శోభాయాత్ర: గుంటూరులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
తాజాగా గుంటూరు పట్టణంలో త్రుటిలో తప్పిన ఒక ప్రమాదం వందకు పైగా ప్రాణాల్ని కాపాడిందని చెప్పాలి.
By: Garuda Media | 15 Sept 2025 9:44 AM ISTగతంలో ఎప్పుడూ లేని రీతిలో ఈసారి వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాధుని విగ్రహాలకు సంబంధించిన ఆగమయాత్రలు.. నిమజ్జన వేళ నిర్వహించే శోభాయాత్రలు పెను విషాదాల్ని నింపిన వైనాలెన్నో చూశాం. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ ఈ విషాద ఉదంతాలు నమోదయ్యాయి. ఎప్పుడూ లేని రీతిలో ఈసారి ఈ యాత్రల సందర్భంగా చోటు చేసుకున్న విషాదాలు.. పోయిన ప్రాణాలెన్నో.
తాజాగా గుంటూరు పట్టణంలో త్రుటిలో తప్పిన ఒక ప్రమాదం వందకు పైగా ప్రాణాల్ని కాపాడిందని చెప్పాలి. ఆదివారం నిర్వహించిన శోభాయాత్రలో భాగంగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గుంటూరు పట్టణంలోని కొరిటెపాడులో వినాయక నిమజ్జన శోభాయాత్రలో భాగంగా.. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా ఎగిసిపడ్డ నిప్పురవ్వలు.. పక్కనే ఉన్న చంద్ర సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ మీద పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఆసుపత్రిలో దాదాపు వందకు పైగా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. మంటల వేళ స్థానికులు స్పందించటంతో పాటు.. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారాన్ని అందించారు. స్పందించిన ఫైరింజన్ సిబ్బంది సకాలంలో ఘటనాస్థలానికి చేరుకొని.. మంటలని ఆర్పివేశారు. దీంతో.. పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో ఉన్న రోగుల సంఖ్యతో ఆసుపత్రి వర్గాలు హడలిపోయాయి. సకాలంలో మంటలు ఆరటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
