దేవినేని అవినాష్ సహా 51 మందిపై రౌడీ షీట్.. విజయవాడ సీపీ సంచలన నిర్ణయం!
వైసీపీ నాయకులే టార్గెట్ గా కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల క్రితం మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి దిగిన పలువురు వైసీపీ కార్యకర్తలపై రౌడీ షీట్లు తెరవాలని నిర్ణయించింది.
By: Tupaki Political Desk | 23 Sept 2026 1:33 PM ISTవైసీపీ నాయకులే టార్గెట్ గా కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల క్రితం మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి దిగిన పలువురు వైసీపీ కార్యకర్తలపై రౌడీ షీట్లు తెరవాలని నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు నగరంలోని 9 పోలీసు స్టేషన్ల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ తోపాటు విజయవాడ నగరానికి చెందిన వైసీపీ నేతలు అరవ సత్యం, కాలపాల అంబేద్కర్ తో సహా మొత్తం 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని ఆదేశించారు.
రెండు రోజుల క్రితం డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయని విపక్షం వైసీపీ భారీ ఎత్తున ధర్నా నిర్వహించింది. అయితే ఇందులో పలువురు రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, ఆకతాయిలు ఉన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఐదేళ్ల క్రితం మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన నిందితులు ఉన్నారని టీడీపీ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేశారు. గతంలో పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని తేలిగ్గా విడిచిపెట్టడం వల్లే శాప్ కార్యాలయం వద్ద టీచర్లపై దాడికి తెగబడ్డారని టీడీపీ సోషల్ మీడియా ఆరోపణలు చేసింది. ఈ విషయంలో టీడీపీ అధిష్టానం వైఖరి తప్పుపడుతూ ఆ పార్టీ కార్యకర్తలు పోస్టులు, కామెంట్లతో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2021 అక్టోబరు 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారిపై ఇప్పుడు రౌడీషీట్లు తెరవాలని నిర్ణయించిందని అంటున్నారు. మొత్తం 51 మందితో రూపొందించిన జాబితాతో విజయవాడ నగరంలోని 9 పోలీసుస్టేషన్లకు సీపీ రాజశేఖరబాబు మెమో జారీ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఎమ్మెల్సీ రఘురాం, దేవినేని అవినాష్ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు బెయిలు కూడా మంజూరు చేసింది. అయితే ఇప్పుడు శాప్ కార్యాలయం వద్ద గొడవ జరిగిన తర్వాత పాత కేసును బయటకు తేవడమే రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.
గుండా రాజకీయం ముద్రవేయాలనేనా?
కాగా, ఐదేళ్ల క్రితం నాటి ఘటనపై ప్రభుత్వం తాజా చర్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. వైసీపీ నేతలపై రౌడీ షీట్ తెరవడం ద్వారా ‘గూండా రాజకీయం' చేస్తున్నారనే ముద్ర వేసేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ నాయకుల కెరీర్ కు రౌడీ షీట్ ఒక మాయని మచ్చగా నిలుస్తుందని అంటున్నారు. ఇక పలువురు కార్యకర్తల పేర్లు ఇందులో చేర్చడం ద్వారా వారి కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల ఎన్నికల సమయంలోనూ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నారు.
