Begin typing your search above and press return to search.

ఇది అత్తాకోడళ్ల పోరు ఉల్లా.. రాజకీయ హీట్ తో పాటు ఫన్ గ్యారెంటీ.. ఎంజాయ్ చేయిండ్రి..

"ఇంట్లో పోట్లాడుకుంటే పొరుగింటి కొంప మునుగుతుందేమో కానీ.. రాజకీయాల్లో పోట్లాడుకుంటే మాత్రం జనం కుర్చీలేసుకుని మరీ చూడాల్సిందే" కర్నూలు మేయర్ సీటు కోసం ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోంది

By:  A.N.Kumar   |   17 Oct 2026 10:36 PM IST
ఇది అత్తాకోడళ్ల పోరు ఉల్లా.. రాజకీయ హీట్ తో పాటు ఫన్ గ్యారెంటీ.. ఎంజాయ్ చేయిండ్రి..
X

"ఇంట్లో పోట్లాడుకుంటే పొరుగింటి కొంప మునుగుతుందేమో కానీ.. రాజకీయాల్లో పోట్లాడుకుంటే మాత్రం జనం కుర్చీలేసుకుని మరీ చూడాల్సిందే" కర్నూలు మేయర్ సీటు కోసం ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోంది. నిన్నటివరకు పండుగలు, పబ్బాలకు ఒకే ఇంట్లో సరదాగా కబుర్లు చెప్పుకున్న అత్తాకోడళ్లు.. ఇప్పుడు గడప దాటి పొలిటికల్ గ్రౌండ్‌లో 'ఢీ అంటే ఢీ' అంటున్నారు..

ఒకవైపు టీడీపీ తరఫున అల్లుడి తరఫు చుట్టం.. కోడలు వరుసయ్యే బొల్లెద్దుల విజయ ప్రత్యూష నడుము బిగిస్తే.. మరోవైపు వైసీపీ నుంచి అత్త వరుసయ్యే సుశీల సై అంటున్నారు. దీంతో కర్నూలు కార్పొరేషన్ పోరు కాస్తా.. పక్కా "అత్తాకోడళ్ల మెగా డైలీ సీరియల్"ను తలపిస్తోంది!

పార్టీల పంచాయితీ.. అత్తాకోడళ్ల సవాల్

టీడీపీ సీనియర్ నేత బొల్లెద్దుల రామకృష్ణ కూతురైన విజయ ప్రత్యూషకు 52వ వార్డు కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. పైగా స్థానిక మంత్రి టీజీ భరత్ గారి దయాకటాక్షాలు, అధిష్ఠానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. "నాకు స్థానిక సమస్యలపై పట్టుంది.. మేయర్ పీఠం నాదే" అని ఆమే అంటుంటే.. "ఆగు కోడలా.. మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ ఇల్లు మాది, వైసీపీ బలం నాది.. నేనుండగా నీకేలా వస్తుంది ఆ సీటు?" అంటూ అత్త సుశీల గారూ గట్టిగానే గర్జిస్తున్నారు.

ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏమిటంటే.. సుశీల కుమారుడిని విజయ ప్రత్యూష సోదరి పెళ్లి చేసుకుంది. అంటే బంధుత్వాలు పక్కన పెడితే వీరిద్దరూ పక్కా అత్తాకోడళ్లే.. టీడీపీ అస్త్రం ఏంటంటే.. పార్టీ విధేయత, కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం, మంత్రి గారి ఆశీస్సులు ఉండడం ఆమెకు ప్లస్సు... ఇక వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కుటుంబ నేపథ్యం, వైసీపీ క్యాడర్ అండదండలున్నాయి..

వీళ్ల ఎన్నికల పంచాయితీ పోరును.. "బాబోయ్ రేపు ప్రచారంలో అత్తాకోడళ్లు ఎదురైతే కాళ్లకు దండం పెట్టి ఓటు అడుగుతారా? లేక 'నేను గెలిచాక నీ సంగతి చెప్తా' అని బెదిరించుకుంటారా?" అని కర్నూలు పౌరులు సరదాగా నవ్వుకుంటున్నారు.

గెలుపెవరిది? పంచాయితీ ఎవరిది?

సాధారణంగా ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య పోరు వస్తే మధ్యలో నలిగిపోయేది పాపం ఇంట్లోని మగవాళ్లే.. కానీ ఇక్కడ పరిస్థితి వేరు.. వీరి పోరులో గెలుపోటములు తేల్చాల్సింది కర్నూలు ఓటర్లు.

కుటుంబ వేడుకల్లో ఒకరికొకరు వడ్డించుకునే పిండివంటల నుంచి.. ఎన్నికల సభల్లో ఒకరిపై ఒకరు విసురుకునే విమర్శల బాణాల వరకు ఈ 'అత్తాకోడళ్ల సమరం' ఏ తీరానికి చేరుతుందో చూడాలి. బంధుత్వాలకు ఓటేస్తారా? లేక పార్టీ జెండాలకే మొగ్గు చూపుతారా అనేది వేచి చూడాల్సిందే.. ఏది ఏమైనా కర్నూలు మేయర్ ఎన్నిక మాత్రం జనానికి కావాల్సినంత పొలిటికల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందనడంలో సందేహమే లేదు.