బీహార్‌లో గ్రామస్థుల ఆగ్రహం: మంత్రి శ్రవణ్ కుమార్‌పై దాడి
బీహార్ రాష్ట్రంలో నలంద జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. నితీష్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి మంత్రి, జేడీయూ నేత శ్రవణ్ కుమార్ పై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By: A.N.Kumar | 28 Aug 2025 2:00 AM ISTబీహార్ రాష్ట్రంలో నలంద జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. నితీష్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి మంత్రి, జేడీయూ నేత శ్రవణ్ కుమార్ పై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కాన్వాయ్‌పై దాడి చేసి, కొన్ని కిలోమీటర్ల పాటు వెంబడించి తరిమికొట్టారు. ఈ దాడిలో ఒక బాడీ గార్డ్ గాయపడ్డాడు. ఈ సంఘటన హిల్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలవాం గ్రామంలో జరిగింది.
- ప్రమాదంలో మరణించిన కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి
రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వీరందరూ "జీవికా దీదీలు" (బ్యాంక్ జీవికా గ్రూప్‌తో అనుబంధం ఉన్న మహిళలు). వారి కుటుంబాలను పరామర్శించడానికి మంత్రి శ్రవణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ ముఖియా గ్రామానికి చేరుకున్నారు. దాదాపు అరగంట పాటు బాధిత కుటుంబాలతో మాట్లాడిన తర్వాత వారు తిరిగి బయలుదేరే సమయంలో ఈ ఘటన జరిగింది.
ఆకస్మిక దాడి – ప్రాణాలు నిలుపుకున్న నేతలు
గ్రామస్థులు ఆకస్మికంగా మంత్రిపై దాడికి యత్నించారు. కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడి చేసి దాదాపు ఒక కిలోమీటరు వరకు వెంబడించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో మంత్రి, ఎమ్మెల్యే ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డారు. అయితే భద్రతా సిబ్బందిలో పలువురికి గాయాలయ్యాయి.
- పోలీసులు అప్రమత్తం
సమాచారం అందిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సంఘటన బీహార్ రాజకీయ వాతావరణంలో కలకలం రేపింది. గ్రామస్థుల ఆగ్రహం వెనుక కారణాలు, స్థానిక అసంతృప్తి అంశాలపై అధికారులు లోతైన విచారణ చేపడుతున్నారు.
