జగన్ ముందు దుర్మార్గుడిగా చేశారు !
వైసీపీలో ఒకనాడు నంబర్ టూ గా ఉంటూ అన్నీ తానై నడిపించారు అన్న పేరు తెచ్చుకున్నారు మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత వి విజయసాయిరెడ్డి.
By: Satya P | 30 Sept 2026 10:03 PM ISTవైసీపీలో ఒకనాడు నంబర్ టూ గా ఉంటూ అన్నీ తానై నడిపించారు అన్న పేరు తెచ్చుకున్నారు మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత వి విజయసాయిరెడ్డి. ఆయన ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం వైసీపీ నుంచే మొదలైంది. ఆయన వైసీపీ పునాదుల నుంచి ఉన్నారు. జగన్ కి ఆంతరంగికుడిగా వైసీపీలో ముఖ్య భూమిక పోషించారు. వైసీపీలో జగన్ తరువాత విజయసాయిరెడ్డి అనేంతగా ఎదిగారు. అలాంటి విజయసాయిరెడ్డి వైసీపీని వీడుతారు అని ఎవరూ అనుకోలేదు, అయితే ఆయన ఇపుడు నేరుగా తన విమర్శల బాణాలను మాజీ అధినేత జగన్ మీద ఎక్కుపెడుతున్నారు. వైఎస్సార్ కుటుంబంతో మూడు తరాలుగా అనుబంధం పెనవేసుకున్న విజయసాయిరెడ్డికి జగన్ తో బంధం తెగిపోవడం మాత్రం ఎంత రాజకీయం అని అనుకున్నా ఈ రోజుకీ ఆశ్చర్యకరమే అంటారు. అలాంటిది విజయసాయిరెడ్డికి అది ఎప్పటికీ జీర్ణించుకోలేని విషయమే అవుతోందని అంటున్నారు.
అధికారంలోకి వచ్చాక :
తాను వైసీపీలో ముఖ్య పాత్ర పోషించిన సంగతి వాస్తవమే అని విజయసాయిరెడ్డి తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే 2019 నుంచి 2024 మధ్యలో మాత్రం తన పాత్ర ఏదీ లేదని అన్నారు. సీఎంఓకి తాను ఎంతో దూరంగా ఉన్నాను అని ఆయన చెప్పారు. తాను ఢిల్లీలో పార్టీ తరఫున వ్యవహారాలను చూసేవాడిని అని అంతకు మించి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం వెనక తాను లేనని తనకు ఏమీ తెలియదని చెప్పారు. తనను ఒక పధకం ప్రకారం వైసీపీలో కొంత మంది దూరం చేశారు అని అన్నారు. ఉత్తరాంధ్రాలో తన వియ్యంకుడి కుటుంబానికి భూములు ఉంటే అవి తన భూములు అని తప్పుడు ప్రచారం చేశారు అని ఆయన ఆరోపించారు. ఈ రోజున ఉత్తరాంధ్రాలో వారికి తొమ్మిది ప్రాంతాలలో భూములు ఉన్నాయని, వారి వ్యాపార విస్తరణ కోసం భూములను కొనుగోలు చేయడం సహజం అని అన్నారు. తనకు విశాఖలో ఒక ఫ్లాట్ తప్ప మరేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
విలన్ గా చేశారు :
తనను జగన్ ముందు విలన్ గా చేశారని ఆయన చెప్పారు. ఈ విషయంలో జగన్ కోటరీలో అతి ముఖ్యుడిగా ఉన్న సజ్జల రామక్రిష్ణారెడ్డితో పాటు ఉత్తరాంధ్రాకు చెందిన ఒక బడా నేత ముఖ్య పాత్ర పోషించారు అని అన్నారు. జగన్ ని వారు ఆ విధంగా నమ్మించగలిగారు అని ఆయన అంటున్నారు. తాను వైసీపీ నుంచి వేరు పడడానికి వారే కారణం అన్నారు. తాను వైసీపీలో ఉన్నపుడు రోజుకు పన్నెడు గంటలు కష్టపడి పనిచేసి పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశాను అని ఆయన చెప్పారు. అయితే తనను దూరం చేసుకున్న తరువాత పార్టీ కష్టాలలో ఉందని ఆయన అన్నారు వైసీపీలో లిక్కర్ స్కాం విషయంలో రాజ్ కసిరెడ్డిదే ముఖ్య పాత్ర అని మరోసారి ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయాన్ని తాను సిట్ ముందు కూడా చెప్పాను అని గుర్తు చేశారు.
క్రైస్తవంలో కులం లేదు :
దేశంలో ఎక్కడైనా క్రైస్తవంలో మారిన వారు తమ కులం పేరు తగిలించుకోవడం లేదని విజయసాయిరెడ్డి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే ఆ విధంగా కులం తోకలతో మతం మారినా రాజకీయం కోసమే చేస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి క్రిస్టియన్లుగా రెడ్డి కమ్మలుగా చలామణీ అవుతున్నారని ఆయన విమర్శించారు. వీరిది రాజకీయ స్వార్ధం అని జనాలు దీనిని గుర్తించాలని ఆయన కోరారు. . మొత్తానికి జగన్ దృష్టిలో తనను విలన్ ని చేశారు అంటూ విజయసాయిరెడ్డి లేటెస్ట్ గా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
