Begin typing your search above and press return to search.

విజ‌య‌వాడ ఎమ్మెల్యేల్లో ఒక్కరే యాక్టివ్‌.. !

విజయవాడ నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒక్కరు మాత్రమే ఇప్పుడు యాక్టివ్ గా పని చేస్తున్నారు.

By:  Garuda Media   |   22 Sept 2025 11:00 AM IST
విజ‌య‌వాడ ఎమ్మెల్యేల్లో ఒక్కరే యాక్టివ్‌.. !
X

విజయవాడ నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒక్కరు మాత్రమే ఇప్పుడు యాక్టివ్ గా పని చేస్తున్నారు. అయితే ఆయన కూడా వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. అసెంబ్లీలో వేడి పుట్టిస్తున్నారు. ఆయనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర రావు. ఆయన విషయం పక్కనపెడితే, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ టిడిపి తరఫున వరుస విజయాలు దక్కించుకున్నారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో కూడా ఆయన గెలుపొందారు. బలమైన రాజకీయ నేపథ్యంతో పాటు ఆలోచన పరుడిగా, మేధావిగా, సౌమ్యుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు.

కానీ యాక్టివ్ రాజకీయాలకు వచ్చేసరికి మాత్రం గతంలో ఉన్నంత గా ఇప్పుడు స్పందించలేకపోతున్నార నేది టిడిపి నుంచి వస్తున్న విమర్శ. ప్రస్తుతం తూర్పు నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యే రామ్మోహన్ పై ఉంది. ముఖ్యంగా బెంజ్ సర్కిల్ నుంచి మచిలీపట్నం వరకు విస్తరించిన ఆరు లైన్ల జాతీయ రహదారికి సంబంధించి నివాసాలు కోల్పోయిన వారికి పరిహారం ఎప్పటి వరకు ఇవ్వలేదు. దీనిలో సగభాగం తూర్పు నియోజకవర్గం పరిధిలోకి వస్తుండగా.. మిగిలిన భాగం పెనమలూరు నియోజకవర్గంలోకి వస్తుంది.

పెనమలూరు విషయాన్ని పక్కన పెడితే విజయవాడకు సంబంధించిన పరిధిలో గద్దె రామ్మోహన్ స్పందించాల్సి ఉంది. కానీ, ఆయన దీనిపై ఇంతవరకు స్పందించలేదు. అదేవిధంగా గుణదల రైల్వే ట్రాక్ పై వంతెన నిర్మించాల్సిన విషయం కూడా పెండింగ్లో ఉంది. గతంలోనే ఇది సగం నిర్మాణం పూర్తి చేసుకుంది. ఆ తర్వాత పనులు ఆగిపోయాయి. గత ఎన్నికల సమయంలో తాను గెలిస్తే ఈ వంతెనను పూర్తి చేస్తానని ఆయన చెప్పారు. కానీ, ఇప్పటివరకు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే అసలు అసెంబ్లీలో కూడా గద్దె రామ్మోహన్ వాయిస్ ఇప్పటివరకు వినిపించ లేదన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ. ఇది కూడా వాస్తవమే.

నిజానికి ఎమ్మెల్యేగా ఆయన సభలో ఒకప్పుడు యాక్టివ్గా ఉండేవారు. బలమైన ప్రశ్నలు అడిగే వారు. సమాధానాలు రాబట్టేవారు. కానీ, గడిచిన ఏడాది కాలంగా గద్దె రామ్మోహన్ వాయిస్ అసెంబ్లీలో ఎక్కడ వినిపించకపోవడం విశేషం. ఇక, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా సైలెంట్ అయిపోయారు. గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ, ఇప్పటివరకు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై ఒక్కసారి కూడా గళం వినిపించలేదు.

ఆ మధ్యకాలంలో ఆయన ప్రమాదానికి గురవడం, అనారోగ్యంతో హైదరాబాద్‌కే పరిమితం కావ‌డం తెలిసిందే. ప్రస్తుతం దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడలోనే ఉంటున్నప్పటికీ అసెంబ్లీకి మాత్రం ఆయన హాజరు కావడం లేదు. కానీ పశ్చిమ నియోజకవర్గం లోని కొండ ప్రాంత ప్రజలకు తాగునీరుతోపాటు పట్టాలను కూడా ఇవ్వాల్సి ఉంది. అదే విధంగా కాళేశ్వ‌ర‌రావు మార్కెట్ జంక్షన్ రోడ్డు విస్తరించేలా తాను చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇక సొరంగం మార్గాన్ని వెడల్పు చేయించడంతోపాటు మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల సమయంలో చెప్పారు.

కానీ, ఈ సమస్యలు ఇప్పటికే అలాగే ఉన్నాయి మరీ ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యలు, అదేవిధంగా వర్క్ షాప్ ను విస్తరించే విషయంపై ఆయన ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో కొత్త ఎమ్మెల్యే పై స్థానికంగా పెట్టుకున్న ఆశలు నెరవేరడం లేదన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. అయితే, ప్రభుత్వానికి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ఈ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కార్యాలయం చెబుతోంది.

కానీ, స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులు రాజకీయ పరిణామాలు నేపథ్యంలో మాత్రం ఒకింత ఎమ్మెల్యేపై విమర్శలు వస్తున్నాయని చెప్పాలి. ఆయా సమస్యలను పరిష్కరించుకుని ప్రజల ఆదరాభిమానాలను కనుక చౌదరి సొంతం చేసుకోగలిగితే భవిష్యత్తులో ఆయనకు తిరుగు లేదన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.