ఇన్ స్టాలో పరిచయం.. ఇల్లు వదిలి బాలుడి ఇంటికి వెళ్లిన మైనర్ బాలిక
అంతకు ముందు రోజు రాత్రే ఇంటికి వచ్చేసింది కదా? అని అడగటంతో.. మైనర్ బాలిక కనిపించట్లేదన్న విషయం అర్థమైంది.
By: Garuda Media | 24 Jan 2026 10:24 AM ISTషాకింగ్ ఘటనకు బెజవాడ వేదికగా మారింది. సోషల్ మీడియా వినియోగం ఎలాంటి విపరిణామాలకు దారి తీస్తుందన్న దానికి ఈ ఉదంతం ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఒక మైనర్ బాలిక.. ఇన్ స్టాలో తనకు పరిచయమైన మైనర్ బాలుడి కోసం ఇల్లు వదిలేసి వెళ్లిపోవటమే కాదు.. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ససేమిరా అనటం.. బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటం లాంటివి చూస్తే విస్మయానికి గురి కావాల్సిందే.
విజయవాడ శివారులోని ప్రసాదంపాడుకు చెందిన పదహారేళ్ల బాలిక పదో తరగతి ఫెయిల్ అయ్యింది. ఒక షాపులో పని చేస్తోంది. ఇన్ స్టాలో ఒకరితో తరచూ చాట్ చేస్తూ ఉంటుంది. ఈ తీరుపై ఆమె తల్లి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మందలించింది. ఈ నెల 21న తమ ప్రాంతానికి దగ్గర్లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ రాత్రి ఇంటికి వెళుతున్నానని చెప్పి బస్సు ఎక్కి ఇన్ స్టాలో పరిచయమైన మైనర్ బాలుడి ఇంటికి వెళ్లింది. కూతురు ఎంతసేపటికి రాకపోవటంతో తన తల్లికి ఫోన్ చేసింది మైనర్ బాలిక అమ్మ.
అంతకు ముందు రోజు రాత్రే ఇంటికి వచ్చేసింది కదా? అని అడగటంతో.. మైనర్ బాలిక కనిపించట్లేదన్న విషయం అర్థమైంది. అదే సమయంలో ఆమె దగ్గరున్న ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. బాలుడి ఇన్ స్టా ఐడీ ద్వారా అతడి ఇంటి లొకేషన్ ను గుర్తించిన పోలీసులు అక్కడకు వెళ్లారు. బాలిక తమ వద్దే ఉందని బాలుడి తల్లిదండ్రులు చెప్పటంతో పాటు.. తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని.. ఇంటికి వెళ్లిపోవాలని కోరితే ససేమిరా అనటమే కాదు.. బలవంతం చేస్తే సూసైడ్ చేసుకుంటానని బెదిరింపులకు దిగినట్లుగా వారు వాపోయారు. చివరకు తల్లిదండ్రుల ఫోన్ నెంబరు అడిగినా ఇవ్వలేదని చెప్పారు.
దీంతో.. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించి..అక్కడి నుంచి ఆమెను ఒప్పించి ఇంటికి పంపారు. ఈ ఉదంతాన్ని చూస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పేరెంటింగ్ లో వచ్చిన మార్పులు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి.
