Begin typing your search above and press return to search.

11-11-11...ఇదీ విజయసాయిరెడ్డి ముహూర్తం !

వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి విజయదశమి సందర్భంగా ఒక కీలక ప్రకటన చేశారు.

By:  Satya P   |   20 Oct 2026 6:14 PM IST
11-11-11...ఇదీ విజయసాయిరెడ్డి ముహూర్తం !
X

వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి విజయదశమి సందర్భంగా ఒక కీలక ప్రకటన చేశారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చెశారు. అందులో ఆయన ఒక ముహూర్తాన్ని కూడా నిర్ణయించి మరీ తన కొత్త పార్టీ గురించిన విషయం చెప్పారు. తన పార్టీ ఏర్పాటుకు అన్నీ కుదిరాయని విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయన ఈ సందర్భంగా పార్టీ ప్రకటన సమయం, తేదీ, వేదిక వంటి వివరాలను వెల్లడించారు. అదే సమయంలో ఆ రెండు పార్టీలు అంటూ టీడీపీ వైసీపీలను ఆయన గట్టిగానే టార్గెట్ చేశారు.

నవంబర్ 11న :

ఇదిలా ఉంటే నవంబర్ 11న విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు 11 నిముషాలకు. అంటే 11-11-11 అన్న మాట. ఇలా మ్యాజికల్ గా ముహూర్తం అయితే ఫిక్స్ అయింది. మరి తన కొత్త పార్టీ ఏపీ పాలిటిక్స్ లో అదే మ్యాజిక్ ని క్రియేట్ చేయాలన్న ఆశతోనే విజయసాయిరెడ్డి ఈ విధంగా మూడు పదకొండ్లు ఎంచుకున్నారా అన్న చర్చ వస్తోంది. నవంబర్ 11 అంటే కార్తీక మాసం, అన్నీ శుభ ఘడియలే ఉన్నాయి. దాంతో తిథి నెల, వార నక్షత్రాలను అన్నీ ఒకటికి పది సార్లు జాగ్రత్తగా చూసుకుని విజయసాయిరెడ్డి ఈ ముహూర్తాన్ని ఎంచుకున్నారు అని అర్ధం అవుతోంది. ఆయన ఇప్పటికే హిందూత్వం మీద ఎక్కువగా మాట్లాడుతున్నారు. దాంతో ఆయన సంప్రదాయ విధానంలో మంచి ఘడియలు చూసుకునే పార్టీ పేరుని ప్రకటించబోతున్నారు అని అర్ధం అవుతోంది.

రాజకీయ రాజధానిలోనే :

ఇక విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనకు విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్ ని ఆయన ఎంచుకున్నారు. విజయవాడను రాజకీయ రాజధానిగా పేర్కొంటారు. అందువల్ల అక్కడ నుంచే ఏపీలోని మూడు ప్రాంతాలకూ తన పార్టీ గొంతుక వినిపించాలన్నది ఆయన ఆలోచనగా ఉందని అంటున్నారు. ఇక ఏపీలో కొత్త పార్టీ అవసరం ఏమిటి అన్నది కూడా విజయసాయిరెడ్డి ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఏపీలో రెండు పార్టీలు రెండు కుటుంబాలే ఉన్నాయని ఆయన విమర్శించారు. ఆ రెండు పార్టీల దోపిడీకి ముగింపు పలికేలా కుల మతర్ పిచ్చి రాజకీయాలను తిరస్కరిస్తూ తన పార్టీ వస్తుందని చెప్పారు. అంతే కాదు రెడ్ బుక్ రప్ప రప్ప ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి ఏపీ ప్రజలకు ముక్తి కలిగించేలా తన పార్టీ ఉండబోతోంది అని ఆయన చెబుతున్నారు. అలాగే కరవు కాటకాలు కరెంట్ కోతలు లేని ఏపీని తయారు చేస్తామని ఆయన భరోసా ఇస్తున్నారు.

ఇదే అజెండాగా :

ఏపీ అంటేనే వ్యవసాయ రాష్ట్రం. అందుకే వ్యవసాయానికి తన కొత్త పార్టీ విధానాలలో చోటు ఇచ్చారు. తగిన సాయం చేస్తామని హామీని విజయసాయిరెడ్డి ఇచ్చారు. ప్రతీ ఎకరానికీ రెండు పంటలకు నీరు అందిస్తామని చెప్పారు. అలాగే ప్రతీ ఇంటికీ ఉచిత విద్యుత్ అందిస్తమని ఈ రోజులలో భారంగా మారిన చదువుల విషయంలో ఆ బరువు లేకుండా చూస్తామని చెప్పారు. పెద్ద ఎత్తున యువత ఉపాధి లేక ఇబ్బంది పడుతోంది, అలాంటి వారికి నూరు శాతం ఉద్యోగం ఉపాధి కల్పిస్తామని, పేద మధ్యతరగతి వర్గాల ఆదాయాలు పెంచుతామని కూడా అంటున్నారు. ఏపీలో గత ఎనభై ఏళ్ళుగా ప్రజల ఆకాన్షలు ఏవీ నెరవేరలేదని ఆయన అంటున్నారు. అందుకే ప్రజలు గెలిచే విధంగా వారి కోణంలో తమ పార్టీ విధానం ఉంటుందని గట్టిగా చెబుతున్నారు. జెన్ జీలకు నాయకత్వం దక్కేలా వారిని లీడర్లుగా తయారు చేసే ఒక కర్మాగారంగా తన పార్టీ ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఏపీలో మూడో ఆల్టర్నేషన్ గా వస్తున్న తన పార్టీని ఆదరించాలని విజయసాయిరెడ్డి గట్టిగా కోరుకుంటున్నారు. మొత్తం మీద విజయసాయిరెడ్డి పార్టీ నవంబర్ 11న విడుదల అన్నది మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చేసింది.