Begin typing your search above and press return to search.

బెజ‌వాడ పాలిటిక్స్ ఫుల్ సైలెంట్‌.. రీజ‌నిదేనా.. ?

నిజానికి శుక్రవారం జరిగిన రాయచోటి, పుంగనూరు ఘటనలపై రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నాయకులు స్పందించారు.

By:  Garuda Media   |   19 Oct 2026 9:16 AM IST
బెజ‌వాడ పాలిటిక్స్ ఫుల్ సైలెంట్‌.. రీజ‌నిదేనా.. ?
X

ఎప్పుడు రాజకీయంగా ఆసక్తిగా ఉండే విజయవాడ రాజకీయాలు అనూహ్యంగా సైలెంట్ అయిపోయాయి. నిన్న.. మొన్నటి వరకు కార్పొరేషన్ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శిస్తామంటూ.. ఎట్టి పరిస్థితుల్లో తామే సొంతం చేసుకుంటామంటూ ప్రకటనలు గుప్పించిన టిడిపిలోని ఒక వర్గం నాయకులు ఇప్పుడు పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా ఎవరూ బయటికి రాకపోవడం, ఎవరు పార్టీ తరఫున గాని ఇటు రాజకీయంగా కానీ అలాంటి కామెంట్లు చేయకపోవడం గమనార్హం.

నిజానికి శుక్రవారం జరిగిన రాయచోటి, పుంగనూరు ఘటనలపై రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నాయకులు స్పందించారు. వైసీపీపై విమర్శలు గుప్పించారు. కానీ, విజయవాడలో మాత్రం ఒక్కరంటే ఒకరు కూడా నాయకులు ముందుకు రాకపోవడం గమనార్హం. ఇది అంతర్గతంగా పార్టీలో జరుగుతున్న చర్చగా మారుతోంది. విజయవాడ మేయర్ పీఠాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తన కుమారుడు రవితేజకు ఇప్పించుకోవాలని భావించారు. అయితే అనూహ్యంగా కూటమి పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారు.

అంతేకాదు.. అప్పటివరకు టిడిపిలో ఉన్న వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరిపోయారు. ఈ పరిణామాలను ఊహించని సీనియర్ నాయకులు ఇప్పుడు రాధాతో ఏ విధంగా ముందుకు సాగాలి అనే అంశంపై త‌ర్జ‌న-భ‌ర్జ‌న‌ పడుతున్నారు. గత ఎన్నికల సమయంలోనే రాధాతో బొండా ఉమాకు విభేదాలు ఏర్పడ్డాయి. ఆ ఎన్నికల్లో రాధా సెంట్రల్ నియోజకవర్గం టికెట్ ఆశించడం దీనిని చంద్రబాబు ఇవ్వకపోవడం వంటివి జరిగాయి. ఇక‌, ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మేయర్ స్థానం విషయంలో కూడా అదే జరగడంతో బొండ ఉమా వర్గం ఫుల్ గా సైలెంట్ అయిపోయింది.

ఇక తూర్పు నియోజకవర్గంలో కూడా గద్దె రామ్మోహన్ సైలెంట్ గా ఉన్నారు. వెస్ట్ లో సుజనా చౌదరి బిజెపి నాయకుడు కావడంతో ఆయన అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. మొత్తంగా కార్పొరేషన్ ఎన్నికల్లో కోలాహలం అయితే కనిపించడం లేదు. గతానికి భిన్నంగా నాయకులందరూ సైలెంట్ అయిపోవడంతో ఇప్పుడు వంగవీటి రాధా పరిస్థితి ఏంటి అన్నది చూడాలి. స్థానికంగా జనసేనకు కేడర్ ఉన్నప్పటికీ ముందుండి ఇప్పటివరకు ఎవరు నడిపించలేదు.

గతంలో పోతిన‌ వెంకట మహేష్ కొంత దూకుడుగా వ్యవహరించి నప్పటికీ.. ఆయన పార్టీకి దూరం కావడంతో అప్పటినుంచి జనసేన విజయవాడలో సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా దీనిని ఎంగేజ్ చేయటం తన వైపు తిప్పుకోవడం అనేది రాధాకు కొంత‌ సవాల్‌గా మారుతుందని అంటున్నారు. అదే సమయంలో కూటమి పార్టీలను ఐక్యం చేయడం కూడా ఆయనకు అంత ఈజీ కాదని కూడా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.