ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే: విజయవాడలో పొలిటికల్ వార్.. !
ఎంపీగా తొలిసారి కేశినేని చిన్ని విజయం సాధించారు. తొలి ఏడాది బాగానే ఉన్నా.. తర్వాత గత రెండు మాసాల నుంచి ఇద్దరి మధ్య రాజకీయపరమైన విభేదాలు పొడచూపుతున్నాయి.
By: Garuda Media | 5 Aug 2025 7:00 PM ISTవిజయవాడ రాజకీయాలు మరోసారి సెగలు కక్కుతున్నాయి. నిన్న మొన్నటి వరకు చెలిమి చేసి.. చేతు లు కలిపి ఎంపీ.. ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. నిజానికి గత ఎన్నికల సమయంలో ఇద్దరు నేతలు కూడా ఉమ్మడిగానే ప్రచారం చేసుకున్నారు. కానీ.. గత రెండు మాసాలుగా వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బొండా ఉమా రెండో సారి విజయం దక్కించుకున్నారు.
ఎంపీగా తొలిసారి కేశినేని చిన్ని విజయం సాధించారు. తొలి ఏడాది బాగానే ఉన్నా.. తర్వాత గత రెండు మాసాల నుంచి ఇద్దరి మధ్య రాజకీయపరమైన విభేదాలు పొడచూపుతున్నాయి. ఎంపీ ప్రొటోకాల్ పాటిం చడం లేదని.. తనను పిలవడం లేదని.. తన నియోకవర్గంలో ఆయన అనుచరులు చక్రం తిప్పుతున్నా రని.. ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. అయితే.. ఎంపీ అనుచరులు, ఆయన తరఫు నాయకుల వాదన వేరుగా ఉంది. అలివికాని కోరికలతో ఎంపీని కలిసి.. వాటి కోసం పట్టుబడుతున్నారని.. ఇది సాధ్యం కాదని చెప్పినా.. వినిపించుకోవడం లేదని వారు అంటున్నారు.
గత ఎన్నికల సమయంలో సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమా కొన్ని హామీలు ఇచ్చారు. విజయవా డ - నూజివీడు రహదారిని 6 లేన్ల రోడ్డుగా మారుస్తామన్నారు. ఇంటింటికీ జల్ జీవన్ మిషన్ ద్వారా కుళాయిలు ఇస్తామన్నారు. ఈ రెండు అంశాలుకూడా.. ఇప్పుడు ప్రజల నుంచి ప్రశ్నల రూపంలో వస్తున్నాయి. అయితే.. ఎంపీ సాయం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. కానీ, ఈ రెండు తన చేతిలో లేవని.. వాటికి నిధులు తెచ్చి ఇచ్చే బాధ్యత తనది కాదని ఎంపీ చెబుతున్నట్టు సమాచారం. దీనికితోడు.. ఎంపీ అనుచరులు సెంట్రల్‌లో చేసే కార్యక్రమాలకు ఎమ్మెల్యే వర్గం నుంచి ఎవరినీ పిలవడం లేదు.
ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లేకుండా.. ఎంపీ అనుచరుడు ఒకరు సెంట్రల్‌లో చేపట్టారు. అదేమంటే.. మీరు ఎలానూ రావడంలేదు. పార్టీ అధినేత ఆదేశాలతో చేశామని బదులిచ్చారు. ఈ పరిణామాలతో ఎమ్మెల్యే వర్గం ఎంపీ వర్గంపై కస్సుబుస్సులాడు తోంది. మా నియోజకవర్గంలో మీ పెత్తనం ఎందుకని.. ఎమ్మెల్యే నుంచి ఎంపీ వర్గానికి సమాచారం చేరింది. కానీ.. ఎంపీ వర్గం.. గత ఎన్నికల్లో తాము ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అన్నీ మన వే అయినప్పుడు మేం ప్రచారం చేస్తే.. తప్పేంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలతో ఇరు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.
