Begin typing your search above and press return to search.

రియల్ రంగంలో ప్రపంచాన్ని వెనక్కు నెడుతున్న బెజవాడ.. కారణం ఇదే..

మెట్రో నగరాల్లో సొంత ఇల్లు అనేది సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతుంటే, మన బెజవాడలో మాత్రం తక్కువ ఖర్చుతోనే సొంత గృహ కల సాకారమవుతుండడం గొప్ప ఊరటనిచ్చే విషయం.

By:  Tupaki Political Desk   |   1 April 2026 3:00 PM IST
రియల్ రంగంలో ప్రపంచాన్ని వెనక్కు నెడుతున్న బెజవాడ.. కారణం ఇదే..
X

మెట్రో నగరాల్లో సొంత ఇల్లు అనేది సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతుంటే, మన బెజవాడలో మాత్రం తక్కువ ఖర్చుతోనే సొంత గృహ కల సాకారమవుతుండడం గొప్ప ఊరటనిచ్చే విషయం. దేశ వ్యాప్తంగా విడుదలైన ‘కన్స్ట్రక్షన్ కాస్ట్ గైడ్-2026’ నివేదిక ప్రకారం, విజయవాడ నగరం అత్యంత సరసమైన నిర్మాణ వ్యయం ఉన్న నగరాల జాబితాలో అగ్రస్థానంలో నిలవడం విశేషం. ముంబై, బెంగళూరు వంటి నగరాలతో పోలిస్తే ఇక్కడ ఇల్లు కట్టుకోవడం ఎంత లాభదాయకమో వివరంగా తెలుసుకుందాం..

విజయవాడ vs మెట్రో నగరాలు

నిర్మాణ వ్యయం విషయంలో విజయవాడ ఇతర మెట్రో నగరాలకు గట్టి పోటీ ఇస్తోంది. ముంబైలో లగ్జరీ ఇళ్ల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ. 4,600 నుంచి రూ. 5,200 వరకు ఖర్చవుతుండగా, విజయవాడలో నాణ్యమైన ఇంటిని కేవలం రూ. 1,400 నుంచి రూ. 2,200 మధ్య నిర్మించుకోవచ్చు. సాధారణ స్థాయి నిర్మాణం అయితే చదరపు అడుగుకు కేవలం రూ. 1,100 తోనే పూర్తి చేయవచ్చని అంచనా.. అంటే మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడ 50 శాతం కంటే తక్కువ ఖర్చుతోనే ఇల్లు సిద్ధం అవుతోంది. నిర్మాణ వ్యయం తక్కువగా ఉన్నప్పటికీ, రెండేళ్ల నుంచి కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి.

లేబర్.. నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత వల్ల కూలీల ఖర్చు ఏటా 5-6 శాతం పెరుగుతోంది. దీనివల్ల మొత్తం ప్రాజెక్ట్ బడ్జెట్‌పై 10-15 శాతం అదనపు భారం పడుతోంది.

రవాణా.. ఇది మరో అదనపు భారంగా మారుతోంది. ఇంధన ధరలు పెరగడంతో ఇసుక, కంకర వంటి ముడి సరుకుల రవాణా ఛార్జీలు భారాన్ని పెంచాయి. అయినప్పటికీ, స్థానిక వనరుల లభ్యత ఎక్కువగా ఉండడం వల్ల ఇతర నగరాల కంటే విజయవాడలో పనులు 20-30 శాతం తక్కువ ఖర్చుతోనే పూర్తవుతున్నాయి.

ముడి సరుకులు.. సిమెంట్, స్టీల్ ధరల హెచ్చుతగ్గులు ఇంటి నిర్మాణ బడ్జెట్‌ను శాసిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో స్టీల్ టన్నుకు రూ. 60 వేలు పైనే పలుకుతోంది, ఇది ఇళ్ల నిర్మాణ వ్యయంపై ఒత్తిడి పెంచుతోంది. జీఎస్టీ సంస్కరణల తర్వాత సిమెంట్ ధరలు కాస్త స్థిరంగా ఉండడం గృహ నిర్మాణ దారులకు ఊరటనిచ్చే అంశం. స్థానికంగా సరుకుల సరఫరా సులభంగా ఉండడం బెజవాడకు కలిసివచ్చే ప్రధాన అంశం.

ఇండిపెండెంట్ ఇళ్లకు డిమాండ్!

రాజధాని అమరావతి పనులు మళ్లీ ఊపందుకోవడంతో విజయవాడ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ రంగం కళకళలాడుతోంది. పోరంకి, కానూరు, గొల్లపూడి వంటి ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు వేగంగా వెలుస్తున్నాయి. అపార్ట్‌మెంట్ల కంటే తక్కువ ఖర్చుతో సొంతంగా ఇండిపెండెంట్ ఇళ్లను నిర్మించుకోవడానికి మధ్య తరగతి ప్రజలు ప్రాధాన్యతిస్తున్నారు. సొంత స్థలం ఉండడమే కాకుండా, నచ్చినట్లుగా డిజైన్ చేసుకునే వెసులుబాటు ఇండిపెండెంట్ హౌజ్ నిర్మాణంతో ఉంటుంది.

దేశవ్యాప్తంగా నిర్మాణ వ్యయం పెరుగుతున్నా, విజయవాడలో ఇంకా సామాన్యుడికి అందుబాటులో ఉండడం ఒక గొప్ప అవకాశమనే చెప్పవచ్చు. అమరావతి అభివృద్ధి చెందుతున్న కొద్దీ భవిష్యత్తులో ఇక్కడ భూముల ధరలు, నిర్మాణ వ్యయాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, బెజవాడలో సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉన్నవారు ఆలస్యం చేయకుండా ఇప్పుడే అడుగు వేయడం ఆర్థికంగా చాలా లాభదాయకం.