Begin typing your search above and press return to search.

సీఎం విజయ్ మరింత పవర్‌ఫుల్! అయినా కాంగ్రెస్ ఆసరా తప్పదు

ఉప ఎన్నికల కారణంగా బలం పుంజుకున్న ముఖ్యమంత్రి విజయ్ ఇక విపక్షాలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   9 Oct 2026 9:19 PM IST
సీఎం విజయ్ మరింత పవర్‌ఫుల్! అయినా కాంగ్రెస్ ఆసరా తప్పదు
X

తమిళనాడు ముఖ్యమంత్రి దళ పతి విజయ్ మరింత పవర్ ఫుల్ అయ్యారు. రాష్ట్రంలో ఉప ఎన్నికల జరిగిన రెండు నియోజకవర్గాల్లో టీవీకే ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ బలం 109 స్థానాలకు పెరిగింది. మధురాంతకం, ధారా పురం నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా, విజయ్ పార్టీ రెండు చోట్లా పాగా వేసింది. మధురాంతకంలో 17 వేల ఓట్ల మెజార్టీ రాగా, ధారా పురంలో కూడా పదివేలకు పైగా మెజార్టీ సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను అన్నాడీఎంకే గెలుచుకుంది. ఉప ఎన్నికల్లో ఈ రెండు స్థానాలు టీవీకే పరమయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలను టీవీకే గెలుచుకుంది. ముఖ్యమంత్రి విజయ్ రెండు స్థానాల్లో గెలవడంతో ఒకదానికి రాజీనామా చేయడంతో అసెంబ్లీలో టీవీకే బలం 107గా ఉంది. తాజాగా రెండు స్థానాలు గెలుచుకోవడంతో టీవీకే బలం 109 స్థానాలకు పెరిగింది.

అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు నెలలకు జరిగిన ఉప ఎన్నికల్లో విపక్షానికి చెందిన రెండు స్థానాలను టీవీకే కైవసం చేసుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఈ ఎన్నికలతో తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని అంటున్నారు. గత ఎన్నికల్లో మధురాంతకం నుంచి కె.మరగతం కుమార వేల్, ధారా పురం నుంచి సత్యభామ గెలిచారు. అప్పట్లో అన్నాడీఎంకే తరపున ఎన్నికైన ఈ ఇద్దరు ప్రభుత్వం ఏర్పాటైన వారం రోజులకే తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం టీవీకేలో చేరారు. ఇక ఉప ఎన్నికల్లో టీవీకే తరఫున బరిలో దిగి మళ్లీ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

తాజా ఉప ఎన్నికల్లో మధురాంతకం నుంచి పోటీ చేసిన కే.మారగతం కుమారవేళ్ తన మెజార్టీని పెంచుకున్నారు. గత ఎన్నికల్లో 7,194 ఓట్లతో మెజార్టీతో గెలిచిన కుమార వేల్ తాజా ఉప ఎన్నికల్లో 20 వేల ఓట్ల ఆధిక్యం ప్రదర్శించారు. అదే సమయంలో ధారాపురం ఎమ్మెల్యే సత్యభామ మెజార్టీ భారీగా తగ్గిందని రికార్డులు చెబుతున్నాయి. గత సాధారణ ఎన్నికల్లో ధారా పురం నుంచి సత్యభామ 16,727 ఓట్ల ఆధిక్యంతో గెలవగా, తాజా ఉప ఎన్నికల్లో 9,471 ఓట్ల మెజార్టీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో డీఎంకే నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న సత్యభామ ఈ సారి కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. అయితే గతంలో అన్నాడీఎంకే తరఫున గెలిచిన ఆమె తాజాగా టీవీకే అభ్యర్థిగా మారడంతో ఆ పార్టీ ఓట్లు భారీగా చీలిపోయాయని చెబుతున్నారు.

ఇక తాజా ఉప ఎన్నికల ఫలితాలతో తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. విజయ్ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదని గతంలో ప్రతిపక్షం డీఎంకే హెచ్చరించగా, ఇప్పుడు రెండు స్థానాలు గెలుచుకుని తమ పార్టీ మరింత బలపడిందని సీఎం విజయ్ సంకేతాలు పంపారని అంటున్నారు. 234 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు 118 స్థానాలు అవసరం ఉంది. అయితే అధికార పార్టీ టీవీకే 109 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ సొంతంగా ప్రభుత్వాన్ని నడిపే బలం లేక మిత్రపక్షాలపై ఆధారపడింది. గత ఎన్నికల సమయంలో డీఎంకే కూటమి తరఫున పోటీ చేసిన కాంగ్రెస్ ఐదు, కమ్యూనిస్టులు 4, వీసీకే 2 స్థానాల మద్దతుతో ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక తాజా ఉప ఎన్నికలతో 107 నుంచి 109 స్థానాలకు విజయ్ బలం పెరిగినా, ఇంకా కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడాల్సి వుందని అంటున్నారు.

ఉప ఎన్నికల కారణంగా బలం పుంజుకున్న ముఖ్యమంత్రి విజయ్ ఇక విపక్షాలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలోనే అన్నాడీఎంకేలో చీలిక రాగా, ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులను వదులుకుని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఆ ఇద్దరే టీవీకే తరఫున మళ్లీ గెలిచారు. దీంతో అన్నాడీఎంకేపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు గోడ దూకే అవకాశం ఉందేమోనని అనుమానిస్తున్నారు. అదే జరిగితే తమిళనాడులో మరో ఉప ఎన్నికల సమరం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్, డీఎంకే మధ్య తెగిపోయిన బంధం తిరిగి పునరుద్ధరించేందుకు జరుగుతున్న ఏర్పాట్లు విజయ్ ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయని చెబుతున్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనలకు డీఎంకే మద్దతు కోరుతూ శివసేన (ఉద్ధవ్) పార్టీ చేస్తున్న ప్రయత్నాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ టీవీకే ప్రభుత్వం నుంచి వైదొలగాలని డీఎంకే డిమాండ్ చేయొచ్చని అంటున్నారు. అప్పుడు ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి తమిళనాడులో జరిగిన రెండు ఉప ఎన్నికలలో ప్రజలు టీవీకే పార్టీకి పట్టం కట్టినా, విపక్షాల నుంచి అంతే సవాల్ ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.