జగన్ మావిగన్ మీద సాయిరెడ్డి గన్ !
వైసీపీలో ఒకనాడు ద్వితీయ స్థానంలో ఉండి అద్వితీయమైన నాయకత్వ ప్రతిభా పాటవాలు చూపించి 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి తన వంతుగా ఎంతో కృషి చేసిన విజయసాయిరెడ్డి వైసీపీకి అనూహ్యంగా దూరం అయి ఏడాదిన్నరకు పైగా అవుతోంది.
By: Satya P | 4 July 2026 7:01 AM ISTవైసీపీలో ఒకనాడు ద్వితీయ స్థానంలో ఉండి అద్వితీయమైన నాయకత్వ ప్రతిభా పాటవాలు చూపించి 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి తన వంతుగా ఎంతో కృషి చేసిన విజయసాయిరెడ్డి వైసీపీకి అనూహ్యంగా దూరం అయి ఏడాదిన్నరకు పైగా అవుతోంది. ఈ క్రమంలో ఆయన వివిధ సందర్భాలలో వైసీపీ అధినాయకత్వం నిర్ణయాల మీద తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. వైసీపీకి ఉన్న వ్యూహాల లేమిని కూడా ఆయన ఎండగడుతున్నారు. 2029 లో కూటమి జట్టుగా ఉంటే వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది అని కూడా ఆ మధ్య జోస్యం చెప్పిన విజయసాయిరెడ్డి ఇపుడు జగన్ మావిగన్ మీద సెటైరికల్ గా బాణం వేసి సంచలనానికి తెర లేపారు.
ఇంకా రాజధాని రచ్చేనా :
ఉమ్మడి ఏపీ విడిపోయి ఇప్పటికి 12 ఏళ్ళు, 2029 ఎన్నికలకు కూడా రాజధానిని అజెండాగా చేసుకుని ఎన్నికలకు పోతామని జగన్ ఇటీవల ఇచ్చిన స్టేట్మెంట్ ని విజయసాయిరెడ్డి పూర్తిగా తప్పుపట్టారు. జగన్ మావిగన్ కావాలో అమరావతి కావాలో 2029 లో జనాలు తీర్పు ఇస్తారు అంటూ మావిగన్ ని ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని కూడా గంభీరంగా ప్రకటించిన క్రమంలో దాని గాలిని తీసేసేలా విజయసాయిరెడ్డి కౌంటర్ వేశారు. రాజధాని మీద పదిహేనేళ్ళకు పైగా వివాదాన్ని అలా ఉంచడం ఇప్పటికీ ఎంచుకోలేకపోవడం మీద కూడా హాట్ కామెంట్స్ చేశారు. రాజధాని మీద పొలిటికల్ ఫుట్ బాల్ ని ఇకనైనా ఆపేయమని కూడా విజయసాయిరెడ్డి కోరుకున్నారు అంటే జగన్ కి మావిగన్ కి ఆయన గట్టిగానే రిటార్ట్ ఇచ్చారు అని అంటున్నారు.
అమరావతి అవినీతి :
అమరావతి రాజధాని మీద కూడా విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేవతల రాజధాని అంటూ అసలు అమరావతికి సంబంధం లేని కొత్త ప్రదేశంలో అవినీతిని పారిస్తున్నారు అని విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వం తీరు మీద నిప్పులు చెరిగారు. ఇప్పటికి యాభై వేల కోట్ల రూపాయలు అమరావతిలో నిర్మాణాల పేరుతో ఖర్చు చేస్తున్నారు అంటే అందులో 15 నుంచి 20 శాతం పైగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆ మొత్తం 15 వేల కోట్ల పైగా ఉండొచ్చు అన్నట్లుగా వస్తున్న ఆరోపణల మీద స్పందిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. వీటి మీద తాను కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తానని కీలక ప్రకటన చేశారు.
శివరామ కృష్ణన్ కమిటీ మీద :
మరో వైపు చూస్తే ఏపీ రాజధాని విషయంలో విలువైన సూచనలు చేసిన శివరామకృష్ణన్ కమిటీ సూచనలు ఎందుకు తీసి పక్కన పెట్టారు అని ఆయన టీడీపీని నిలదీశారు. అంతే కాదు మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ ప్లాట్లు అప్పగించకపొవడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. అసలు లక్ష ఎకరాలు రాజధాని పేరుతో సేకరణ ప్రయత్నాలు ఎందుకు ఏమి చేసుకుంటారు అని కూడా ఆయన ప్రశ్నించారు.
జగన్ కి దిశానిర్దేశమా
అమరావతిలో జరుగుతున్న అవినీతి అని ఒక పక్క చెబుతూ మరో వైపు మావిగన్ అని కొత్త నినాదం ఎందుకు అని జగన్ ని విజయసాయిరెడ్డి ప్రశ్నించినట్లుగా ఉంది. మీరు పోరాటం చేయాల్సింది అమరావతి రాజధాని నిర్మాణాల పేరుతో జరుగుతున్న అవినీతి మీద కదా అని దిశా నిర్దేశం చేసినట్లుగా ఉంది. మొత్తానికి జగన్ కి కూటమి ప్రభుత్వానికి కూడా విజయసాయిరెడ్డి తనదైన విమర్శలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. వీటి అన్నింటి మీద తాను కోర్టుని ఆశ్రయిస్తాను అని విజయసాయిరెడ్డి చెప్పడం కొసమెరుపు. మరి ఆయన ఎపుడు కోర్టులో కేసు వేస్తారు, అందులో ఏ అంశాలు ఉంటాయి, వాటి వెనక ఆధారాలు ఏమిటి అన్నది అయితే ఇపుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏమి జరగనుందో.
