Begin typing your search above and press return to search.

రాములమ్మ అల్టిమేటం.. కాంగ్రెస్‌కు షాక్.. ?

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ‘రాములమ్మ’ రూట్ మార్చబోతున్నారా? పార్టీ అధిష్ఠానం ఇచ్చిన పదవిపై ఆమె అసంతృప్తిగా ఉన్నారా? అంటే అవుననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు.

By:  Garuda Media   |   14 Jun 2026 5:00 AM IST
రాములమ్మ అల్టిమేటం.. కాంగ్రెస్‌కు షాక్.. ?
X

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ‘రాములమ్మ’ రూట్ మార్చబోతున్నారా? పార్టీ అధిష్ఠానం ఇచ్చిన పదవిపై ఆమె అసంతృప్తిగా ఉన్నారా? అంటే అవుననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేరిన సీనియర్ నేత, సినీ నటి విజయశాంతి.. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. పదవులు ఉన్నా లేకపోయినా తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించే విజయశాంతి, ఇప్పుడు కాంగ్రెస్ తీరుపై కొంత అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇటీవల ఆమెకు కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. అసలు సీనియర్ల లిస్టులోనే లేని ఆమె పేరు తెరపైకి రావడం, నేరుగా ఢిల్లీ స్థాయిలోనే లాబీయింగ్ చేసి పదవి దక్కించుకోవడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే, ఈ ఎమ్మెల్సీ పదవిపై రాములమ్మ అస్సలు హ్యాపీగా లేరన్నది ఇన్‌సైడ్ టాక్. తన సీనియారిటీకి, ఇమేజ్‌కు కేవలం శాసనమండలి సభ్యురాలిగా ఉండటం సరిపోదని, తన అసలు రేంజ్ మంత్రి పదవి అని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.

ఈ అసంతృప్తి కారణంగానే విజయశాంతి పార్టీ అధికారిక కార్యక్రమాలకు పెద్దగా హాజరుకావడం లేదని తెలుస్తోంది. కేవలం శాసనమండలి సమావేశాలకు మాత్రమే వస్తూ, అదీ మొక్కుబడిగా ప్రశ్నలు వేసి వెళ్ళిపోతున్నారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. పైగా, మొన్నటి మొన్న జరిగిన మండలి సమావేశాల్లో సొంత ప్రభుత్వంపైనే ఆమె కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం, పరోక్షంగా తన అక్కసును వెళ్లగక్కడం కాంగ్రెస్ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. ఈ పరిణామాలు చూస్తుంటే రాములమ్మ కాంగ్రెస్‌కు ఏదో ఒక గట్టి అల్టిమేటం ఇవ్వబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో, విజయశాంతి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక్కడి స్థానిక నేతలతో సంబంధం లేకుండా, నేరుగా హైకమాండ్‌నే ఢిల్లీలో కలవాలని ఆమె డిసైడ్ అయినట్లు టాక్. ఇప్పటికే మంత్రి పదవుల కోసం పలువురు ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా, రాములమ్మ మాత్రం ఒక పక్కా ప్లాన్‌తో హస్తిన బాట పడుతున్నారట. తనకు కనుక మంత్రి పదవి ఇస్తే.. పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ మైలేజ్‌కు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తానో వివరించడానికి విజయశాంతి ఒక ప్రత్యేక బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కాగా, గ‌తంలో ఎవరూ ఊహించని విధంగా ఎమ్మెల్సీ పదవిని సొంతం చేసుకున్న రాములమ్మ, అదే జోష్‌తో ఇప్పుడు మంత్రి పదవిని కూడా సాధించుకుంటే ఆశ్చర్యపోనక్కర్లేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మరి ఢిల్లీ పెద్దలు రాములమ్మ డిమాండ్‌కు తలొగ్గుతారా? లేదా అనేది రానున్న రోజుల్లో చూడాలి.