Begin typing your search above and press return to search.

విజయనగరంలో బొత్స Vs కిమిడి..?! నాడు సీనియర్లు.. నేడు వారసులు

స్థానిక ఎన్నికల సందర్భంగా విజయనగరం జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతల మధ్య రాజకీయం కాకపుట్టిస్తోంది.

By:  Tupaki Political Desk   |   30 Aug 2026 12:05 PM IST
విజయనగరంలో బొత్స Vs కిమిడి..?! నాడు సీనియర్లు.. నేడు వారసులు
X

స్థానిక ఎన్నికల సందర్భంగా విజయనగరం జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతల మధ్య రాజకీయం కాకపుట్టిస్తోంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, మాజీ మంత్రి బొత్స సత్యానారాయణ మధ్య మరోమారు ప్రతిష్టాత్మక పోరు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో పరస్పరం ఢీకొన్న ఈ ఇద్దరు ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కళావెంకటరావు తాజాగా చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గత ఎన్నికల్లో అనూహ్యంగా చీపురుపల్లి టికెట్ దక్కించుకున్న ఆయన అక్కడ బలమైన నేతగా ఎదిగిన బొత్సను ఓడించారు. బొత్స కూడా చీపురుపల్లి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఈ ఇద్దరు ఉమ్మడి రాష్ట్రంలోను ఆ తర్వాత మంత్రులుగా పనిచేశారు. బొత్స పీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తే, కళావెంకటరావు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ టీడీపీకి అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ విధంగా సమ ఉజ్జీలుగా ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసిస్తున్న ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం రిటైర్మెంటుకు దగ్గరలో ఉన్నారు. దీంతో స్థానిక ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దింపాలని చూస్తున్నారు.

ఒకే సామజికవర్గం, ఒకే నియోజకవర్గం నుంచి తలపడుతున్న కిమిడి కళావెంకటరావు, బొత్స సత్యానారాయణ ప్రస్తుతం ఒకే విధమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ ఇద్దరి కుటుంబాల నుంచి చాలా మంది రాజకీయాల్లో ఉన్నప్పటికీ వారి సొంత పిల్లలకు మాత్రం ఇంతవరకు రాజకీయ పదవులు కట్టబెట్టలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇద్దరికి 70 ఏళ్లు నిండుతుండటంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమ వారసులకు రాజకీయ ప్రవేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే కళావెంకటరావు కుమారుడు రామ్ మల్లిక్ నాయకుడు చీపురుపల్లి నియోజకవర్గంలో తండ్రి తరఫున చురుగ్గా పనిచేస్తున్నారు. అయితే ఆయనకు అధికారిక పదవి లేకపోవడంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీగా బరిలోకి దింపి జడ్పీ చైర్మను చేయాలని కళావెంకటరావు భావిస్తున్నారని చెబుతున్నారు.

ఇదే సమయంలో గత ఎన్నికలలో ఎదురైన పరాభవంతో తిరిగి చీపురుపల్లిలో నిలదొక్కుకోవాలని చూస్తున్న మాజీ మంత్రి బొత్స స్థానిక ఎన్నికలను వేదికగా పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారు. తన కుమార్తెను జడ్పీ చైర్మను అభ్యర్థిగా ఇప్పటకే ఆయన ప్రకటించారు. చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో ఎక్కడో ఒక చోట జడ్పీటీసీగా నిలపాలని ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. అటు టీడీపీలో కూడా ఎమ్మెల్యే కళావెంకటరావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడిని తమ మండలం నుంచి పోటీ చేయాలని నాలుగు మండలాల నేతలు ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. దీంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో సీనియర్ నేతల వారుసల మధ్య పోరు అనివార్యంలా కనిపిస్తోందని చెబుతున్నారు.

ఇక ఇద్దరు సీనియర్ నేతలు తమ వారసులను స్థానిక ఎన్నికల్లో నిలపాలని ఇప్పటికే నిర్ణయించినందున, వారసులు ఇద్దరు పరస్పరం తలపడతారా? లేదా? అన్నదే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్యే కళావెంకటరావు కుమారుడు గరివిడి జడ్పీటీసీగా పోటీకి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బొత్స కుమార్తె అనుష కూడా గరివిడి లేదా మెరకముడిదాం మండలాల నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ ఇద్దరు వారసులు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. కార్యకర్తలతో మమేకమవుతున్నారు. అయితే ఇద్దరు తొలిసారిగా రాజకీయ రణక్షేత్రంలోకి దిగుతుండటమే ఆసక్తి రేపుతోంది.

విజయనగరం జడ్పీ చైర్మను పీఠం గత 20 ఏళ్లలో సుమారు 15 ఏళ్లు బొత్స కుటుంబం చేతిలోనే ఉంది. ప్రస్తుత చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాజీ మంత్రి బొత్సకు స్వయాన మేనల్లుడు. ఈయన ప్రస్తుతం చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని మెరకముడిదాం జడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2006లో బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మి, ఆమె తర్వాత బొత్స కుటుంబానికి చెందిన బడ్డుకొండ అప్పలనాయుడు జడ్పీ చైర్మనుగా పనిచేశారు. ఈ ఇద్దరు తర్వాత బొత్స అనుచరుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కొన్నాళ్లు చైర్మనుగా వ్యవహరించారు. వీరి తర్వాత ఐదేళ్ల పాటు 2014-19 మధ్య టీడీపీ జడ్పీ పీఠాన్ని అధిష్టించింది. ఇప్పుడు వైసీపీ ఖాతాలో ఉన్న ఈ పీఠాన్ని మళ్లీ దక్కించుకోవాలని టీడీపీ పావులు కదుపుతుండగా, ఎమ్మెల్యే కళావెంకటరావు కుమారుడు జడ్పీ చైర్మను పీఠంపై కన్నేయడంతో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమవుతోందని అంటున్నారు. బొత్స కోటను బద్ధలు చేయగలిగే శక్తి తమ కుటుంబానికే ఉందని చెబుతున్న ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ఈ విషయమై టీడీపీ అధిష్టానానికి తెలియజేశారని అంటున్నారు. మొత్తానికి విజయనగరం జడ్పీ పీఠం ఇద్దరు సీనియర్లు, వారి వారసుల మధ్య టగ్ ఆఫ్ వార్ గా మారేలా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.