జగన్ చేసిన అవమానాలు...ఎప్పటికీ మరచిపోలేనివి !
అందులో ఒక అవమానం తాను ఎన్నో పదవులు నిర్వహించి వచ్చిన తరువాత ఉత్తరాంధ్రా వైసీపీకి రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించారని ఆయన చెప్పారు.
By: Satya P | 1 Oct 2026 11:57 PM ISTజగన్ తనను ఎన్నో విధాలుగా అవమానించారు అని అంటున్నారు ఒకనాటి ఆయన తోడూ నీడ అయిన వారు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఒకటా రెండా డెబ్బై నాలుగు రకాలుగా అవమానాలకు తాను గురి అయ్యాను అని ఆయన తాజాగా ఒక సోషల్ మీడియా చానల్ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. అందులో రెండు అయితే ఎప్పటికీ మరచిపోలేనివి అని ఆయన చెప్పుకొచ్చారు. ఆ రెండు అవమానాల వల్లనే తాను వైసీపీని వీడాల్సి వచ్చింది అని ఆయన చెప్పారు. ఇంతకీ ఆ రెండు అవమానాలు ఏమిటి అంటే ఆయనే విప్పి చెప్పారు. ఏళ్ళు గడచినా వాటిని అలా దాచుకున్నాను అని అంటూ వివరించారు.
ఎన్నో పదవులు నిర్వహించి :
అందులో ఒక అవమానం తాను ఎన్నో పదవులు నిర్వహించి వచ్చిన తరువాత ఉత్తరాంధ్రా వైసీపీకి రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించారని ఆయన చెప్పారు. 2024లో పార్టీ ఓటమి పాలు అయ్యాక ఈ నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు. అయితే తాను అప్పటికే వైసీపీలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా ఎన్నో పార్లమెంట్ కమిటీలకు చైర్మన్ గా ఐక్య రాజ్య సమితికి వెళ్ళిన బృందంలో కీలక నేత గా బాధ్యతలు నిర్వహించి ఉన్నాను అని చెప్పారు. అలాంటి తనను ఒక రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించి తనకు చెప్పకుండానే సజ్జల రామక్రిష్ణారెడ్డిని రాష్ట్ర కో ఆర్డినేటర్ గా చేశారు అన్నారు. ఆయన కింద తనను పనిచేయమని చెప్పడమే తనకు తీరని అవమానంగా అనిపించింది అని అన్నారు. అందుకే తాను వైసీపీని వీడడానికి మొదటి కారణం అన్నారు.
ఒక్క ముక్కతో తెంచేశారు :
అంతే కాదు 2023 డిసెంబర్ నెలలో తనకు మరో అవమానం జరిగింది అన్నారు. తాను సహజంగానే పార్లమెంటరీ పార్టీ నేతగా జగన్ ఢిల్లీ అపాయింట్మెంట్లను చూస్తూ వచ్చేవాడిని అన్నారు. అలాంటిది తాను ఇక మీదట జగన్ ఢిల్లీ అపాయింట్మెంట్లు చూడబోవడం లేదని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చూస్తారు అని ప్రధాని మోడీకి జగన్ స్వయంగా చెప్పడం తనను తీవ్రంగా బాధించింది అని ఆయన అన్నారు. తాను 2016లో రాజ్యసభకు తొలిసారి నెగ్గాను అని ఆయన అంటూ ఎనిమిదేళ్ళుగా తాను ఢిల్లీలో ఉంటూ సంపాదించుకున్న ప్రతిష్టను కేంద్ర పెద్దల వద్ద తనకు ఉన్న పలుకుబడిని ఒక్క ముక్కతో జగన్ తుంచేశారు అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇదంతా జగన్ చుట్టూ ఉన్న కోటరీతో పాటు వైసీపీ ఎంపీలు కొందరు కలసి తన మీద జగన్ కి చెప్పి చేయించారు అని ఆయన ఫైర్ అయ్యారు. దాంతోనే తాను మనసు విరిగి వైసీపీని వీడాను అన్నారు.
అవన్నీ చెప్పను :
ఇవే కాదు అని డెబ్బై నాలుగు రకాల అవమానాలు తాను వైసీపీలో భరించాను అని ఆయన అన్నారు. అయితే అవన్నీ ఇపుడు చెప్పలేను అని ఈ రెండు మాత్రం ఎక్కువగా తనను బాధించాయని ఆయన చెప్పడం విశేషం. ఇక తాను తిరిగి వైసీపీలో చేరేది లేదని అన్నారు. తను పార్టీలోకి మళ్లీ పిలిచి తీసుకునే మనస్తత్వం జగన్ కి లేదని కామెంట్స్ చేశారు. అంతే కాదు ఆత్మగౌరవం కలిగిన తాను తిరిగి వైసీపీలో చేరేది కూడా ఉండదని ఆయన స్పష్టం చేసారు. మొత్తం మీద ఎన్నో అవమానాలు వైసీపీలో జరగాయని చెబుతున్న విజయసాయిరెడ్డి అందులో మచ్చుకు రెండు వినిపించారు, మరి మిగిలిన వాటిని ఎపుడు రివీల్ చేస్తారో చూడాల్సి ఉంది. అయితే వీటి మీద వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూడాలి.
