Begin typing your search above and press return to search.

మినిస్టర్ విజయశాంతి...ఒక బెర్త్ ఆమెకు కంఫర్మ్ ?

సినీ రంగంలో దశాబ్దాల పాటు టాప్ హీరోయిన్ గా రాణించిన విజయశాంతి రాజకీయాల్లోనూ తనదైన హవా చాటుకుంటూ వచ్చారు.

By:  Satya P   |   13 Jun 2026 5:00 PM IST
మినిస్టర్ విజయశాంతి...ఒక బెర్త్ ఆమెకు కంఫర్మ్ ?
X

సినీ రంగంలో దశాబ్దాల పాటు టాప్ హీరోయిన్ గా రాణించిన విజయశాంతి రాజకీయాల్లోనూ తనదైన హవా చాటుకుంటూ వచ్చారు. మెదక్ నుంచి ఒకసారి ఎంపీగా గెలిచిన ఆమె తాజాగా కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ అయ్యారు. అనూహ్యంగా కేంద్ర కాంగ్రెస్ పెద్దల సిఫార్సులతో ఎమ్మెల్సీగా చోటు సంపాదించిన విజయశాంతి ఇపుడు మంత్రి పదవి కోసం పావులు కదుపుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ లో చేరిన ఆమె ఎమ్మెల్సీ అయినా మౌన ముద్రలోనే ఉంటున్నారు. శాసనమండలిలో ఆ మధ్య ప్రభుత్వం మీద పరోక్ష విమర్శలు చేసిన విజయశాంతి తనలోని అసంతృప్తిని ఆ విధంగా చాటారు అని గుర్తు చేస్తున్నారు. తమ స్థాయికి తగినట్లుగా మంత్రి పదవి రావడం లేదన్న ఆవేదన ఆమెలో ఉంది అని అంటున్నారు.

దూరంగానే ఉంటూ :

కాంగ్రెస్ లో చేరిన ఆమె ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. కానీ 2024లో సీటు దక్కలేదు, ఇక ఎమ్మెల్సీగా ఆమె పేరుని హైకమాండ్ దగ్గరుండి మరీ పెట్టించింది అని చెప్పుకున్నారు. దాంతో కేంద్ర నాయకులతోనే టచ్ లో ఉంటూ వస్తున్న విజయశాంతి తెలంగాణా కాంగ్రెస్ రాజకీయాల్లో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగానే ఉంటున్నారు అని ప్రచారం సాగుతోంది. మరో వైపు చూస్తే పార్టీ తన సేవలను పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదన్న బాధ కూడా ఆమెకు ఉందని అంటున్నారు. ఇక మంత్రి పదవి కోసం విజయశాంతి ఎదురుచూస్తున్నారు అన్న చర్చ కూడా సాగుతోంది.

త్వరలోనే విస్తరణ :

ఇదిలాఉంటే తెలంగాణాలో కాంగ్రెస్ మంత్రి వర్గ విస్తరణ త్వరలో ఉంటుందని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. కేబినెట్ లో కొన్ని ఖాళీలు ఉన్నాయి. అదే సమయంలో పనిచేయని వారిని తీసి పక్కన పెట్టాలని కూడా కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారని అంటున్నారు. అలా చూసుకుంటే కనీసంగా అరడజన్ నుంచి గరిష్టంగా ఎనిమిది దాకా మంత్రి పదవులు కొత్తగా తీసుకునే చాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది. సామాజిక ప్రాంతీయ సమతూల్యతతో పాటు గ్లామర్ ఉన్న వారికి పార్టీ వాయిస్ ని ప్రభుత్వం అజెండాను జనంలోకి తీసుకుని వెళ్లే వారికే ప్రాధాన్యత అని కూడా చెబుతున్నారు. దాంతో సినీ రంగంలో అగ్రశ్రేణి తారగా వెలుగొంది రాములమ్మగా జనాల చేత పిలిపించుకుంటున్న విజయశాంతి తన ఇమేజ్ తో మంత్రి కావాలని చూస్తున్నారు అని అంటున్నారు.

హస్తినకు పయనమా :

ఈ క్రమంలో విజయశాంతి హస్తిన బాట పడతారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఆమె తొందరలోనే ఢిల్లీ వెళ్ళి హైకమాండ్ పెద్దలతోనే భేటీ అవుతారు అని అంటున్నారు. తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలన్నది ఆమె వివరించడమే కాకుండా ఇస్తే కనుక తాను ఏమి చేస్తాను అన్నది కూడా తెలియచేస్తారని కూడా అంటున్నారు. నేరుగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతోనే ఆమె భేటీ అవుతారు అని కూడా ప్రచారం సాగుతోంది. వరసగా మరోసారి కాంగ్రెస్ గెలవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. దాంతో నోరున్న పేరున్న నాయకులకు పదవులు ఇవ్వాలని అనుకుంటున్నారు. సరిగ్గా ఇదే అవకాశంగా విజయశాంతి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు అని అంటున్నారు.

అన్ని అర్హతలు సరి చూసుకునే :

ఇక రాములమ్మ తనకు ఉన్న అన్ని అర్హతలు సరిచూసుకునే మంత్రి పదవిని కోరుకుంటున్నారు అని అంటున్నారు. జనంలో ఇమేజ్ ఉందని అలాగే బీసీ నేతగా గుర్తింపు ఉందని తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రికార్డు ఉందని ఆమె అనుచరులు గుర్తు చేస్తున్నారు. మంత్రిగా ఆమెకు స్థానం కల్పిస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వానికే మేలు చేకూరుస్తుందని కూడా చెబుతున్న వారూ ఉన్నారు. మొత్తానికి విజయ శాంతి మంత్రి పదవి కోసం ఢిల్లీకి వెళ్తారు అన్న ప్రచారం మాత్రం గట్టిగా సాగుతోంది. ఇక రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కీలకమైన మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో విజయశాంతికి మంత్రి పదవి దక్కినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం ఏ విధంగా మారుతుందో.