Begin typing your search above and press return to search.

బీసీలా.. కాపులా.. బెజ‌వాడ టీడీపీ మేయ‌ర్ ఎవ‌రు.. ?

విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్లు రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేష‌న్లుగా పేరు తెచ్చుకున్నాయి దీంతో ఆయా ప‌ద‌వుల‌కు కూడా అంతే డిమాండ్ ఉంది.

By:  Garuda Media   |   30 Aug 2026 9:24 AM IST
బీసీలా.. కాపులా.. బెజ‌వాడ టీడీపీ మేయ‌ర్ ఎవ‌రు.. ?
X

విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్లు రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేష‌న్లుగా పేరు తెచ్చుకున్నాయి దీంతో ఆయా ప‌ద‌వుల‌కు కూడా అంతే డిమాండ్ ఉంది. ఈ రెండు కార్పొరేష‌న్ల‌లో మేయ‌ర్ ప‌ద‌వుల‌కు కూడా భారీ పోటీ ఉంటుంది. ఇక‌, ఈ రెండు స్థానాలు ప్ర‌స్తుతానికి జ‌న‌ర‌ల్ కేట‌గిరీలోనే ఉన్నాయి. అయితే.. ఇంకా రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు కాలేదు కాబ‌ట్టి.. వ‌చ్చే 10 -15 రోజుల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్ప‌లేం. ప్ర‌స్తుతానికి ఈ రెండు మేయ‌ర్ పీఠాలు జ‌న‌ర‌ల్‌లోనే ఉన్నాయి.

మ‌రీ ముఖ్యంగా రాజ‌కీయ చైత‌న్యం.. స్థానికంగా ఉన్న పొలిటిక‌ల్ ఎఫెక్ట్ కార‌ణంగా బెజ‌వాడ మేయ‌ర్ పీఠానికి మ‌రింత ప్రాధాన్యం ఉంది. ఈ నేప‌థ్యంలో దీనిని ద‌క్కించుకునేందుకు ఆశావ‌హులు పోటీ ప‌డుతుంటాయి. 2021లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ ఈ రెండుచోట్లా పాగా వేసింది. ఇక‌, విజ‌య‌వాడ విష‌యానికి వ‌స్తే.. జ‌న‌ర‌ల్ అయినా బీసీల‌ను త‌మ‌వైపు తిప్పుకోవాల‌న్న ఉద్దేశంతో వైసీపీ అప్ప‌ట్లో న‌గ‌రాలు సామాజిక వ‌ర్గానికి చెందిన బీసీ మ‌హిళ‌కు బెజ‌వాడ మేయ‌ర్ పీఠాన్ని అప్ప‌గించింది.

ఇక‌, ఇప్పుడు మ‌రోసారి ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అది కూడా టీడీపీలోనే ఎక్కువ‌గా వినిపిస్తుండడం గ‌మ‌నార్హం. బీసీ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో మేయ‌ర్‌ పీఠం జ‌న‌ర‌ల్ అయిన‌ప్ప‌టికీ.. ఆ వ‌ర్గానికే కేటాయించాల‌ని టీడీపీ లోని కొంద‌రు నాయ‌కులు సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఒక‌రిద్ద‌రు నాయ‌కురాళ్ల పేర్లు కూడా తెర‌మీదికి వ‌స్తున్నాయి. దీనికి ద‌న్నుగా.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ఇటీవ‌ల బాధ్య‌త‌లు చేప‌ట్టిన బుద్దా వెంక‌న్న కూడా.. బీసీల‌కే ఇవ్వాల‌ని కోరుతున్న‌ట్టు చెప్పుకొచ్చారు.

ఇదే స‌మ‌యంలో కాపుల కోటాలో ఈ సీటు ఆ వ‌ర్గానికి కేటాయించాల‌ని టీడీపీ లో మ‌రో వ‌ర్గం కోరుతోంది. కాపు సామా జిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇవ్వాల‌న్న డిమాండ్ ఉన్న నేప‌థ్యంలో ఈ మేయ‌ర్ స్థానాన్ని వారికి కేటాయిస్తే.. పార్టీపై సానుభూతి పెరుగుతుంద‌ని.. కాపులు ఏక‌మ‌వుతార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ రెండు సామాజిక వ‌ర్గాల మ‌ధ్య బెజ‌వాడ మేయ‌ర్ పీఠం వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌స్తోంది. గ‌తంలో కూడా టీడీపీ బీసీ మ‌హిళ పంచుమ‌ర్తి అనురాధ‌కు మేయ‌ర్ పీఠం అప్ప‌గించింది. ఆ త‌ర్వాత ఇదే పార్టీ క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు కాపుల‌కు ఇవ్వాల‌న్న డిమాండ్ తెర‌మీదికి రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏ చేస్తారో ? చూడాలి.