బెజవాడలో డివిజన్ల పెంపు.. ఫుల్ జోష్ ఎవరికి..?
మున్సిపల్ ఎన్నికలకు ముందు.. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని డివిజన్లను 64 నుండి 86కు పెంచడంతో రాజకీయంగా ఈ ప్రభావం ఎవరికి కలిసి వస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.
By: Garuda Media | 17 Sept 2026 11:00 PM ISTమున్సిపల్ ఎన్నికలకు ముందు.. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని డివిజన్లను 64 నుండి 86కు పెంచడంతో రాజకీయంగా ఈ ప్రభావం ఎవరికి కలిసి వస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరిగిన ఈ వార్డుల పునర్విభజన బెజవాడ రాజకీయాన్ని పూర్తిగా మార్చివేయనుందని నేతలు భావిస్తున్నారు. అధికార కూటమికి ఈ మార్పు ఎక్కువగా కలిసి వస్తందని అంటున్నారు. వాస్తవానికి విజయవాడపై వైసీపీకి గత రెండేళ్లలో పట్టు పోయింది. దీనికితోడు టీడీపీ నేతల దూకుడు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత మార్పు కూటమికే అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అసమ్మతికి చెక్..!
ఇక, విజయవాడలో టీడీపీ, జనసేన పార్టీల్లో టికెట్ ఆశించే ద్వితీయ శ్రేణి నాయకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు కొత్తగా 22 డివిజన్లు పెరగడంతో, ఆశావహులందరికీ టికెట్లు సర్దుబాటు చేయడం అధికార పార్టీలకు సులువవుతుంది. ఇది పార్టీలో అసమ్మతిని తగ్గించడానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్, ఈస్ట్ నియోజకవర్గాల్లోని పెద్ద వార్డులను విభజించారు. ఈ ప్రాంతాలు సాంప్రదాయకంగా టీడీపీ, జనసేన క్యాడర్ బలంగా ఉన్న ప్రాంతాలు కావడంతో కూటమికి ఇది అదనపు బలంగా మారే అవకాశం ఉంది.
ఈసారి మేయర్ స్థానానికి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే యోచన ఉండటం, పైగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో సహజంగానే స్థానిక ఎన్నికల్లో కూటమికి రాజకీయ సానుకూలత ఉంటుంది. 2021 ఎన్నికల్లో వైసీపీ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే మారిన సరిహద్దుల వల్ల పాత ఓటు బ్యాంకు, కుల సమీకరణాలు తారుమారయ్యే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన ప్రతి వార్డును 8,500 నుండి 10,000 ఓటర్లకు పరిమితం చేశారు. కాబట్టి చిన్న వార్డుల్లో గెలుపోటములు కేవలం కొన్ని వందల ఓట్ల తేడాతోనే ఉంటాయని అంచనా వేస్తున్నారు.
కుల సమీకరణాల విషయానికి వస్తే.. అంతర్గత పోటీ.. కమ్మ వర్సెస్ కాపు సామాజికవర్గాల మధ్యే జరగనుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నగర రాజకీయంలో ఎప్పుడూ ఈ రెండు వర్గాల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటోంది. డివిజన్ల పెంపుతో ఏయే వర్గాల ఓటర్లు ఎటు వైపు చీలిపోయారనే దానిపై అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. మేయర్ రేసులో ఇప్పటికే ఇరు పార్టీల నుంచి బలమైన సామాజిక వర్గాల నేతల పేర్లు వినిపిస్తున్నాయి. డివిజన్లు పెరిగినప్పటికీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాల్సి వస్తే, ఏ డివిజన్ ఎవరికి కేటాయించాలనే అంశం ఉత్కంఠగా మారింది.
