Begin typing your search above and press return to search.

విజయవాడ హీట్ పుట్టిస్తున్న రాజకీయం.. ఏబీవీ చుట్టూనే చర్చలు

రిజర్వేషన్ అనుకూలించినా తమ వారికి అవకాశం ఇవ్వకుండా టీడీపీ తప్పుచేసిందన్న భావనతో ప్రధాన సామాజికవర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   24 Oct 2026 11:34 AM IST
విజయవాడ హీట్ పుట్టిస్తున్న రాజకీయం.. ఏబీవీ చుట్టూనే చర్చలు
X

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఒక ఎత్తు అయితే విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలు మరో ఎత్తు అన్నట్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ కార్పొరేషన్ నుంచి ప్రముఖ కాపు నేత వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ కూటమి అభ్యర్థిగా మేయర్ పదవికి పోటీ చేస్తుండగా, ఆయనకు ప్రత్యర్థిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రంగంలోకి దిగడంతో విజయవాడ కార్పొరేషన్ ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ప్రధానంగా విజయవాడ రాష్ట్ర రాజకీయ కేంద్రం. సాంకేతికంగా అమరావతి రాజధాని అయినప్పటికీ అధికారులు, నాయకులు ఎక్కువగా విజయవాడ నగరంలోనే నివసిస్తున్నారు. ఒక విధంగా ప్రస్తుతం విజయవాడే రాజధానిగా అనధికారికంగా కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోటీకి దిగిన తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయని అంటున్నారు.

రాజకీయంగా చారిత్రకంగా విజయవాడకు రాష్ట్రంలో చాలా ప్రాధాన్యం ఉంది. పూర్వం నుంచి విజయవాడ మేథోనగరంగా గుర్తింపు పొందింది. సాహిత్యకారులు, పుస్తక ప్రచురణ కర్తలు, దినపత్రికలు, సినీ రంగానికి విజయవాడ కేంద్రంగా ఉండేది. ఇక ఆటోమొబైల్ రంగానికి ఇప్పటికే విజయవాడే కేంద్రంగా వర్ధిల్లుతోంది. అటు ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ భక్తులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో విజయవాడ రాజకీయాలు దేశవ్యాప్తంగా ఆకర్షిస్తున్నాయి. ఇదే సమయంలో ఇక్కడి రౌడీయిజం, కుల రాజకీయాలు కూడా ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులను అన్నీ అనుకూలంగా చేసుకుని కూటమి పార్టీలు తమ అభ్యర్థిగా స్థానికుడైన వంగవీటి రాధాకృష్ణను అభ్యర్థిగా నిలిపాయి. దీంతో ఆయన విజయం నల్లేరుపై నడకే అన్న విశ్లేషణలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ అంచనాలను తలకిందులు చేసేలా రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ పోటీకి దిగడంతో విజయవాడ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది.

కూటమి అభ్యర్థిగా వంగవీటి, వైసీపీ అభ్యర్థిగా మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పోటీ చేస్తున్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు కోసమే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆయన చీల్చే ఓట్లు ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థుల తలరాతను మార్చే అవకాశం ఉందని అంటున్నారు. విజయవాడ నగరంలోని రాజకీయాలకు శాసించే ఓ ప్రధాన సామాజికవర్గం స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతు పలికే సూచనలు కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కూటమి అభ్యర్థి వంగవీటి విజయావకాశాలు తీవ్రంగా ప్రభావితమవడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి విజయవాడలో రెండు ప్రధాన సామాజికవర్గాల్లో ఒకటి వంగవీటికి వెన్నుదన్నుగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. మరో ప్రధాన సామాజికవర్గం కూడా కూటమిలోని ప్రధాన రాజకీయ పక్షమైన టీడీపీతోనే ఉంటుందని భావించారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావు పోటీ చేయడతో ఆ సామాజికవర్గం నేతల ఆలోచనల్లో మార్పు వచ్చిందన్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది.

రిజర్వేషన్ అనుకూలించినా తమ వారికి అవకాశం ఇవ్వకుండా టీడీపీ తప్పుచేసిందన్న భావనతో ప్రధాన సామాజికవర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో తమ సామాజికవర్గం వారన్న ఏకైక కారణంతో రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వేధింపులు ఎదుర్కున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తర్వాత కూడా ఆయనకు న్యాయం జరగలేదన్న భావన ఆ సామాజికవర్గంలో ఉందని అంటున్నారు. మరోవైపు రెండు పర్యాయాలు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా ఏబీవీ పనిచేయడం కూడా ఆయనకు కలిసి వస్తుందని అంటున్నారు. ఆ నాటి పరిచయాలు, తన సొంత సామాజికవర్గం మద్దతుతో ఆయన అనూహ్యంగా పుంజుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు విపక్షంలోని కొందరు నాయకులు కూడా లోపాయికారిగా ఏబీ వెంకటేశ్వరరావుకి మద్దతు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారని సంకేతాలు అందుతున్నట్లు చెబుతున్నారు.

మొత్తానికి ఇప్పుడు ఎక్కడ చూసినా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపైనే చర్చలు జరుగుతున్నాయి. అందులోనూ స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభావం ఎంత? ఆయనకు మద్దతుగా నిలిచేవారు ఎవరు? సొంత సామాజికవర్గం ఆదరణ ఉంటుందా? అన్న చర్చలే కాక రేపుతున్నాయి. అటు ఏబీవీ సైతం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దాదాపు 36 ఏళ్ల పోలీసు అనుభవాన్ని వినియోగించుకుంటూ తెర వెనుక రాజకీయాలను రక్తి కట్టిస్తూ అధికార పార్టీకి సవాళ్లు విసురుతున్నారని అంటున్నారు. తొలుత ఏబీవీ పోటీని లైట్ గా తీసుకున్న కూటమి నేతలు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తున్నట్లు గ్రహించి అప్రమత్తమయ్యారని చెబుతున్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం విజయవాడ రాజకీయ పరిణామాలను గమనిస్తూ పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారని అంటున్నారు.