Begin typing your search above and press return to search.

జగన్ మీద తొలిసారి గన్ ఎక్కుపెట్టిన విజయసాయి

విజయసాయిరెడ్డి అంటే వైసీపీలో నెంబర్ టూ అనే అంటారు. ఆయన ఆ పార్టీని వీడి 20 నెలలు అవుతున్నా కూడా ఆయనను వైసీపీ నాయకుడుగా చూస్తారు.

By:  Satya P   |   24 Aug 2026 10:35 PM IST
జగన్ మీద తొలిసారి గన్ ఎక్కుపెట్టిన విజయసాయి
X

విజయసాయిరెడ్డి అంటే వైసీపీలో నెంబర్ టూ అనే అంటారు. ఆయన ఆ పార్టీని వీడి 20 నెలలు అవుతున్నా కూడా ఆయనను వైసీపీ నాయకుడుగా చూస్తారు. అంతే కాదు జగన్ నీడగా సైతం భావిస్తారు. అయితే విజయసాయిరెడ్డి వైసీపీ మాజీ లీడర్ అనిపించుకోవడానికి ఈ మధ్య కాలంలో చాలానే చేశారు. ఎన్నో సార్లు విమర్శలు వైసీపీ మీద చేశారు, జగన్ కోటరీ మీద చేశారు, కానీ తొలిసారి జగన్ మీద నేరుగానే హాట్ కామెంట్స్ చేశారు. అవి కూడా తూటాలా పేలేలాంటి కామెంట్స్ చేశారు. జగన్ రాజకీయం మీద గట్టి దెబ్బ తీసేలా ఈ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. ఇప్పటివరకూ జగన్ రాజకీయ ప్రత్యర్ధులు ఎవరూ చేయని విధంగా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ జనంలోకి ఏ విధంగా వెళ్తాయో తెలియదు కానీ జగన్ ని ఇక మీదట స్ట్రాంగ్ గానే ఎదుర్కోవడానికి విజయసాయిరెడ్డి సిద్ధపడ్డారని అంటున్నారు. దానికి ఆరంభంగా ఆయన జగన్ క్రిస్టియన్ మత ఆరాధకుడు కాబట్టి ఆయనను హిందూ ద్వేషిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అని అంటున్నారు.

మత మార్పిడులను ప్రోత్సహించారు :

జగన్ మత మార్పిడులను ప్రోత్సహించారు అన్నది మామూలు విమర్శ కాదు, వైసీపీ కూసాలను కదిలించే విమర్శ. ఏపీలో అత్యధిక సంఖ్యలో హిందువులు ఉన్నారు, వారి మీద ప్రభావం చూపించేలా విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగానే ఈ విమర్శలు చేశారా అన్న చర్చ వస్తోంది. అంతే కాదు జగన్ హయాంలో వందల చర్చుల నిర్మాణానికి సహకరించారని లెక్కలతో సహా వివరించారు. అదే సమయంలో జగన్ ఏరోజూ హిందూ మతాన్ని ప్రోత్సహించలేదని అంటూ ఆయనని ఒక బలమైన వర్గానికి దూరం చేసే ప్రయత్నం చేసినట్లుగా విజయసాయిరెడ్డి కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు.

ఎదురు నిలిచి మరీ :

జగన్ నీడ లాంటి విజయసాయిరెడ్డి ఇపుడు ఎదురు నిలిచారు. ఆయన బీజేపీలో చేరి ఉంటే బీజేపీ నేతగా ఆ పార్టీ ఫిలాసఫీని ఈ విధంగా మాట్లాడితే దానికి అంత విలువ ఉండకపోవచ్చు. లేదా జగన్ ప్రయ్తర్ధి పార్టీలలో చేరినా కూడా ఆయన విమర్శలు రొటీన్ గా తీసుకునే అవకాశం ఉంది. కానీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీని స్థాపించాలని అనుకుంటున్నారు. దాంతో ఆయన విమర్శలకు పదును ఎక్కువ ఉంటుందని అంటున్నారు. పైగా ఆయన జగన్ తోనే సుదీర్ఘ కాలం ఉంటూ వచ్చారు. వైసీపీ పునాదుల నుంచి ఉన్న నాయకుడిగా విజయసాయిరెడ్డి మాటలను ఎంతో కొంత విశ్వసించే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు.

కట్టడి చేసే వ్యూహంతో :

వైసీపీని కట్టడి చేసే వ్యూహంతోనే విజయసాయిరెడ్డి ఈ విధంగా మతాన్ని ఎంచుకుని మరీ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారా అని చర్చ సాగుతోంది. ఒక వర్గాన్ని వైసీపీకి దూరం చేయాలన్న ఆలోచన కూడా అందులో ఉందా అని రాజకీయ విశ్లేషకులు తర్కిస్తున్నారు. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలను వైసీపీ ఖండిస్తుందో లేదా మౌనంగా చూస్తూ ఉంటుందో తెలియదు కానీ ఆయన ఇది ఆరంభం అంటూనే జగన్ మీద గట్టిగానే టార్గెట్ చేశారు. ఇపుడు విజయసాయిరెడ్డి మీద వైసీపీ విమర్శిస్తే ఆయన ఆరోపణలకు విలువ ఇచ్చినట్లు అవుతుంది. అపుడు ఆయన మరింతగా దూకుడు చేసే అవకాశాలు ఉంటాయి.

జగన్ మీద ధర్మాగ్రహమా :

అలా కాకుండా చూసీ చూడనట్లుగా వదిలేస్తే ఆయన వ్యాఖ్యలు ఏ మేరకు వైసీపీని డ్యామేజ్ చేస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. మొత్తానికి నంబర్ టూ గా నిన్నటి దాకా ఉన్న విజయసాయిరెడ్డిది వైసీపీ మీద జగన్ మీద ధర్మాగ్రహమా లేక ధర్మ పోరాటమా లేక తన రాజకీయ ఆరాటమా తెలియదు కానీ ఆయన కొత్త పార్టీ గురి మాత్రం కచ్చితంగా వైసీపీ మీదనే ఉండబోతోంది అన్నది ఆయన తాజా ఘాటు వ్యాఖ్యలతో స్పష్టం అయింది అని అంటున్నారు.జస్ట్ టీజర్ ని మాత్రమే విజయసాయిరెడ్డి వదిలారు, ముందు ముందు సినిమా చూపిస్తే ఎలా ఉంటుందో వైసీపీకి ఆ వేడి ఏ విధంగా కాక పుట్టిస్తుందో చూడాలి మరి .