జగన్ పిలిచారు...సాయిరెడ్డి వెళ్తున్నారు..నిజమేనా ?
వైసీపీ పునాది నుంచి ఉన్న నాయకుడు విజయసాయిరెడ్డి. జగన్ కి ఆయన అత్యంత సన్నిహితుడు.
By: Satya P | 6 Aug 2025 9:40 AM ISTవైసీపీ పునాది నుంచి ఉన్న నాయకుడు విజయసాయిరెడ్డి. జగన్ కి ఆయన అత్యంత సన్నిహితుడు. వైఎస్సార్ కుటుంబంలో మూడు తరాల అనుబంధం ఉంది. అటువంటి నాయకుడు సడెన్ గా వైసీపీ నుంచి దూరం అయ్యారు తన పదవులతో పాటు పార్టీకీ రాజీనామా చేశారు. ఇక రాజకీయం చాలు వ్యవసాయమే మేలు అని కూడా ఆయన అనుకున్నారు. అలా వైసీపీకి రాజకీయాలకు దండం పెట్టిన విజయసాయిరెడ్డి ఇపుడు వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.
రాయబారం సాగిందా :
వైసీపీ అధినేత జగన్ కి విజయసాయిరెడ్డికి మధ్య సన్నిహితంగా ఉండే ఒక కీలక నాయకుడు జగన్ వద్ద రాయబారం నడిపారు అని అంటున్నారు పార్టీ కోసం విజయసాయిరెడ్డి ఎంతో చేశారు అని ఆయన చెప్పారట. అంతే కాదు విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్ళినా జగన్ మీద పల్లెత్తు మాట అనలేదని ఆయనకు జగన్ పట్ల విధేయత అలాగే ఉందని కూడా చెప్పారట. కొన్ని అనివార్య పరిస్థితుల వల్లనే విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళారు తప్ప ఆయన వైసీపీ పట్ల విధేయంగానే ఉంటున్నారని చెప్పుకొచ్చారట.
ఓకే అన్నారా లేక :
అయితే జగన్ ఈ విషయం మీద ఎటూ ఏమీ చెప్పలేదని అంటున్నారు సాధారణంగా ఏ విషయం అయినా వెంటనే తేల్చేసే జగన్ విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం ఎందుకో ఆలోచిస్తున్నారని అంటున్నారు దానికి కారణం పార్టీలో చాలా మంది నేతలు విజయసాయిరెడ్డి పట్ల గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ఆయన కాకినాడ సీ పోర్టు వ్యవహారం మీద విచారణకు హాజరైనపుడు కొన్ని విషయాలను మీడియా ముఖంగానే చెప్పారని అదే లిక్కర్ స్కాం కేసు ప్రాణం పోసుకోవడానికి కారణం అయిందని ఇపుడు అంతా ఇరుక్కున్నారని వారి ఆగ్రహమని అంటున్నారు. దాంతోనే జగన్ విజయసాయిరెడ్డిని ఆహ్వానించే విషయంలో ఏమీ తేల్చుకోలేకపోతున్నారు అని అంటున్నారు.
ఆయనతో పాటే అంతా :
ఇక వైసీపీకి జగన్ కి విజయసాయిరెడ్డి ఎంతో చేశారని ఆయన పార్టీలో ఉండగా ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారని ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేశారని చెబుతారు. ఇపుడు వైసీపీలో అలాంటి ట్రబుల్ షూటర్ అయితే కరవు అయ్యారని అంటున్నారు. అందుకే విజయసాయిరెడ్డ్ని తిరిగి పార్టీలోకి తీసుకుని రావాలని ఒక వర్గం పట్టుబడుతోంది అని అంటున్నారు. ఈ కీలక సమయంలో పార్టీలో ఆయనను ఉంచుకుంటే మేలు జరుగుతుందని భావిస్తున్నారుట. మొతానికి విజయసాయిరెడ్డి వైసీపీలో రీ ఎంట్రీ ఇస్తే వైసీపీ నుంచి వేరుపడి కూటమిలో చేరి అక్కడ సరైన ప్రాధాన్యత లేకుండా ఉన్న నాయకులు అనేకమంది వైసీపీలోకి వస్తారని ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి విజయసాయిరెడ్డి రీ ఎంట్రీ మీద అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
