Begin typing your search above and press return to search.

విజయసాయిరెడ్డి పార్టీకి ఎన్నికల కోడ్? నెల రోజుల వాయిదా వేసిన మాజీ ఎంపీ!

కొత్త రాజకీయ పెడతానంటూ కొంతకాలంగా చెబుతున్న మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆ సమయం ఆసన్నమైందనే సంకేతాలిచ్చారు.

By:  Tupaki Political Desk   |   12 Oct 2026 2:35 PM IST
విజయసాయిరెడ్డి పార్టీకి ఎన్నికల కోడ్? నెల రోజుల వాయిదా వేసిన మాజీ ఎంపీ!
X

కొత్త రాజకీయ పెడతానంటూ కొంతకాలంగా చెబుతున్న మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆ సమయం ఆసన్నమైందనే సంకేతాలిచ్చారు. స్థానిక ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పార్టీ ఆవిర్భావ దినోత్సవ తేదీని ప్రకటిస్తానని ఎక్స్ లో విజయసాయిరెడ్డి వెల్లడించారు. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం కొద్దికాలం రాజకీయ సన్యాసం అంటూ చెప్పిన విజయసాయరెడ్డి అనంతరం మనసు మార్చుకుని కొత్త పార్టీతో రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే. పార్టీ ఏర్పాటుకు ముందు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పి, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిల్లో పర్యటించి తన పార్టీ అజెండా ఎలా ఉండబోతోందో అన్న విషయమై సంకేతాలిచ్చారు.

ఇక పార్టీ పెడతానంటూ చెబుతూ వస్తున్న విజయసాయిరెడ్డి పార్టీ పేరుపై సస్పెన్స్ కొనసాగిస్తూ వస్తున్నారు. దాదాపు ఏడాదిగా ఆయన పార్టీ పేరుపై రకరకాల ఊహాగానాలే షికారు చేస్తున్నాయి. కానీ, విజయసాయిరెడ్డి తరఫున ఎలాంటి లీకులు రాలేదు. అయితే హిందుత్వ అజెండాను సమర్థించేలా ఆయన పార్టీ విధివిధానాలు ఉండనున్నాయని ఇటీవల ఆయన చేసిన కామెంట్లు బట్టి అర్థమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా బీజేపీకి అనుబంధంగా పనిచేయడానికి విజయసాయిరెడ్డి మొగ్గు చూపుతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ ప్రకటన ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తుండగా, స్థానిక ఎన్నికల కోడ్ అయిపోగానే అంటూ తాజాగా ప్రకటించి సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారని అంటున్నారు.

ఎందుకింత సస్పెన్స్?

కొత్త పార్టీ అంటూ విజయసాయిరెడ్డి ప్రకటించి దాదాపు ఏడాది అవుతున్నా, ఆయన పార్టీ పేరు ఇంతవరకు ప్రకటించకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకీ విజయసాయిరెడ్డి పార్టీ ప్రకటన ఉంటుందా? లేక ఆ పేరుతో తన మాజీ బాస్ జగన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసే కార్యక్రమానికి మాత్రమే పరిమితమవుతారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ స్థాపిస్తానని చెబుతున్న విజయసాయిరెడ్డి ఇంతవరకు ఒంటి పోరాటం మాత్రమే చేయడం, ఆయనతో ఎవరూ కలవకపోవడం, లేదా ఆయన తనతో ఎవరినీ కలుపుకుని వెళ్లకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా పార్టీ పెట్టే ఆలోచన ఉంటే ఇంత జాప్యం చేయరని, తనకు మద్దతుగా మరికొందరిని కలుపుకుని ఉండేవారని అంటున్నారు. ఇక ఇప్పుడు పార్టీ ప్రకటనకు ఎన్నికల కోడ్ తో ముడిపెట్టడంపై కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల కోడ్ అడ్డంకా?

పార్టీ ఆవిర్భావ దినోత్సవం తేదీని ప్రకటనపై తాజాగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. రేపటి నుంచి వారం రోజుల పాటు ఆయుర్వేద చికిత్స నిమిత్తం వెళుతున్నానని, స్థానికసంస్థల ఎన్నికల కోడ్ తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవ తేదీని ప్రకటిస్తానని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అయితే విజయసాయిరెడ్డి పార్టీ ప్రకటనకు ఎన్నికల కోడ్ ఏమీ అడ్డంకి కాదని, కానీ ఆ కారణం చూపి మరో నెల రోజుల పాటు పార్టీని వాయిదా వేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎవరైనా పార్టీ పెట్టడానికి ఎన్నికల ముందే తగిన సమయంగా భావిస్తారని, విజయసాయిరెడ్డి మాత్రం ఎన్నికల తర్వాత అంటూ మంచి సమయాన్ని మిస్ అయ్యారని అంటున్నారు.