ట్రంప్ కు సాయిరెడ్డి ఏసేశాడు.. బాగా ఏసేశాడు..
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ కీలక నేతగా, ఎంపీగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెప్పినా, సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో మాత్రం ఇంకా చురుగ్గా కొనసాగుతున్నారు.
By: A.N.Kumar | 11 Aug 2025 6:28 PM ISTఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ కీలక నేతగా, ఎంపీగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెప్పినా, సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో మాత్రం ఇంకా చురుగ్గా కొనసాగుతున్నారు. తరచుగా జాతీయ, అంతర్జాతీయ అంశాలపై స్పందిస్తూ, ప్రభుత్వాల నిర్ణయాలపై సూటిగా కామెంట్లు చేస్తూ ఉంటారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
ఇటీవల పాకిస్తాన్ ‘ఆపరేషన్ సిందూర్’లో భారత్‌పై గెలిచామని ప్రకటించుకోవడానికి, తమ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోట్ చేసింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మునీర్, భారత్‌పై అణు దాడి హెచ్చరికలు జారీ చేయడం, “భారత్ మాత్రమే కాదు, సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం” అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఇదిలా ఉండగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు 50% ఆంక్షలు విధించిన ట్రంప్, భవిష్యత్తులో పాకిస్తాన్ నుంచి కూడా చమురు కొనవచ్చని సంకేతాలు ఇవ్వడం, అలాగే పాక్‌తో చమురు ఒప్పందం కుదుర్చుకోవడం, భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ను బలోపేతం చేసే ప్రయత్నంగా భావిస్తున్నారు. అంతేకాక, ట్రంప్ ఇప్పటికే రెండోసారి మునీర్‌ను పిలిపించి సమావేశాలు జరిపిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఎక్స్‌లో చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నిర్లక్ష్యమైన అణు బెదిరింపులు ఆ దేశాన్ని ఎందుకు నిరాయుధీకరించాలో రుజువు చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తుపాకీ పట్టుకున్న కోతి లాంటి ఈ పరిస్థితి ప్రమాదకరమని, ఊహించలేనిదని అన్నారు. ట్రంప్ నిజంగా నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నిస్తుంటే, పాకిస్తాన్‌ను అణ్వాయుధాల నుండి విముక్తి చేయించాలని సలహా ఇచ్చారు. అలా చేస్తే భారతదేశం సంతోషంగా ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్ చేస్తుందని అన్నారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాక్ అణు ఆయుధాల భయం, అంతర్జాతీయ శాంతి పరిస్థితులపై ఆయన చేసిన పోలికలు, ట్రంప్‌పై విసిరిన వ్యంగ్య బాణాలు నెటిజన్లలో చర్చకు దారి తీశాయి.
