Begin typing your search above and press return to search.

జగన్ తప్పులను ఎత్తి చూపుతున్న విజయసాయి

అయితే గతంలో విజయసాయిరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నపుడు ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతుగా గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.

By:  Satya P   |   20 April 2026 9:21 AM IST
జగన్ తప్పులను ఎత్తి చూపుతున్న విజయసాయి
X

విజయసాయిరెడ్డి వైసీపీలో నంబర్ టూ హోదాలో ఉండేవారు. ఒక విధంగా జగన్ కోటరిలో అతి ముఖ్యుడు అన్న ప్రచారం కూడా అప్పట్లో ఉండేది. ఆనాడు వైసీపీలో ఏమి జరిగినా ఏమి చేసినా విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి పార్టీ స్టాండ్ ని గట్టిగా సమర్ధించేవారు. బలంగా వాదించేవారు. అయితే ఆయన ఏణ్ణర్థం క్రితం వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పటికైతే ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. అంతే కాదు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటి అన్నది కూడా ఒక స్పష్టత ఇప్పటికైతే ఇవ్వలేదు. అయితే ఆయన తిరిగి వైసీపీ లోకి వెళ్తారు అంటూ వస్తున్న వార్తలు కానీ జరుగుతున్న ప్రచారం కానీ ఆయన పెడుతున్న ట్వీట్లతో పటాపంచలు అయిపోతున్నాయి. అంతే కాదు ఆయన వైసీపీ వైఖరిని తనదైన శైలిలో నిశితంగా విమర్శిస్తున్నారు.

మావిగాన్ సరికాదు :

జగన్ ఈ మధ్యనే కొత్తగా మావిగాన్ అంటూ అమరావతికి ఆల్టర్నేటివ్ ప్లాన్ ని సూచించారు. ప్లాన్ బీగా కూడా చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ లో మావిగాన్ ప్రతిపాదనను తప్పుపట్టారు. మావిగాన్ పేరుతో ఏకంగా వంద కిలోమీటర్ల మేర ఒక రాజధానిని విస్తరించడం మంచిది కాదని అన్నారు. దాని వల్ల పరిపాలనలో సమన్వయం పూర్తిగా దెబ్బతింటుందని విజయసాయిరెడ్డి చెప్పడం విశేషం. అంతే కాదు పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

మూడు రాజధానులకు మద్దతు:

అయితే గతంలో విజయసాయిరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నపుడు ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతుగా గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అది వైసీపీ ప్లాన్ ఏ. ఇపుడు ప్లాన్ బీ అని జగన్ ఏకంగా తానే మీడియా ముందు ప్రకటించిన మావిగాన్ ప్రతిపాదన తప్పు అని చెప్పి విజయసాయిరెడ్డి సంచలనం రేపారు. అయితే దీని ప్రకారం ప్లాన్ ఏ ప్రతిపాదన కూడా తప్పు అయి ఉంటుందిగా అని నెటిజన్లు అంటున్నారు. పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ స్టాండ్ ని నాడు వినిపించిన విజయసాయిరెడ్డి ఇపుడు మాత్రం వాస్తవాలు మాట్లాడుతున్నారు అంటున్నారు. దాంతో వైసీపీ తప్పులు ఎత్తి చూపేందుకు సైతం ఆయన వెనకాడడం లేదని అంటున్నారు.

వైసీపీకి ఇబ్బంది :

మూడు రాజధానులు అంటూ ఒకనాడు మురిసిపోయిన వైసీపీ ఇపుడు మావిగాన్ అని కలవరిస్తోంది. అది వైసీపీకి మానసపుత్రిక గా మారింది. దాంతో వైసీపీ మావిగాన్ అన్నది కూటమిని సరైన కౌంటర్ గా భావిస్తున్న నేపథ్యం ఉంది. సరిగ్గా ఈ సమయంలో విజయసాయిరెడ్డి ఆ ప్రతిపాదనే తప్పు అని చెప్పుకొచ్చారు. దాంతో వైసీపీకి రాజకీయంగా ఇది ఇబ్బందిగానే ఉంటుందని అంటున్నారు. అమరావతి విషయంలో ఈ రోజుకీ ఒక స్పష్టమైన విధానం వైసీపీ తీసుకోలేకపోతోంది అన్నది చాలా మంది నుంచి వస్తున్న విమర్శ. ఇపుడు విజయసాయిరెడ్డి సైతం మావిగాన్ నమూనా సరికాదు అని చెప్పడం ద్వారా వైసీపీ గాలి తీసేశారు అని అంటున్నారు.

దూరమైన హితుడుగా :

మాజీ వైసీపీ నేత ఈ విధంగా విశ్లేషిస్తే జన సామాన్యంలో మావిగాన్ మీద అభిప్రాయం ఇంతకంటే వేరేగా ఉండే చాన్స్ లేదని అంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ రాజధాని విషయంలో తన ఆలోచనలు మార్చుకుంటేనే మేలు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే పార్టీ పరంగా వైసీపీ చేస్తున్న తప్పులను కోటరీ అతి విన్యాసాలను కూడా విజయసాయిరెడ్డి ఎండగడుతున్నారు. వైసీపీకి రాజకీయ వ్యూహాలు అధికారంలోకి వచ్చేందుకు అవసరం అయిన ప్రణాళికలు లేవని కూడా గతంలో చెప్పారు. కూటమి కలిసికట్టుగా ఉంటే వైసీపీ గెలవడం కష్టమని ఆయన చెబుతూ వచ్చారు. మొత్తానికి విజయసాయిరెడ్డిని దూరమైన హితుడుగా భావించి వైసీపీ తప్పులు దిద్దుకుంటే మంచిదే అని అంటున్నారు.