Begin typing your search above and press return to search.

కార్పొరేట్ వివాదం కాదు.. అన్నాచెల్లెళ్ల మధ్య రచ్చ.. విజయమ్మ ఇంకేం చెప్పారు?

ఇద్దరూ తన పిల్లలు కావటంతో వారి రాజకీయ గొడవల్లో తాను చిక్కుకున్నట్లు పేర్కొన్నారు.

By:  Garuda Media   |   15 Sept 2025 9:38 AM IST
కార్పొరేట్ వివాదం కాదు.. అన్నాచెల్లెళ్ల మధ్య రచ్చ.. విజయమ్మ ఇంకేం చెప్పారు?
X

ఆస్తుల పంపిణీకి సంబంధించి దివంగత మహానేత వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య నడుస్తున్న పంచాయితీకి సంబంధించి చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్పీలెట్ ట్రైబ్యునల్ కు తాజాగా విజయమ్మ కీలక అంశాల్ని నివేదించారు. సరస్వతి పవర్ లిమిటెడ్ లో వాటాల బదలాయింపు.. రిజిస్టర్ లో వాటాదారుల పేర్లు మార్పుపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. దీనికి సంబంధించి విజయమ్మ తాను దాఖలు చేసిన పిటిషన్ లో తన వాదనను వినిపించారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి ఇదేమీ కార్పొరేట్ వివాదం కాదని.. షర్మిలకు జగన్ కు మధ్య ఉన్న రాజకీయ కలహాల్ని పరిష్కరించుకునే ప్రయత్నం తప్పించి మరోటి కాదంటూ ఆమె పేర్కొన్నారు. ఇద్దరూ తన పిల్లలు కావటంతో వారి రాజకీయ గొడవల్లో తాను చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ వివాదానికి కార్పొరేట్ రంగు పులిమి వాటిని తమ రాజకీయ మైలేజీకి వినియోగించుకోవటం విచారకరమని వాపోయారు.

అసలీ వివాదంలోకి వెళితే.. విజయమ్మ.. జనార్దన్ రెడ్డిల పేర్లతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు తీర్మానాన్ని.. దీని ప్రకారం రిజిస్టర్ లో సభ్యుల పేర్లను మార్చటాన్ని జగన్.. భారతీరెడ్డి.. క్లాసిక్ రియాల్టీలు సవాలు చేయటం తెలిసిందే. వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్ తదితరుల పేర్లను పునరుద్ధరించాలని కోరుతూ జులై 29న తీర్పు వెలువడింది.

హైదరాబాద్ లోని జాతీయ కంపెనీ లా అప్పీలెట్ ట్రైబ్యునల్ వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ.. దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ చెన్నైలోని ట్రైబ్యునల్ కు విజయమ్మ అప్పీలు దాఖలు చేశారు. విజయమ్మ తరఫున ఆమె లాయర్ ఈ అప్పీల్ ను దాఖలు చేశారు. ఇందులో భాగంగా విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ లో ఆమె పలు అంశాల్ని ప్రస్తావించారు. ఈ పిటిషన్ ను చెన్నై ట్రైబ్యునల్ త్వరలో విచారించనుంది.

విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. ‘‘1999లో సరస్వతి పవర్ ఏర్పాటైంది. ఈ సంస్థకు గుంటూరులో 903.28 ఎకరాల భూమి ఉంది. వాటాల బదలాయింపునకు ముందు జగన్ కు 29.88 శాతం.. భారతీరెడ్డికి 16.30 శాతం.. క్లాసిక్ రియాల్టీకి 4.83 శాతం.. నాకు (విజయమ్మ) 48.99 శాతం వాటాలున్నాయి. 2021 జులై 26న జగన్ 74.26 లక్షల.. భారతీరెడ్డి 40.50 లక్షల వాటాల్ని ప్రేమతో నా పేరు మీద గిఫ్టు డీడ్ ఇచ్చారు. తర్వాత మాట మార్చి..వాటి ఆధారంగా జరిగిన లావాదేవీలను కార్పొరేట్ వివాదం పేరుతో ప్రశ్నించటానికి వీల్లేదు’’ అని పేర్కొన్నారు.

క్లాసిక్ రియాల్టీతో రూ.3.07 కోట్లు చెల్లించి 11.38 లక్షల వాటాల్ని కొనుగోలు చేశానని.. వాటాలను కానుకగా ఇచ్చినట్లుగా విజయమ్మ పేర్కొన్నారు. ‘‘2021 ఆగస్టు 14న జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో సరస్వతి కంపెనీతో అతనికున్న బంధం ముగించినట్లుగా జగన్ భావించారు. గిఫ్టు ఒప్పందాలను.. వాటాల కొనుగోలు ఒప్పందాల చెల్లుబాటును ఏ సివిల్ కోర్టులోనూ సవాలు చేయలేదు. అలాంటప్పుడు కార్పొరేట్ ముసుగులో వాటిని ట్రైబ్యునల్ లో సవాలు ఎలా చేస్తారు?’’ అని ఆమె ప్రశ్నించారు.

