భారతీయులకు భారత్ లో సివిక్ సెన్స్ నేర్పుతున్న విదేశీయుడు.. వీడియో వైరల్!
వివరాళ్లోకి వెళ్తే... పుణెలోని పింపుల్ నిలఖ్ ప్రాంతంలోని రక్షక్ చౌక్ లోనిదిగా చెబుతోన్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
By: Raja Ch | 21 Dec 2025 5:00 AM ISTభారతీయులకు సివిక్ సెన్స్ చాలా తక్కువా? ఈ ప్రశ్నకు సమాధానం ఆల్ మోస్ట్ చాలామందికి తెలుసు! అయితే చిన్నప్పుడు స్కూల్స్ లో నేర్పలేదో, పేరెంట్స్ అలవాటు చేయలేదో.. లేక, పెద్ద వారైన తర్వాత అవన్నీ ఎరేజ్ అయిపోయాయో ఏమో తెలియదు కానీ.. ఇటీవల పలు విదేశీయులు భారత్ లో భారతీయులకు సివిక్ సెన్స్ నేర్పుతున్న ఘటనలు తెరపైకి వస్తున్నాయి! తాజాగా మహారాష్ట్రలోని పూణేలో అలాంటి ఘటనే తెరపైకి వచ్చింది.
అవును... ఈ ఏడాది జూలై ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్ లోని ఒక జలపాతం దగ్గర నుంచి ఓ విదేశీ పర్యాటకుడు చెత్తను తీస్తున్న విడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై సంచలన కామెంట్లు హల్ చల్ చేశాయి! ఆ విషయంలో మనం టాప్! ఈ క్రమంలో తాజాగా పూణెలో ట్రాఫిక్ ఉల్లంఘనలను పరిష్కరించడానికి ఒక విదేశీయుడు ముందుకు వస్తున్నట్లున్న ఓ వీడియో ఆన్ లైన్ లో విస్తృతంగా ప్రసార అవుతోంది.
వివరాళ్లోకి వెళ్తే... పుణెలోని పింపుల్ నిలఖ్ ప్రాంతంలోని రక్షక్ చౌక్ లోనిదిగా చెబుతోన్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక విదేశీయుడు, మరో వ్యక్తి.. ఫుట్ పాత్ ను ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి, ప్రధాన రహదారివైపు తిరిగి వెళ్లమని సూచిస్తున్నట్లుగా ఉంది! ఈ సమయంలో.. ఒక విదేశీయుడు స్కూటర్ ను కొద్దిసేపు అడ్డుకుని, సరైన మార్గాన్ని అనుసరించాని రైడర్ కు సిగ్నల్ ఇస్తున్నారు.
ఆయనకు మరో వ్యక్తి సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... ట్రాఫిక్ రూల్స్, సివిక్ సెన్స్ పాఠాలు చిన్న వయసులోనే ప్రారంభించాలని చాలా మంది స్పందించగా.. మన సొంత రోడ్లను ఎలా ఉపయోగించాలో బయట వ్యక్తులు మనకు నేర్పించాల్సి వచ్చినప్పుడు.. అది మన సివిక్ సెన్స్ పై తీవ్రమైన ప్రశ్నార్ధకం అని అన్నారు.
ఇదే సమయంలో.. ఈ దృశ్యం చూడటానికి ఎంతో సిగ్గుచేటుగా ఉంది.. భారతీయుల సివిక్ సెన్స్ ఎంత చెత్తగా ఉందో చూడటం చాలా సిగ్గుచేటు అని మరో యూజర్ వ్యాఖ్యానిస్తే... విదేశీయులు వచ్చి మనకు నాగరికత నేర్పించాల్సిన అవసరం ఉండటం నిజంగా సిగ్గుచేటని.. ప్లాసీ యుద్ధాన్ని చదవడం కంటే.. మన ప్రైమరీ ఎడ్యుకేషన్ సిలబస్ ని మార్చాలని మరొకరు కామెంట్ చేశారు.
ఏది ఏమైనా.. ఈ వీడియో మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సమయంలో.. ఈ వీడియోలు చూసిన వారిలో సంగం మంది మారినా చాలనే కామెంట్ కొసమెరుపు!
