జరగడం లేదు. పైగా.. ఎప్పటికప్పుడు.. ప్రైవేటీకరణ అంశం తెరమీదకి వస్తూనే ఉంది. దీనిని ప్రైవేటీకరించకుండా.. తాము అడ్డు పడతామని కూటమి నాయకులు, మంత్రి నారాలోకేష్ ప్రకటించారు.కానీ, వారు చెబుతున్న మాటలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నాయి.
తాజాగా విశాఖ స్టీల్ ప్లాంటుకు సంబంధించి ఏకంగా 34 విభాగాలను ప్రైవేటీకరించేందుకు.. కేంద్ర ఉక్కు మంత్రి త్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో విశాఖ ఉక్కు అధికారులు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేశారు. అంటే.. తాంబూలాలిచ్చేశాం.. అన్నట్టుగా వ్యవహరించారు. వీటిలో కీలకమైన గనులు కూడా ఉన్నాయి. వాస్తవానికి గనులు లేకపోతే.. విశాఖ ఉక్కు ముందుకు నడిచే పరిస్థితిలేదు. దీనిపైనే కార్మికులు కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు.
అలాంటిది ఇప్పుడు 34 విభాగాల్లో కీలకమైన మైనింగ్‌లు ఉండడంతోపాటు.. బ్లాస్ట్ ఫర్నేజ్-1, 2, 3లను కూడా ప్రైవేటీకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఈ పరిణామాలు.. మరింతగా కూటమి సర్కారుకు ఇబ్బందులు తెస్తున్నారు. కార్మిక సంఘాలు సహా.. ఉద్యోగులు కూడా ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. ఇదేం పద్ధతని ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేది లేదని అంటూనే.. ఇలా నోటిఫికేషన్లు ఇవ్వడం ఏంటన్నది వారి నిలదీత.
ఇదిలావుంటే.. ప్రస్తుతం ఢిల్లీ వెళ్లిన.. మంత్రి నారా లోకేష్.. ఈ వ్యవహారాన్న ప్రస్తావించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రైవేటీకరించాలని అనుకుంటే.. నేరుగా చెప్పాలని.. కూడా కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇది కూటమి నాయకులకు, స్థానిక ఎంపీ భరత్‌కు కూడా ఇబ్బందిగా మారింది. మరోవైపు.. ఈ కేసు హైకోర్టులో విచారణ పరిధిలో ఉంది. ఈ ఏడాది నవంబరులో దీనిపై మరోసారి విచారణ జరగనుంది. ఈ విషయాన్ని కూడా కార్మికులు ప్రస్తావిస్తున్నారు. హైకోర్టులో ఉండగానే ఇలా ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకోవడం ఏంటన్నది వారు చెబుతున్న మాట. ఏదేమైనా.. ఇది ముందు ముంద ఇబ్బందిగానే మారనుందన్న సంకేతాలు వస్తున్నాయి.