జగన్ తో తాను కలిసి ఉన్నప్పుడే తనకు వాటాల్ని కానుకగా ఇచ్చినట్లుగా పేర్కొన్న విజయమ్మ.. ‘‘అప్పుడు ఒరిజనల్ వాటా సర్టిఫికేట్ లు.. వాటాల బదలాయింపు దరఖాస్తుల్నిఇవ్వగా నాతో వాటిని ఉంచుకున్నా. ఆ తర్వాత ఫ్యామిలీలో వివాదాలు.. విభేదాలు తలెత్తాయి. రాజకీయ విభజనకు దారి తీసింది. ఈ వివాదాల వేళ జగన్ నన్ను.. కుటుంబ సభ్యుల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఒరిజనల్ వాటా సర్టిఫికేట్లను జగన్ ఎస్ సీ ఎల్ టీలో పిటిషన్ వేసిన సమయంలో జత చేయలేదు. కంపెనీ చట్ట నిబంధనల ఉల్లంఘన జరగలేదంటూ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్లను సమర్పించారు’’ అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె కొన్ని ప్రశ్నల్ని సంధించారు. అందులో ముఖ్యమైనది.. ‘‘నేను పిటిషన్ వేసేటప్పుడే ఒరిజినల్ సర్టిఫికేట్లను ఎందుకు సమర్పించ లేదు? 2024 ఆగస్టు 21 న జగన్ ఇచ్చిన మూడులీగల్ నోటీసుల్లో ఈడీ జఫ్తు ఉండగా.. వాటాల బదలాయింపు చేయరాదన్న ఒప్పందానికి విరుద్ధమని మాత్రమే పేర్కొన్నారు. అప్పటికే వాటాలను ఈడీ జఫ్తు చేయలేదు. చట్టబద్ధంగా ఏర్పడిన సరస్వతి కంపెనీని అనవసరంగాఈ వివాదంలోకి లాగారు. తప్పుడు లావాదేవీలపై కంపెనీ చిత్తశుద్ధితోనే వ్యవహరించింది’’ అని విజయమ్మ పేర్కొన్నారు.

2024 జులై రెండున వాటాల బదలాయింపునకు ఆమోదిస్తూ చేసిన తీర్మానం చట్టబద్ధంగానే జరిగిందన్న విజయమ్మ.. కార్పొరేట్ పేరుతో చూపుతున్న కుటుంబ వివాదంగా అర్థం చేసుకోవటంలో హైదరాబాద్ ట్రైబ్యునల్ విఫలమైందన్నారు. ‘‘గిఫ్టు డీడ్ లు.. వాటా కొనుగోలు ఒప్పందాల్ని అమలు చేయటాన్ని వివాదం చేస్తున్నారన్న అంశాల్ని ట్రైబ్యునల్ విస్మరించింది. జగన్ తదితరులు కొనుగోలు ఒప్పందాల్ని తిరస్కరించలేదు. గిఫ్ట్ డీడ్ ల వాస్తవికతను ఏ సిటీ సివిల్ కోర్టులోనూ సవాలు చేయలేదు. సభ్యుల పేర్లను రిజిస్టర్ చేయటాన్ని తిరస్కరించినప్పుడు.. తప్పుగా నమోదు చేసినప్పుడు మాత్రమే ట్రైబ్యునల్ జోక్యం చేసుకోవాలి. అంతే తప్పించి స్వచ్ఛందంగా ఇచ్చిన వాటాలను చట్టప్రకారం బదిలీ చేసినప్పుడు అందులో జోక్యం చేసుకునే పరిధి ట్రైబ్యునల్ కు లేదు. చట్టబద్ధంగా జరిగిన సభ్యుల రిజిస్టర్ లో పేర్ల మార్పుపై జోక్యం చేసుకోవటం సరికాదు’’ అని విజయమ్మ పేర్కొన్నారు.

తన అప్పీల్ పెండింగ్ లో ఉన్న వేళ ట్రైబ్యునల్ ఉత్తర్వులను అమలు చేస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోతే సెటిల్ కాని 99.75 శాతం వాటా అస్తవ్యస్తమవుతుందని.. కార్పొరేట్ కంపెనీ నిర్వహణ అస్థిరపడుతుందన్నారు. మూడో పార్టీ హక్కులపై ప్రభావం పడుతుందన్నవిజయమ్మ.. ‘‘సభ్యుల రిజిస్టర్ పై స్టేటస్ కో కొనసాగిస్తే.. జగన్.. భారతీరెడ్డి.. క్లాసిక్ రియాల్టీలకు ఎలాంటి నష్టం వాటిల్లదు. ట్రైబ్యునల్ ఉత్తర్వులతో పాటు జగన్.. భారతి.. క్లాసిక్ రియాల్టీల పేర్లను తప్పుగా పునరుద్ధరిస్తే నాకు నష్టంతో పాటు మరిన్ని వివాదాలకు తెర తీసినట్లు అవుతుంది’’ అని విజయమ్మ తాను దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చెన్నై ట్రైబ్యునల్ ఏ రీతిలో స్పందిస్తుందో చూడాలి.