Begin typing your search above and press return to search.

హార్డ్ కోర్ హిందూత్వ...విజయసాయి ప్రయోగం ?

ఏపీ అన్నది ఉమ్మడి మద్రాస్ రాష్ట్రాలతో కలసి దశాబ్దాలుగా ఉంటూ తరువాత కాలంలో విడివడిపోయింది.

By:  Satya P   |   25 Aug 2026 6:00 AM IST
హార్డ్ కోర్ హిందూత్వ...విజయసాయి ప్రయోగం ?
X

ఏపీ అన్నది ఉమ్మడి మద్రాస్ రాష్ట్రాలతో కలసి దశాబ్దాలుగా ఉంటూ తరువాత కాలంలో విడివడిపోయింది. దాంతో ద్రవిడ ఉద్యమ ప్రభావం కానీ లౌకిక భావనలు వామపక్ష సిద్ధాంతాల ప్రేరణలు కానీ ఏపీలో ఎక్కువ. అందుకే ఏపీలో మొదట్లో కమ్యూనిస్టులు ఎక్కువగా సీట్లు గెలుచుకునే వారు. వారే టీడీపీ ఏర్పడేదాకా కాంగ్రెస్ కి ప్రతిపక్షంగా వ్యవహరించేవారు. టీడీపీ వచ్చినా తరువాత కాలంలో వైసీపీ ఏర్పాటు అయినా సెక్యులర్ పోకడలకే జనం మద్దతు ఇస్తూ వచ్చారు. దేశమంతా బీజేపీ ఎదిగింది. ఆఖరికి కమ్యూనిస్టుల కంచు కోట అయిన పశ్చిమ బెంగాల్ లో కూడా కాషాయ జెండా ఎగిరింది. కానీ ఏపీలో మాత్రం కాషాయ పతాక ఈ రోజుకీ సతమతమవుతూనే ఉంది. దానికి కారణం ఏపీలో హార్డ్ కోర్ హిందూత్వ భావజాలానికి పెద్దగా చోటు లేకపోవడమే.

విజయసాయి వ్యూహం :

విజయసాయిరెడ్డి అనివార్యంగా కొత్త పార్టీ పెడుతున్నారు. తన రాజకీయ జీవితానికి కొనసాగింపుగా ఆయన తనదైన భూమికను చూసుకోనున్నారు. ఆయన బీజేపీలో చేరుతారు అని వినిపించినా అది జరగలేదు. దాంతో ఆయన సొంత పార్టీ వైపే మొగ్గు చూపించారు. ఇక తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ బట్టి చూస్తే ఆయన వీర హిందూత్వ సిద్ధాంతాల వైపు మొగ్గు చూపిస్తున్నట్లుగా అర్ధం అవుతోంది. కాకినాడలో పంచాయతీ రాజ్ ఏఐ కుటుంబం సామూహిక ఆత్మహత్య వెనక లవ్ జీహాదీ ఉందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో అధికార టీడీపీ విపక్ష వైసీపీలని ఆయన విమర్శించారు. హిందూ నినాదాన్ని ఆయన అన్యాపదేశంగా వినిపించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే వైసీపీ టీడీపీ నోరెత్తడం లేదని కూడా విమర్శించారు.

ఎంచుకున్నట్లేనా :

దీనిని బట్టి చూస్తే ఆయన హిందూత్వ సిద్ధాంత భూమికతో కొత్త పార్టీని ఏపీలో ఏర్పాటు చేస్తారా అన్న చర్చ సాగుతోంది. ఎమోషనల్ గా ఉండే ఈ ఫిలాసఫీ పండితే ఆయన పార్టీకి తిరుగు ఉండదని భావిస్తున్నారా అని కూడా ఆలోచిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకి అయినా నాయకుడి ఇమేజ్ ఉండాలి, అలాగే సిద్ధాంతాల సారం ఉండాలి. విజయసాయిరెడ్డి ఈ విషయంలో పొలిటికల్ గ్లామర్ ని నమ్ముకోకుండా పూర్తిగా ఎమోషనల్ ఫిలాసఫీ పైనే ఆధారపడుతున్నారు అని అంటున్నారు. అందుకే ఉత్తరాదిన దేశంలో చాలా రాష్ట్రాలలో బీజేపీకి అచ్చి వచ్చిన హిందూత్వను ఆయన నమ్ముకున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.

వారికే వర్కౌట్ కాలేదు :

అయితే ఇక్కడ ఒక ధర్మ సందేహం వస్తోంది. బీజేపీకే కానిది విజయసాయిరెడ్డి వల్ల అవుతుందా అన్నదే ఆ సందేహం. ఏపీలో హిందూత్వకు ఆ మాత్రం మద్దతు లభిస్తే చాలు ఈపాటికి బీజేపీ అధికారంలోకి తప్పక వచ్చి ఉండేదని గుర్తు చేస్తున్నారు. మరి విజయసాయిరెడ్డి ఇదే ఫిలాసఫీని నమ్ముకుంటే కొత్త పార్టీకి ఏపీలో ఆదరణ ఏ మేరకు లభిస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా రాజకీయ పార్టీ పెట్టడం తేలిక కానీ దానిని నిర్వహించడం జనంలోకి చేరువ చేయడం బహు కష్టం అంటున్నారు. విజయసాయిరెడ్డి ఈ విషయంలో ఏమి చేస్తారో అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏపీలో కొత్త పార్టీలకు అవసరం అయిన రాజకీయ శూన్యత ఉందా లేదా అన్నది మరో కీలక ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతోంది. అది కూడా చూడాల్సి ఉంది.