Begin typing your search above and press return to search.

బెజ‌వాడ ర‌ణ‌రంగం.. వైసీపీ వ‌ర్సెస్ టీచ‌ర్లు!

గ‌త ఏడాది ప్ర‌భుత్వం నిర్వ‌హించిన మెగా డీఎస్సీలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే

By:  Garuda Media   |   21 Sept 2026 9:54 PM IST
బెజ‌వాడ ర‌ణ‌రంగం.. వైసీపీ వ‌ర్సెస్ టీచ‌ర్లు!
X

వైసీపీ వ‌ర్సెస్ టీచ‌ర్ల ఉడంప‌ట్టుతో విజ‌య‌వాడ ర‌ణ‌రంగంగా మారిపోయింది. గ‌త ఏడాది ప్ర‌భుత్వం నిర్వ‌హించిన మెగా డీఎస్సీలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త నెల రోజులుగా ఈ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే.. కోర్టు వీటిని దాదాపు తోసిపుచ్చింది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వ‌డాన్ని కూడా త‌ప్ప‌బ‌ట్ట‌లేదు. హారిజాంట‌ల్ రిజ‌ర్వేష‌న్‌ను కూడా స‌మ‌ర్థించింది. అయినా.. కూడా వైసీపీ నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి.

తాజాగా విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన వైసీపీ నిర‌స‌న‌ల‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌లేదు. అయినా కూడా వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ నేతృత్వంలో కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. బంద‌ర్ రోడ్డు, ఏలూరు రోడ్డుల మీదుగా నిర‌స‌న చేప‌ట్టారు. రాష్ట్ర క్రీడాప్రాదికార సంస్థ‌(శాప్‌) ముందు బైఠాయించి నిర‌స‌న‌కు కూర్చున్నారు. అయితే.. ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌కు చేరుకున్న స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ద‌క్కించుకున్న టీచ‌ర్లు కూడా ప్ర‌తి నిర‌స‌న‌కు దిగారు.

త‌మ‌పై అన్యాయంగా అభాండాలు వేస్తున్నార‌ని.. తాము క‌ష్ట‌ప‌డి ఉద్యోగాలు సాధించామ‌ని వారు చెబుతున్నారు. వారు సైతం.. శాప్ కార్యాల‌యానికి చేరుకుని త‌మ విన‌తి ప‌త్రాలు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. టీచ‌ర్ల‌ను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. మీరు ఉద్యోగాలకు రాజీనామా చేయాలి.. అంటూ అవినాష్ హెచ్చ‌రించారు. దీంతో టీచ‌ర్లు కూడా ప్ర‌తిఘ‌టించే ప్ర‌య‌త్నం చేశారు. మీరు రాజ‌కీయాలు మానేయాలి.. అని వ్యాఖ్యానించారు. ఇలా ఇరుపక్షాల మ‌ధ్య వాగ్వాదం పెరిగింది.

ఈ క్ర‌మంలో పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ నాయ‌కుల‌కు స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేయ‌గా.. వైసీపీ నేత‌లు వారిని తోసేసే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో వెంట తెచ్చుకున్న కోడిగుడ్ల‌తో త‌మ‌పై దాడి చేశార‌ని టీచ‌ర్లు ఆరోపించారు. ఒక‌రిద్ద‌రు కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయ‌ని వారు చెప్పారు. దీంతో పోలీసులు ప్ర‌త్యేక ద‌ళాల‌ను రంగంలోకి దింపి వైసీపీ నేత‌ల‌ను అరెస్టు చేశారు. మ‌రికొంద‌రిని చెద‌ర గొట్టారు. ఈ ప‌రిణామాల‌ను త‌వ్రంగా భావిస్తున్న‌ట్టు మంత్రి మండ‌ప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి చెప్పారు. వైసీపీ ముసుగులో రౌడీలు.. టీచ‌ర్ల‌పై దాడులు చేయ‌డాన్ని ఖండిస్తున్నామ‌న్నారు.