‘విజిల్’ వేసిన విజయ్.. ఇక యుద్ధమే అంటూ ప్రకటన
తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల మధ్యలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరనున్నాయి. దీంతో కొత్త పార్టీ పెట్టిన సినీ నటుడు దళపతి విజయ్ స్పీడ్ పెంచారు.
By: Tupaki Political Desk | 26 Jan 2026 9:00 AM ISTతమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల మధ్యలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరనున్నాయి. దీంతో కొత్త పార్టీ పెట్టిన సినీ నటుడు దళపతి విజయ్ స్పీడ్ పెంచారు. తన పార్టీ తమిళగ వెట్రి కగజం (టీవీకే)కి కేటాయించిన ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. మహాబలిపురంలో జరిగిన బహిరంగ సభలో పార్టీ ఎన్నికల గుర్తును ప్రజలకు పరిచయం చేసిన విజయ్.. సమర శంఖం పూరించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేయడంతోపాటు తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికలను పార్టీల మధ్య పోటీగానే చూడొద్దని, ఎన్నికలు అత్యంత కీలకమైన ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రకటించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు పోటీ చేసి గెలిచే సత్తా తన పార్టీకి ఉందని టీవీకే అధినేత విజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్నా డీఎంకే ప్రత్యక్షంగా, అధికార డీఎంకే పరోక్షంగా కేంద్రంలోని అధికార బీజేపీకి తలొగ్గాయని ఆరోపించారు. తమిళనాడులో అవినీతి అంతానికి సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. డీఎంకే ప్రభుత్వాన్ని ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు జరగబోయేది కేవలం ఎన్నిక కాదు, ఒక ప్రజాస్వామ్య యుద్ధం దీనికి నాయకత్వం వహించబోయే సేనాపతులు మీరే. ప్రస్తుతం అధికారంలో ఉన్న దుష్టశక్తుని గతంలో రాష్ట్రాన్ని పాలించిన అవినీతి శక్తిని ఎదుర్కొనే ధైర్యం తన పార్టీకి మాత్రమే ఉందని విజయ్ వెల్లడించారు.
ఇక ఈ సందర్భంగా ఎన్నికల పొత్తుపైనా విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు తనను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమని, 234 స్థానాల్లో గెలిచే దమ్ము ఉందని ధీమా వ్యక్తం చేశారు. తనను అణచివేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘మా కోసం ఎవరూ నిలబడరని అంటున్నారు. గత 30 ఏళ్లుగా ఈ పార్టీలు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూనే ఉన్నాయి. కానీ ప్రజలు తనపై నమ్మకం ఉంచుతున్నారు. నిర్ణయాత్మకంగా అంచనా వేస్తున్నారని విజయ్ కుండ బద్దలు కొట్టారు. అయితే ప్రజలు తననొక్కడినే కాకుండా తనతో ఉన్నవారిపైనా నమ్మకం ఉంచాలని కోరారు. ఎవరి కోసమో రాజీ పడకూడదని, అందరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
కాగా, పార్టీ ఎన్నికల గుర్తును ఆవిష్కరించే సమయంలో విజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విజిల్ గుర్తును ఆవిష్కరించి ప్రజలను ఉర్రూతలూగించేలా విజిల్ వేశారు. ఆయన అలా విజిల్ వేస్తుండగా, వేదిక ముందు ఉన్న కార్యకర్తలు సైతం విజిల్ వేస్తున్నారు. అంతేకాకుండా 2019లో ఆయన నటించిన చిత్రం విజిల్ లోని కప్పు ముఖ్యం బిగిల్ అని డైలాగ్ వేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు విజిల్ గుర్తుపై అనేక నినాదాలు చేశారు. తమిళనాడులో మార్పు తీసుకొచ్చేది విజిల్ అంటూ నినదించారు. మొత్తానికి ఈ సభ ద్వారా పొత్తులు ఉండవని, ఒంటరిగానే పోటీ చేస్తానని విజయ్ స్పష్టత ఇచ్చారని అంటున్నారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో త్రిముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. విజయ్ పోటీ అధికార, విపక్షాల్లో ఎవరి కొంప ముంచుతుందనే ఉత్కంఠకు తెరతీసింది.
