Begin typing your search above and press return to search.

తొక్కిసలాట ఘటన.. టీవీకే అధినేత విజయ్‌ కీలక నిర్ణయం!

అవును... వారాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోన్న టీవీకే పార్టీ చీఫ్‌ విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... తాను చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

By:  Raja Ch   |   1 Oct 2025 5:52 PM IST
తొక్కిసలాట ఘటన.. టీవీకే అధినేత విజయ్‌  కీలక నిర్ణయం!
X

ఇటీవల సినీనటుడు, టీవీకే అధినేత విజయ్‌ ప్రచార సభలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41మంది మృతిచెందగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ సమయంలో టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అవును... వారాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోన్న టీవీకే పార్టీ చీఫ్‌ విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... తాను చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ చేపట్టిన ఈ రాష్ట్ర వ్యాప్త పర్యటనలను రెండు వారాల పాటు వాయిదా వేశారు!

ఈ నేపథ్యంలో టీవీకే 'ఎక్స్‌' వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా... తొక్కిసలాట ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన బాధ, దుఃఖం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే రెండు వారాల పాటు బహిరంగ సభ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని.. కొత్త షెడ్యూల్‌ ను తర్వాత ప్రకటిస్తామని పార్టీ హెడ్‌ క్వార్టర్స్‌ సెక్రటేరియట్‌ ప్రకటించింది.

విజయ్ ఎమోషనల్ వీడియో విడుదల!:

కరూర్ లో జరిగిన ఈ తొక్కిసలాట ఘటన విషయంలో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఏకసభ్య కమిషన్ ను నియమించగా... మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో... టీవీకే పార్టీ కరూర్‌ జిల్లా కార్యదర్శి మథియాళన్‌, సౌత్‌ సిటీ కోశాధికారి పౌన్‌ రాజ్‌ లను అరెస్టు చేశారు.

ఈ నేపథ్యంలో మంగళవారం విజయ్ ఓ ఎమోషనల్‌ వీడియోను విడుదల చేశారు. అందులో.. త్వరలోనే బాధిత కుటుంబాలను కలుస్తానని తెలిపారు. అనంతరం.. స్టాలిన్‌ ప్రభుత్వానికి బలమైన సందేశం పంపారు. ఇందులో భాగంగా... 'సీఎం సార్‌.. మీకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన ఉంటే.. మీరు నన్నేదైనా చేయండి. పార్టీ కార్యకర్తల్ని మాత్రం టచ్‌ చేయొద్దు' అని పేర్కొన్నారు.