Begin typing your search above and press return to search.

స్కూల్లో అసహ్యించుకున్నారు.. కట్ చేస్తే.. 15 ఏళ్లకు పెళ్లి.. ఇంట్రెస్టింగ్ గా మారిన లవ్ స్టోరీ!

అప్పుడప్పుడు మన జీవితాలలో అనుకోని సంఘటనలు ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక జంట లవ్ స్టోరీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

By:  Madhu Reddy   |   6 Aug 2025 12:00 AM IST
స్కూల్లో అసహ్యించుకున్నారు.. కట్ చేస్తే.. 15 ఏళ్లకు పెళ్లి.. ఇంట్రెస్టింగ్ గా మారిన లవ్ స్టోరీ!
X

అప్పుడప్పుడు మన జీవితాలలో అనుకోని సంఘటనలు ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక జంట లవ్ స్టోరీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇద్దరూ స్కూల్ విద్యార్థులుగా ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడలేదు. కానీ సరిగ్గా 15 ఏళ్ల తర్వాత మ్యాట్రిమోనియల్ ద్వారా కలుసుకొని జీవిత భాగస్వాములుగా మారడం చూసి తమకు తామే ఆశ్చర్యపోయామని సోషల్ మీడియా వేదికగా ఆ విషయాన్ని పంచుకున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే ఘనంగా జరుపుకున్నారు. తమ చిన్ననాటి సంఘటనలను, పాత గ్రూపు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తమ స్నేహాన్ని చాటుకున్నారు. ఇక అందులో భాగంగానే ఆగస్టు 3వ తేదీన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఆంచల్ రావత్ అనే ఒక యూజర్ పోస్ట్ చేసిన ఒక ఫోటో, ఆ ఫోటో వెనుక ఉన్న అసలు విషయం తెలిసి అందరూ నవ్వుకుంటున్నారు. ఆమె తమ స్కూల్లో క్లాస్ మేట్స్ కలిసి గ్రూపుగా దిగిన ఫోటో తోపాటు తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోని కూడా పంచుకుంది.

ఈ ఫోటోలను ఆంచల్ రావత్ షేర్ చేస్తూ.. నేను స్కూల్లో ఎవరినైతే ద్వేషించానో.. సరిగా 15 ఏళ్ల తర్వాత ఒక మ్యాట్రిమోనియల్ యాప్ ద్వారా అదే వ్యక్తిని కలుసుకొని, పెళ్లి చేసుకోవడం యాదృచ్ఛికంగా మారింది అంటూ ఆమె తెలిపింది.. ఇక ఆమె అసలు విషయం గురించి మాట్లాడుతూ.. నేను స్కూల్లో చాలా అరుదుగా మాత్రమే ఇతరులతో మాట్లాడేదాన్ని. ముఖ్యంగా నేను అబ్బాయిలతో స్నేహం చేయడానికి అస్సలు ఇష్టపడేదాన్ని కాదు. ఒకప్పుడు ఒక నీచుడు తన భోజనాన్ని నాతో పంచుకోవాలని ప్రయత్నించాడు. నేను అనుకోకుండా అతడి పోకీమాన్ టిఫిన్ బాక్స్ ను పగలగొట్టేసాను. ఆరోజు చాలా ఏడిపించాను కూడా.. అప్పటి నుంచీ అతను నాతో మాట్లాడలేదు.. ఇక స్కూల్ అయిపోయింది. ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోయారు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. మా మధ్య ఎటువంటి పరిచయం లేదు.

కానీ 15 సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఒక మ్యాట్రిమోనియల్ యాప్ లో కలిసాము. అయితే అప్పుడు కూడా అతడు ఇంకా తన టిఫిన్ బాక్స్ ను మరిచిపోలేదని నాకు తెలిసింది. మ్యాట్రిమోనియల్ ఆప్ ద్వారా మేమిద్దరం మొదటిసారి కలిసినప్పుడు.. నువ్వు నాకు ఎప్పుడైనా కొత్త టిఫిన్ బాక్స్ కొంటావా? అని అడిగాడు. మా పాఠశాల రోజులు మా మధ్య స్నేహాన్ని కలిగించకపోయినా.. మేము మాత్రం 15 ఏళ్ల తర్వాత ఇష్టపడి పెళ్లి చేసుకోవడం మాకే ఆశ్చర్యంగా ఉంది అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు.

అందులో ఒక అభిమాని తన సొంత పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. నాకు కూడా ఇలాంటి ప్రేమ కథ కావాలి దేవుడా అని కామెంట్ చేశారు. మరొక నెటిజన్.. మీరు ఒకప్పుడు ఇష్టపడని పాఠశాల విద్యార్థులతోనే తరచుగా మాట్లాడాల్సి వస్తుంది. వారే గొప్ప స్నేహితులు అవుతారు అంటూ తెలిపారు. ఇంకొక నెటిజన్ అతడికి పగ కంటే బహుమతులను ఎలా పట్టుకోవాలో స్పష్టంగా తెలుసు.. వివాహమైనందుకు మీ ఇద్దరికీ శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేశారు. మొత్తానికైతే ఈ చిన్ననాటి శత్రువులు ఇప్పుడు ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకోవడంతో ఈ యాదృచ్ఛిక లవ్ స్టోరీకి అందరూ ఫిదా అవుతున్నారు.