కూటమి నుంచి వంగవీటి.... వైసీపీ నుంచి దేవినేని ?
విజయవాడ రాజకీయం స్థానిక ఎన్నికల నేపథ్యంలో సలసల కాగి వేడెక్కనుందా అంటే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే అదే నిజం అనిపిస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
By: Satya P | 14 Oct 2026 8:07 PM ISTవిజయవాడ రాజకీయం స్థానిక ఎన్నికల నేపథ్యంలో సలసల కాగి వేడెక్కనుందా అంటే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే అదే నిజం అనిపిస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. విజయవాడ కార్పోరేషన్ ఏపీలో రెండవ పెద్ద సంస్థ. మేయర్ పదవి అంటే గుండె కాయ లాంటిదే. పైగా రాజధాని అమరావతికి అనుసంధానం అయి ఉన్న పాంతం. దాంతో నగరాభివృద్ధికి వారధిగా రాజకీయ రాజాధానికి సారధిగా మేయర్ కీలక పాత్ర పోషిస్తారు. ఇక ఏపీ మొత్తం రాజకీయాలకు అక్కడే కేంద్ర బిందువు కాబట్టి అలాంటి చోట తమ పార్టీ జెండా ఎగరేయాలని ప్రతీ పార్టీ కోరుకుంటుంది. ఇక విజయవాడ మేయర్ పదవి కోసం కూటమి వర్సెస్ వైసీపీ సై అంటున్నాయి. అభ్యర్ధులుగా బరిలోకి దిగనున్న వారి పేర్లు చూస్తే హీట్ పుట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
జనసేన నుంచి రాధా :
జనసేనకు విజయవాడ కార్పోరేషన్ పొత్తులో భాగంగా ఇస్తారు అని అంటున్నారు. దాంతో ఈ మేయర్ పదవికి వంగవీటి రాధాకృష్ణ జనసేన నుంచి పోటీ పడతారు అని అంటున్నారు. దాని కంటే ముందు ఆయన జనసేన పార్టీ కండువా కప్పుకుంటారు అని కూడా తెలుస్తోంది. అలా రాధా కూటమి నుంచి అభ్యర్థిగా నిలబడితే వైసీపీ నుంచి ధీటైన వారినే ఎంపిక చేయాలని వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి తట్టిన ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్ దేవినేని అవినాష్, ఆయన ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో విజయవాడ తూర్పు నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా ఉన్న దేవినేని అవినాష్ అయితే కూటమికి గట్టిగా పోటీ ఇవ్వడమే కాదు బలంగా ఎదుర్కొంటారు అన్నది ఫ్యాన్ పార్టీ పెద్దల ఆలోచనగా ఉంది అని అంటున్నారు.
బలమైన రాజకీయంగా :
దేవినేని కుటుంబానికి విజయవాడ రాజకీయాల్లో బలమైన పాత్ర ఉంది. 1983లోనే దేవినేని నెహ్రూ యంగ్ ఏజ్ లో తొలిసారి ఎమ్మెల్యే అయి చక్రం తిప్పారు. అనంతర కాలంలో మంత్రిగా పనిచేశారు. ఆయన పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. విజయవాడ రాజకీయాలను తన హయాంలో శాసించారు. ఆయన కుమారుడిగా దేవినేని అవినాష్ కాంగ్రెస్ నుంచి అరంగేట్రం చేసినప్పటికీ తరువాత టీడీపీలో చేరారు. ఆ మీదట ఆయన వైసీపీలోకి వచ్చారు. మొత్తానికి వైసీపీకి విజయవాడలో దేవినేని వారసత్వాన్ని కొనసాగిస్తూ యువ నేతగా అవినాష్ కీలకంగా ఉన్నారు. దాంతో ఆయనను బరిలోకి దింపాలన్నది వైసీపీ అధినాయకత్వం ఎత్తుగడగా కనిపిస్తోంది అని అంటున్నారు.
సామాజిక కోణంలో :
బెజవాడ రాజకీయాల్లో కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం అధికంగా ఉంటుంది. దాంతో అదే సామాజిక వర్గానికి చెందిన అవినాష్ ని పోటీలో దించితే సానుకూల ఫలితాలు వస్తాయని వైసీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. కూటమికి బలమైన కాపు సామాజిక వర్గం ప్లస్ అయితే వైసీపీకి అదే విధంగా కమ్మ సామాజిక వర్గం నుంచి ఆదరణ దక్కవచ్చు అని అంచనా వేస్తున్నారు. అంతే కాదు కూటమిలో అసంతృప్తి ఉంటే అది కూడా తమకు అనుకూలం అవుతుందని కూడా లెక్క వేస్తున్నారు అని అంటున్నారు. రాధా అక్కడ అభ్యర్ధి అయితే ఇక్కడ దేవినేని అభ్యర్థి అవుతారు అన్నది ప్రచారంలో ఉంది. అదే కనుక జరిగితే ఏపీ మొత్తం బెజవాడ రాజకీయాన్నే ఆసక్తిగా చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
