Begin typing your search above and press return to search.

వైసీపీలో అనూహ్య పరిణామాలు.. విజయసాయి రీఎంట్రీపై విస్తృత ప్రచారం!

విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలో చేరనున్నారనే ప్రచారం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఈ ప్రచారాన్ని అటు విజయసాయిరెడ్డి కానీ, ఇటు వైసీపీ అధిష్టానం కానీ ఖండించలేదు.

By:  Tupaki Political Desk   |   5 Aug 2026 9:40 AM IST
వైసీపీలో అనూహ్య పరిణామాలు.. విజయసాయి రీఎంట్రీపై విస్తృత ప్రచారం!
X

వైసీపీలో అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకప్పుడు పార్టీలో నెంబరు 2గా ఉంటూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజీనామా చేసిన మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పార్టీలోకి మళ్లీ వస్తారంటూ రెండు రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. విజయసాయి నిష్క్రమణ తర్వాత ఢిల్లీ స్థాయిలో పార్టీ వ్యవహారాలను నడపడం క్లిష్టంగా మారిందని అంటున్నారు. దీంతో మాజీ ఎంపీని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చి ఢిల్లీ వ్యవహారాలను అప్పగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.

విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలో చేరనున్నారనే ప్రచారం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఈ ప్రచారాన్ని అటు విజయసాయిరెడ్డి కానీ, ఇటు వైసీపీ అధిష్టానం కానీ ఖండించలేదు. దీంతో మాజీ ఎంపీ తిరిగి పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నం ఎక్కడి నుంచి మళ్లీ మొదలైంది అన్న విషయంపై స్పష్టత లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో తన మాటకు విలువ నివ్వడం లేదని, అధినేత జగన్ కు తనకు మధ్య బలమైన కోటరీ అడ్డుగా నిలుస్తోందని ఆరోపిస్తూ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. అంతేకాకుండా రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత పార్టీలో పరిణామాల పట్ల, జాతీయ రాజకీయ వ్యవహారాలపై సోషల్ మీడియా వేదికగానే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

కొన్నిసార్లు అధినేత జగన్ వ్యవహారశైలిని తప్పుబడుతూ విజయసాయిరెడ్డి ట్వీట్లు చేసినా, అదంతా అభిమానంతో చేసిన కామెంట్లుగానే వైసీపీ నాయకులు భావిస్తున్నారని అంటున్నారు. పార్టీలో లోపాలను సరిదిద్దుకోవాలని విజయసాయిరెడ్డి చేసిన సూచనలుగానే పరిగణిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయసాయిరెడ్డి మళ్లీ పార్టీలో చేర్చుకోవాలనే అధిష్టానం భావించడానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఇందుకు విజయసాయిరెడ్డి సమర్థత కూడా ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు.

పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత జగన్ పక్కనే ఉంటూ వచ్చిన విజయసాయిరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పార్టీని పటిష్ట పరిచారని, అదే సమయంలో ఢిల్లీలో తనకున్న పరిచయాలతో బీజేపీతో సత్సంబంధాలు ఏర్పడేలా చక్రం తిప్పారని గుర్తు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత ఈ పని సరిగా సాగడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి నలుగురు లోక్ సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నప్పటికీ వారు కేంద్రంతో బలమైన రాజకీయ సంబంధాలు నెరపడంలో అంతగా ఫలితాలు సాధించలేకపోతున్నారని అధినేత జగన్ భావిస్తున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో గతంలో విజయసాయిరెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకుని, ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అధినేత తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కూడా అధినేత అవసరాన్ని గుర్తించి తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సముఖత వ్యక్తం చేశారని అంటున్నారు. దీంతో పార్టీలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయని చెబుతున్నారు. అధినేత, విజయసాయిరెడ్డి మధ్య పెద్దగా వివాదం ఏదీ లేకపోవడం, పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత విజయసాయిరెడ్డి ఏ పార్టీలో చేరకపోవడం వల్ల ఆయనను తిరిగి చేర్చుకోవడంపై పెద్దగా అభ్యంతరాలు లేవని అంటున్నారు. ప్రధానంగా పార్టీకి విజయసాయిరెడ్డి అవసరం ఎక్కువగా ఉండటం కూడా ఆయన పునరాగమనానికి ప్రాధాన్యం ఏర్పడిందని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఇరువర్గాల మధ్య సమాలోచనలు మాత్రమే జరుగుతున్నాయని, తుది నిర్ణయం జరగడానికి మరికొంత సమయం పడుతుందని భావిస్తున్నారు.