కొత్తగా అంటూ ఊరిస్తున్న విజయసాయి !
కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా ఊరిస్తున్నారు వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. కొత్త పార్టీ పెడుతున్నాను అని ఆయన చాలా రోజులుగా ప్రకటనలు ఇస్తున్నారు
By: Satya P | 18 Sept 2026 3:00 PM ISTకొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా ఊరిస్తున్నారు వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. కొత్త పార్టీ పెడుతున్నాను అని ఆయన చాలా రోజులుగా ప్రకటనలు ఇస్తున్నారు. దివ్యమైన శ్రావణ మాసంలో మన పార్టీ అని చెప్పారు, తీరా శ్రావణ మాసం కూడా వెళ్ళిపోయింది. ఇపుడు భాద్రపద మాసం శూన్యం కాబట్టి ఆశ్వియుజ మాసం అని అంటున్నారు. సరే అక్టోబర్ నే ఖాయం చేసుకుంటే మరో నెల్లాళ్ళలో కొత్త పార్టీతో విజయసాయిరెడ్డి వస్తున్నట్లే అనుకోవాలి. రాజకీయాలు వద్దు అనేసిన ఆయన తూచ్ అంటూ మళ్ళీ కొత్తగా పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా వైసీపీని ఫోకస్ చేస్తున్నా కాస్తా బాలెన్స్ చేస్తున్నట్లుగా టీడీపీని కూడా మధ్యలో కలుపుతున్నారు.
లోకేష్ సీఎం అంటూ :
ఏపీలో ఏ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం అని ఆయన మహా కవి శ్రీశ్రీ గీతాన్ని పేరడిగా అందుకున్నారు. అటు వైసీపీ ఇటు టీడీపీ దొందుకు దొందే అంటున్నారు. 2029లో టీడీపీ గెలిస్తే లోకేష్ సీఎం అని ఖాయం చేసేశారు ఈ మాజీ ఎంపీ. ఇక వైసీపీ గెలిస్తే జగన్ సీఎం అన్నది వేరేగా చెప్పాల్సింది లేదు. ఆ రెండు పార్టీలే ఆ పార్టీల అధినాయకత్వాలే బాగుపడుతున్నాయి కానీ ప్రజలకు ఏమి ఒరిగింది అని ఆయన గట్టిగానే మాట్లాడుతున్నారు. వినేందుకు చర్చించేందుకు కూడా ఈ మాటలు బాగానే ఉన్నాయి. కానీ ఇవే మాటలు విజయసాయిరెడ్డి దశాబ్దం పైగా వైసీపీలో ఉన్నపుడు ఎందుకు గుర్తుకు తెచ్చుకోలేదనే నెటిజన్లు అంటున్నారు.
యువత సీఎం కావాలి :
ఇది కూడా బాగానే ఉంది. యువత ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాలని విజయసాయిరెడ్డి బలంగా కోరుకుంటున్నారు. తాను పెట్టబోయే పార్టీలో ఆ చాన్స్ ఇస్తామని కూడా నమ్మకంగా చెబుతున్నారు. కానీ ఇంతకీ ఏపీలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి స్కోప్ స్పేస్ ఎంతవరకూ ఉంది అనేది కదా పెద్ద ప్రశ్న అంటున్నారు. పార్టీ పెడతాను అంటూనే ఆయన చాలా కాలంగా ప్రకటనలు ఇస్తున్నారు అని కూడా అంటున్నారు. తీరా పార్టీ పెట్టినా కూడా ఏపీలో అది నెట్టుకుని వచ్చి ఫోర్ ఫ్రంట్ లో ఉండేది ఎట్లా అన్నది రాజకీయ విశ్లేషకుల సందేహం. మరి విజయసాయి రెడ్డికి కూడా ఈ విషయం మీద అవగాహన ఉండదా అని అంటున్నారు.
ఆలోచన మంచిదే కానీ :
ఏ రాజకీయ పార్టీ సిధ్దాంతాలు బాగా లేవు చెప్పండి. అన్నీ మంచివే. అయితే ఆచరణలోనే తప్పటడుగులు పడుతున్నాయి. విజయసాయిరెడ్డి కూడా మంచి సిద్ధాంతాలే వల్లిస్తున్నారు. నా పార్టీలో నేను సీఎం క్యాండిడేట్ ని కాను అంటున్నారు. యూత్ కి చాన్స్ అని ఊరిస్తున్నారు. బీసీలు బడుగులకు సీఎం కుర్చీ ఎక్కే సీన్ లేదా అని ఎలుగెత్తి ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయన మామూలు జనంలా మాట్లాడుతున్నారా అన్నదే ఇక్కడ అందరికీ కలిగే సందేహం. ఏపీలో రాజకీయం ఎట్టా నడుస్తుందో ఆయనకు తెలియదా అని అంటున్నారు. టీడీపీ వైసీపీ చెరి నలభై శాతం ఓటు షేర్ తో బలంగా ఉన్న నేపధ్యం, మధ్యలో జనసేన కూడా ఉంది. ఇక ఇతర పార్టీలు బోలెడు ఉన్నాయి. ఇక విజయసాయిరెడ్డి కొత్త పార్టీ వచ్చి ఎక్కడ ఎవరి స్పేస్ ని తీసుకుంటుంది, ఏ మేరకు రాణిస్తుంది అన్నదే పెద్ద డౌట్. మొత్తానికి పార్టీ పెడతాను అని ప్రకటనలు ఇస్తూ వస్తున్నా పెద్దాయన ఎపుడు పని చేస్తారా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు.
