Begin typing your search above and press return to search.

అవినీతిలో ఐకమత్యం !

‘లంచాలు మాలో ఏ ఒక్కరికి చేతికి వచ్చినా వాటిని అందరం సమానంగా పంచుకుంటాం.

By:  Tupaki Political Desk   |   27 Aug 2026 11:28 AM IST
అవినీతిలో ఐకమత్యం !
X

‘లంచాలు మాలో ఏ ఒక్కరికి చేతికి వచ్చినా వాటిని అందరం సమానంగా పంచుకుంటాం. ఈ విషయంలో ఒకరికి ఒకరం అండగా ఉంటాం. మా సభ్యులలో ఏ ఒక్కరికి సమస్య వచ్చినా పరస్పరం మద్దతు ఇచ్చుకుంటాం. మా మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిన వారిని ద్రోహులుగా పరిగణిస్తాం’ అని ప్రమాణం చేస్తున్నాం.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం షాజహాన్ పూర్ జిల్లా కేంద్రం, షాజహాన్ పూర్ మున్సిపల్ కార్పోరేటర్లు మూకుమ్మడిగా చేసిన ప్రమాణం ఇది. ఉట్టి ప్రమాణమే కాదు దీనికి పవిత్రమైన గంగా జలాలను కూడా వినియోగించడం విశేషం. ఒక వ్యక్తి గంగా జలం అందరి చేతుల్లో పోస్తుండగా, అందరూ ఈ అవినీతి సొమ్ము విషయంలో వాటాల్లో తేడా లేకుండా 60 మంది కార్పోరేటర్లం పంచుకుంటామని చేస్తున్న ప్రమాణం వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడం సంచలనంగా మారింది.

కౌన్సిలర్లు ఇంత నిస్సిగ్గుగా ప్రమాణం చేసిన వీడియోలు చూసి అక్కడి ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఏకంగా వారు బహిరంగ ప్రమాణాలు చేస్తున్నారు అంటే అక్కడ అవినీతి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ కావడంతో మేయర్ అర్చనా వర్మ, నగర కమీషనర్ సౌమ్యా గురురాణిలు విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

యూపీలోని షాజహాన్ పూర్ ఒక జిల్లా కేంద్రం. గతంలో మున్సిపాలిటీగా ఉన్న ఈ నగరం మున్సిపల్ కార్పోరేషన్ గా అప్ గ్రేడ్ అయింది. ఈ కార్పోరేషన్ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 3,29,736 మంది జనాభా ఉండగా అందులో 1,73,006 మంది పురుషులు, 1,56,730 మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం అక్కడ జనాభా దాదాపు 5 లక్షలు ఉండవచ్చని అంచనా..

గతంలో మున్సిపాలిటీగా ఉన్పప్పుడు ఇక్కడ 44 కౌన్సిలర్ స్థానాలు ఉండగా, అప్ గ్రేడ్ అయిన తరువాత 60 కార్పోరేటర్ స్థానాలు అయ్యాయి. ప్రస్తుతం బీజేపీ నుండి గెలిచిన అర్చనా వర్మ ఇక్కడ మేయర్ గా కొనసాగుతున్నారు. మొత్తం 60 కార్పోరేటర్ స్థానాలలో 41 మంది బీజేపీ కార్పోరేటర్లు ఉండగా, 19 మంది ఇతర పార్టీలకు చెందిన వారు. అయితే అవినీతిలో మాత్రం ఐకమత్యంగా ఉండేందుకు 60 మంది కార్పోరేటర్లు సొమ్మును సమానంగా పంచుకుంటామని ప్రమాణం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఆ వీడియోను తప్పుగా ప్రచారం చేస్తున్నారని, ఒక కార్పోరేటర్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్ట్రీట్ లైట్ల కంపెనీకి వ్యతిరేకంగా ఆ కంపెనీకి అనుకూలంగా ఎవరూ లేఖ ఇవ్వొద్దని తీర్మానం చేసినట్లు 24 వార్డు కార్పోరేటర్ ధీరేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. పాత వీడియోను మళ్లీ సర్కులేట్ చేసి, మా ఇమేజ్ దెబ్బతీయాలని చూస్తున్నారని, తాము ఈ స్మార్ట్ అనే స్ట్రీట్ లైట్ల కంపెనీకి వ్యతిరేకంగా తీర్మానం చేశామని, అక్కడ అవినీతికి ఆస్కారం లేదని మరో కార్పోరేటర్ అనూప్ గుప్తా అన్నారు.