Begin typing your search above and press return to search.

విజయ్ ఘన విజయం.. రికార్డు ఎన్టీఆర్ దే !

తమిళనాడు ఎన్నికలను కీలక మలుపు తిప్పారు దళపతి విజయ్. 18 ఏళ్లకే వెండి తెర మీద హీరో అయిన విజయ్ 52 ఏళ్ళ వయసులో సీఎం అవుతున్నారు.

By:  Satya P   |   4 May 2026 11:00 PM IST
విజయ్ ఘన విజయం.. రికార్డు  ఎన్టీఆర్ దే !
X

తమిళనాడు ఎన్నికలను కీలక మలుపు తిప్పారు దళపతి విజయ్. 18 ఏళ్లకే వెండి తెర మీద హీరో అయిన విజయ్ 52 ఏళ్ళ వయసులో సీఎం అవుతున్నారు. తమిళనాడులో పిన్న వయసులో సీఎం లు అయిన వారి జాబితాలో ఆయన చేరుతున్నారు. ఇక తమిళనాడుని ఇప్పటిదాకా ఎనిమిది మంది మాత్రమే పాలించారు. విజయ్ తొమ్మిదవ సీఎం గా ప్రమాణం చేయబోయేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దక్షిణాదిన తమిళనాడు తెలుగు నాట మాత్రమే ప్రత్యేకమైనది ఒకటి ఉంది. అదే సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వెళ్ళి రాణించడం. అలా ఎన్టీఆర్ తెలుగునాట ఆ ఫీట్ సాధిస్తే తమిళనాడులో ఎంజీఆర్ జయలలిత సాధించారు. ఇక ఎన్టీఆర్ కి ఎవరికీ లేని ఒక రికార్డు ఉంది. అది గిన్నిస్ బుక్ లో పదిలంగా ఉంది. పార్టీని పెట్టిన తరువాత కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే ఉమ్మడి ఏపీకి సీఎం అయిపోయారు. ఆ రికార్డుని మాత్రం విజయ్ బ్రేక్ చేయలేకపోయారు.

అంతవరకే పోలిక :

ఇక విజయ్ ని తెలుగు నాట ఎన్టీఆర్ తో పోలుస్తూ చాలా మంది విశ్లేషిస్తున్నారు. కానీ ఆ పోలిక కేవలం సినీ రంగం నుంచి నేరుగా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి సీఎం కావడం వరకు మాత్రమే పరిమితం అని అంటున్నారు. అలా కొంత వరకూ మాత్రమే విజయ్ ఎన్టీఆర్ ల రాజకీయ ప్రయాణం తో పోలిక పెట్టవచ్చు అని అంటున్నారు. కానీ రికార్డులు రాజకీయంగా బద్ధలు అయ్యాయి అంటే అది ఎన్టీఆర్ తోనే. ఆ రికార్డుని ఇప్పటిదాకా ఎవరూ బ్రేకు చేయలేదు అని గుర్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ కి అతి సమీపంలోకి వచ్చిన వారు ఆప్ అధినేత కేజ్రీవాల్. ఆయన పార్టీ పెట్టిన 13 నెలలలోనే ఢిల్లీకి సీఎం అయిపోయారు. అదే విజయ్ అయితే 2024 ఫిబ్రవరి 2న పార్టీ పెట్టారు. ఇపుడు సీఎం అవుతున్నారు. అంటే 27 నెలల సమయం అన్న మాట.

ఎన్నో సవాళ్ళు దాటి :

అయితే ఆనాటి ఎన్టీఆర్ కి లేని సవాళ్ళు ఎన్నో విజయ్ కి ఉన్నాయి. ఆనాడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ మాత్రమే అధికార పక్షం గా ఉంది. బలమైన ప్రతిపక్షం లేదు, భారీగా రాజకీయ శూన్యత ఉంది. దాన్ని ఎన్టీఆర్ బాగా వినియోగించుకున్నారు. అదే తమిళనాడులో విజయ్ పరిస్థితి అలా కాదు. బలమైన రెండు ద్రవిడ పార్టీలు ఉన్నాయి. డీఎంకే క్షేత్ర స్థాయి నుంచి ఎంతో బలంగా ఉన్న పార్టీ అయితే అన్నా డీఎంకేకి గ్రౌండ్ లెవెల్ లో భారీ ఎత్తున క్యాడర్ తో పాటు కేంద్రంలో ఎన్డీయే అండ ఉంది. ఇలా రెండు స్ట్రాంగ్ ఫోర్స్ లతో ఒకే సమయంలో రాజకీయ పోరాటం చేయడం త్రిముఖ పోటీలో కొత్త పార్టీని దించడం అసలైన సవాల్ గా విజయ్ ముందు ఉంది. అంతే కాదు అనేక వ్యక్తిగత అంశాలు కూడా విజయ్ ని పట్టి పీడించాయి. ఆయన విడాకుల కేసుని జనం లోకి తెచ్చారు. ఇక ఆయన అఖరు సినిమా అయిన జన నాయగన్ కి సెన్సార్ సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. ఆ తరువాత ఆ సినిమా లీక్ అయింది. ఇక కరూర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో విజయ్ ఒంటరి పోరాటమే చేశారు. అటు రాజకీయంగా కార్నర్ అయ్యారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరిగింది. ఆయన్ని అనేక సార్లు ఢిల్లీకి కూడా సీబీఐ వారు పిలిపించారు.

ప్రజాదరణ ఓట్లుగా :

అయితే ఈ కేసులు వ్యక్తిగత సమస్యలు విజయ్ ని ఇబ్బంది పెట్టినా ఆయన ఎక్కడా తల వంచకుండా దించకుండా పోరాడారు. బహుశా అదే ఆయన్ని జనంలో హీరోగా నిలబెట్టింది అని చెప్పాలి. ఆ మీదట చూస్తే తన సభలకు వచ్చే జనాలను వారి ఆదరణను పూరిగా ఓట్ల రూపంలో మార్చుకున్న ఘనత విజయ్ దే. గతంలో ఎన్టీఆర్ కి ఇదే జరిగింది. ఆయన సభలకు ఎవరైతే వచ్చారో వారంతా ఓట్లు వేశారు విజయ్ కి యూత్ నుంచి అన్ని వర్గాల ప్రజలు ఓటు వేసి అధికారానికి దగ్గరగా నిలబెట్టారు. మరో వైపు రజనీ కాంత్ వంటి వారు రాజకీయాలకు ఒక దండం పెట్టేస్తే కమల్ హాసన్ పాలిటిక్స్ ని సీరియస్ గా తీసుకోలేదు అన్న విమర్శలు ఉన్నాయి. విజయ్ మాత్రం తన కంటే ముగ్గురు సీనియర్లు అయిన ఎంజీఆర్ ఎన్టీఆర్ జయలలితల సరసన చేరి సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో సక్సెస్ అయి సీఎం అవుతున్నారు.